Lunch Box: పిల్లలకు హెల్దీ లంచ్‌బాక్స్‌.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!

పాఠశాలలు మొదలయ్యాయి.  బడికి వెళ్లే పిల్లలకు లంచ్‌బాక్స్‌ ఏం పెట్టాలనే విషయంలో అయోమయానికి గురికాకుండా కొన్ని టిప్స్‌, సూచనలు మీకోసం..

Published : 18 Jun 2024 08:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగింది.. స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉన్న ఇళ్లల్లో హడావుడి మొదలైంది.. యూనిఫామ్‌, పుస్తకాలూ, బ్యాగూ, షూ.. ఇవన్నీ ఒక ఎత్తయితే, వారికి లంచ్‌ బాక్స్‌ ప్యాక్‌ చేయడం మరో పెద్ద పని! రోజూ ఏం వండి బాక్స్‌ పెట్టాలి? ఏం పెడితే ఇష్టంగా తింటారు? అని ఇంట్లో తల్లులు తెగ ఆలోచిస్తూ కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టే కొన్ని చిట్కాలు, సూచనలు ఇవిగో..

  • పిల్లలకు లంచ్‌ ఏం ప్రిపేర్‌ చేయాలా అని ఆలోచించి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో ఆందోళన పడుతుంటారు చాలా మంది పేరెంట్స్‌. అందువల్ల ఈ వారం మీ పిల్లలకు ఏం వండి పెట్టాలనుకుంటున్నారో ఒక లిస్ట్‌ ముందే రెడీ చేసుకోండి. అందుకు అవసరమైన సరకులు కొని తెచ్చి ఇంట్లో సిద్ధంగా ఉంచుకోండి. రోజూ ఒకేరకమైన డిష్‌ కాకుండా రకరకాల ఆహార పదార్థాలు ఉండేలా చక్కగా ప్లాన్‌ చేసుకుంటే.. బాక్స్‌ పెట్టే చివరి నిమిషంలో ఒత్తిడి ఉండదు.
  • భోజనం రెడీ చేసి బ్యాగ్‌లో సర్దే ప్రక్రియలో పిల్లల్ని భాగస్వాముల్ని చేయండి. వారి లంచ్‌ బాక్స్‌లో వారికి ఏం కావాలో అడిగి ఆ మేరకు ప్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే మేలు. దీనివల్ల మీ పిల్లలు తినని పదార్థాలేంటో, వారికేం కావాలో తెలుస్తుంది.
  • లంచ్‌ బాక్స్‌లో కూర, అన్నం మాత్రమే కాకుండా.. పండ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటి విటమిన్లు, ప్రొటీన్లు ఉండే వాటినీ బాక్స్‌లో ప్యాక్‌ చేసి పెట్టాలి. అలాగైతే పిల్లలు ఇష్టంగా తినే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆరోగ్యంగా, నిత్యం ఎనర్జిటిక్‌గా ఉంటారు.
  • విరామ సమయంలో తినేందుకు పల్లీపట్టి, డ్రైఫ్రూట్స్‌, పలు రకాల గింజల (నట్స్‌)తో చేసిన లడ్డూలు, లేదా అరటిపండు పెడితే మంచిది. 
  • రెడీ చేసిన లంచ్‌ని పెట్టేందుకు నాణ్యమైన బాక్స్‌ను ఎంపిక చేసుకోండి. అన్నీ కలిపి ఉంచేలా కాకుండా వేటికవి వేరుగా ఉండేలాంటి బాక్స్‌లలో ప్యాక్‌ చేసేలా జాగ్రత్త పడండి. హాట్‌ బాక్సుల్లో ఆహారం ఉంచితే సరైన ఉష్ణోగ్రతలో తాజాగా ఉంటుంది.
  • ఐదారేళ్లలోపు పిల్లల పొట్ట మరీ చిన్నగా ఉంటుంది. వాళ్లు కొంచెం కొంచెమే తినగలరు. అందుకే మీల్స్‌, స్నాక్స్‌ రూపంలో రోజుకి కనీసం ఆరుసార్లు తినేలా చూసుకోవాలి. పైగా నిరంతరం ఆడుతుంటారు కాబట్టి పెద్దవాళ్లతో పోలిస్తే వాళ్లకి శక్తి చాలా అవసరం. కాబట్టి బాక్సు సైజు మీద కాకుండా అందులో పెట్టే ఆహారం విషయంలోనే శ్రద్ధ వహించాలంటున్నారు పోషకాహార నిపుణులు.
  • మీ పిల్లలు బాగా తినేవేంటో గమనించండి. వారంలో ఆరు లేదా ఐదు రోజులకీ పక్కాగా ప్రణాళిక వేసుకోండి. అదీ పిల్లల్నే అడిగి చేసుకుంటే మంచిది. అన్నం, కూర కన్నా ఆ రెండింటినీ కలిపి చేసిన రైస్‌ వెరైటీ చాలామందికి నచ్చుతుంది. అందుకే పాలక్‌, టమాటా, క్యారెట్‌, బీట్‌రూట్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌, జీరా, పనీర్‌, ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌.. వంటి వాటిని రైతా కాంబినేషన్‌తో వారం మెనూలో రెండు రోజులకోసారి చొప్పున రెండు రోజులపాటు చేర్చొచ్చు.
  • మిగిలిన నాలుగు రోజుల్లో మెంతి, పాలకూర, మునగాకు, ఆలూ... వంటి వాటిని కలిపి చేసిన చపాతీ లేదా పరోటా; కూరగాయ ముక్కలన్నీ కలిపి చేసిన నూడుల్స్‌ లేదా పాస్తా; సేమ్యా ఉప్మా లేదా ఊతప్పం; పొంగణాలూ, ఇడ్లీ, దోశ లేదా చోళె బతూరా; శాండ్‌విచ్‌ లేదా పిజ్జా.. వంటివి పెడితే ఇష్టంగా తింటారు.
  • ఒక వారం పెట్టినవి ఆ తరువాతి వారం పెట్టకుండా ఐటమ్స్‌ మార్చుకుంటూ వెళితే ఒకే రకం తింటున్నామన్న ఫీల్‌ కలగదు. ఉదాహరణకు ఈ వారంలో చపాతీ పెడితే వచ్చే వారం పరోటా చేయొచ్చు. ఆ చపాతీని సైతం ఒకసారి మునగాకుతోనూ మరోసారి పాలక్‌తోనూ చేస్తే మంచిది. దోశ, ఇడ్లీ, చపాతీ, పరాటా వంటివి వాళ్లు తినేందుకు వీలుగా చిన్న చిన్న సైజుల్లో చేస్తే మంచిది. 
  • చిన్నారులకు రోజూ పంపించే అల్పాహారంలో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌, స్వీట్‌ కేక్స్‌, జంక్‌ ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, నూనె పదార్థాలతో కూడినవి పంపొద్దంటూ నిపుణులు చేసే సూచనల్ని పరిగణనలోకి తీసుకోండి. తాజా పండ్లు, తేలిగ్గా జీర్ణమయ్యే తాజా ఆహార పదార్థాలను పంపిస్తే పిల్లల ఆరోగ్యానికి మేలు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని