Telangana SI exams: ఎస్సై, ఏఎస్సై తుది పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

Telangana SI Exams: ఎస్సై, ఏఎస్సై తత్సమాన పోస్టుల భర్తీకి ఈ నెలలో జరిగే తుది పరీక్షలకు హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తెలంగాణ పోలీస్‌ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Published : 03 Apr 2023 15:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎస్సై (Telangana SI Exams), ఏఎస్సై తత్సమాన ఉద్యోగాల భర్తీకి ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తుది పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డు (TSLPRB) అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌ టికెట్లు పొందొచ్చు.  ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తిచేసుకున్న అభ్యర్థులు..   ఏప్రిల్ 8, 9 తేదీల్లో  తుది పరీక్షలు రాయాల్సి ఉంటుంది.  ఉదయం 10 గంటల నుంచి 1 వరకు; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.  తుది పరీక్ష రాసే అభ్యర్థులంతా ఈరోజు నుంచి నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏదైనా కారణంతో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కాకపోతే support@tslprb.inకు మెయిల్‌ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని నియామక మండలి ఛైర్మన్‌ ఇటీవలే తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత దాన్ని ఏ4 సైజ్‌ కాగితంపై ప్రింట్‌ తీసుకొని, నిర్ణీత ప్రాంతంలో పాస్‌పోర్ట్‌ ఫొటో అంటించాలని సూచించారు. ఫొటో గుర్తింపులేని వారిని అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా... వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందని ఛైర్మన్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లలో నిర్వహించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని