British stability: బ్రిటిష్‌ స్థిరత్వానికి కారణం.. ఆర్థిక, రాజకీయ సంస్కరణలే!

గవర్నర్‌ జనరల్స్‌గా భారతదేశానికి వచ్చిన బ్రిటిష్‌ అధికారుల్లో విలియం బెంటింక్‌ విద్యా విధానంలో కొత్త పోకడలను ప్రవేశపెట్టడమే కాకుండా సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశాడు.

Published : 22 Jun 2024 00:07 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర
భారత్‌లో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్స్‌ - సంస్కరణలు

గవర్నర్‌ జనరల్స్‌గా భారతదేశానికి వచ్చిన బ్రిటిష్‌ అధికారుల్లో విలియం బెంటింక్‌ విద్యా విధానంలో కొత్త పోకడలను ప్రవేశపెట్టడమే కాకుండా సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశాడు. సామ్రాజ్య కాంక్ష బలంగా ఉన్న వెల్లస్లీ, డల్హౌసీ సైన్యసహకార పద్ధతి, రాజ్యసంక్రమణ సిద్ధాంతం పేరుతో రాజ్యాలను విలీనం చేసుకోవడంపై దృష్టి సారించారు. పోటీపరీక్షార్థులు వీటిపై అవగాహన కలిగి ఉండాలి.


వారెన్‌ హేస్టింగ్స్‌

 • ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన కాలం నాటి ముఖ్య గవర్నర్‌ జనరల్స్‌లో వారెన్‌ హేస్టింగ్స్‌ ఒకరు.
 • ఇతడి కాలంలోనే రెగ్యులేటింగ్‌ చట్టం 1773ను రూపొందించారు. బెంగాల్‌లోని ద్వంద్వ ప్రభుత్వ పరిపాలనను ఈ చట్టం ద్వారానే రద్దు చేశారు.
 • బ్రిటిష్‌ వారి సహకారంతో 1774లో జరిగిన రొహిల్లా యుద్ధంలో అవధ్‌ నవాబు రొహిల్‌ఖండ్‌ను ఆక్రమించాడు. మొదటి మరాఠా యుద్ధం, సాల్బె సంధి, రెండో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం, మంగళూర్‌ సంధి హేస్టింగ్స్‌ పరిపాలనా కాలంలోనే జరిగాయి.
 • హేస్టింగ్స్‌ కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణల్లో రెవెన్యూ, న్యాయ సంస్కరణలు ముఖ్యమైనవి.

సంస్కరణలు

 • వ్యవసాయ ఎస్టేట్‌లకు వేలంపాట నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఏడాదికొకసారి వ్యవసాయ ఎస్టేట్‌ల కోసం ఎవరు ఎక్కువ వేలం పాడతారో వారికే అప్పగించారు. ఈ విధంగా సంవత్సరానికొకసారి పన్ను వసూలు చేశారు. ఈ విధానంతో దీర్ఘకాల ఒప్పందానికి తెరపడినట్లయింది.
 • కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులను నియమించాడు.
 • జిల్లా స్థాయిలో దివాని, ఫౌజ్‌దారి అదాలత్‌లను నియమించాడు.
 • వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్, బిహార్‌ డిప్యూటీ దివానులైన మహ్మద్‌ రాజాఖాన్, సితాబ్‌ రాయ్‌లను తొలగించాడు.
 • మొగల్‌ పరిపాలకులకు ఏడాదికి చెల్లించే పింఛన్‌ రూ.26 లక్షలు నిలిపివేశాడు.
 • భాండాగారాన్ని (కోశాగారం) ముర్షీదాబాద్‌ నుంచి కలకత్తాకు తరలించారు.
 • ఇతడి కాలంలోనే ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌ స్థాపన జరిగింది

లార్డ్‌ డల్హౌసీ

 • లార్డ్‌ డల్హౌసీ భారత్‌కు క్రీ.శ. 1848లో తన 36వ ఏట గవర్నర్‌ జనరల్‌గా వచ్చాడు. వెల్లస్లీలా ఇతడూ సామ్రాజ్య విస్తరణ కాంక్ష కలిగినవాడు.
 • భారత్‌లో నెలకొన్న పరిస్థితులను గ్రహించిన డల్హౌసీ స్వదేశీ రాజ్యాల ఆక్రమణే తన ధ్యేయమని ప్రకటించాడు. 
 • దీనికోసం యుద్ధాలు చేయలేదు. కానీ ఏ స్వదేశీ పాలకుడైతే వారసులు లేకుండా చనిపోతాడో, వారి రాజ్యాలు రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్‌ వారి సామ్రాజ్యంలో విలీనమవుతాయి. దీనికోసం స్వదేశీ రాజులు తరతరాలుగా అనుసరించిన దత్తత స్వీకార పద్ధతిని రద్దు చేశాడు.

కంపెనీ అధికార విస్తరణ - ఫలితాలు

 • రాజ్యసంక్రమణ సిద్ధాంతంలో భాగంగా సతారా, సంబాల్‌పూర్, నాగ్‌పూర్, జైత్‌పూర్, భాగత్, ఉదయ్‌పూర్, ఝాన్సీ మొదలైన రాజ్యాలు బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. అనేక రాజ్యాలు తమ అస్థిత్వాన్ని కోల్పోయాయి. సతారా పాలకుడైన అప్పాసాహెబ్‌ 1848లో మరణించగానే అతడికి వారసులు లేరనే నెపంతో డల్హౌసీ ఆ రాజ్యాన్ని విలీనం చేసుకున్నాడు.
 • మరాఠా ఆఖరి పీష్వా రెండో బాజీరావు మరణించాక అతడికి ఏడాదికిచ్చే రూ.8 లక్షల భరణాన్ని, అతడి దత్త కుమారుడు నానాసాహెబ్‌కు చెల్లించడాన్ని నిలిపివేశాడు.

అవధ్‌ రాజ్యం...

 • డల్హౌసీ సిద్ధాంతానికి బలైన స్వదేశీ సంస్థానాల్లో అవధ్‌ ఒకటి. 
 • లార్డ్‌ వెల్లస్లీ క్రీ.శ. 1801లో అవధ్‌ నవాబ్‌ సాదత్‌అలీ సైన్యసహకార సంధి షరతులను అంగీకరించేలా ఒప్పించాడు. ఈ సంధి కారణంగా ఆ రాజ్యం అన్నివిధాలా నష్టపోయింది. డల్హౌసీ గవర్నర్‌ జనరల్‌గా వచ్చేనాటికి అవధ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. 
 • కంపెనీ ఉన్నతాధికారులు రూపొందించిన పథకం ప్రకారం అవధ్‌ రాజ్యాన్ని 1856 ఫిబ్రవరిలో రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనం చేస్తున్నట్లు బ్రిటిష్‌ రెసిడెంట్‌ ఔట్రామ్‌ ప్రకటించాడు. ఈ చర్య డల్హౌసీకి నచ్చకపోయినా ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం మౌనంగా ఉండిపోయాడు.
 • అవధ్‌ రాజ్యాధినేత వాజీద్‌ అలీషాను కలకత్తా పంపించి, సాలీనా రూ.12 లక్షల పింఛన్‌ను మంజూరు చేశారు. 
 • అవధ్‌ నవాబ్‌ను పెన్షన్‌దారుగా చేసి, ఆ రాజ్యాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్న తీరుపై సమకాలీన అధికారులు, చరిత్రకారులు కింది విధంగా అభిప్రాయపడ్డారు. 
 • అవధ్‌ రాజ్య అంతరంగిక విషయాల్లో అన్ని రకాల విలువలను విస్మరించి కంపెనీ జోక్యం చేసుకున్న, కొనసాగించిన తీరు బ్రిటిష్‌ సార్వభౌమాధికారానికి మచ్చ తెచ్చేదిగా ఉందని హెన్రీ లారెన్స్‌ అన్నారు. గవర్నర్‌ జనరల్‌ స్థాయిలోని డల్హౌసీ 1855, డిసెంబరు 15న కూపర్‌కు రాసిన ఒక లేఖలో అవధ్‌ రాజ్యాన్ని ఆక్రమించి, విలీనం చేసుకున్న తీరు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నాడు.
 • పరిపాలనా యంత్రాంగం విఫలమైందనే సాకుతో అవధ్‌ను బ్రిటిష్‌వారు బలవంతంగా విలీనం చేసుకోవడం భవిష్యత్తులో తీవ్రపరిణామాలకు, తిరుగుబాట్లకు సూచిక అని లక్నోలో రెసిడెంట్‌గా ఉన్న స్లీమన్‌ పేర్కొన్నాడు. 
 • పి.ఇ.రాబర్ట్‌ అనే చరిత్రకారుడు స్వదేశీ రాజ్యాల విలీనమే దాని ఏకైక లక్ష్యమనీ, అన్ని స్వదేశీ రాజ్యాల పాలకులు ఈ ప్రమాదాన్ని పసిగట్టినప్పటికీ, కంపెనీ సైన్యాలను ఎదిరించే శక్తి లేక అవి తమ ఉనికి కోల్పోయాయని అన్నారు. 
 • రాజ్యసంక్రమణ సిద్ధాంతం అన్నిరకాల నైతిక విలువలను సమాధి చేసిందనీ, కేవలం ఈ సిద్ధాంతం కారణంగా బలవంతంగా అవధ్‌ ఆక్రమణ జరిగిందని అక్కడి ప్రజలు, సైనికులు, ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనయ్యారు.
 • బ్రిటిష్‌ రెసిడెంట్‌ హెన్రీ లారెన్స్‌ అధికార నివాసాన్ని అవధ్‌ సైనికులు ముట్టడించారు. బందీగా ఉన్న వాజీద్‌  అలీషా భార్య బేగం హజరత్‌ మహల్‌ను, ఆమె మైనర్‌ కుమారుడిని విడిపించారు.
 • ఈ పోరాటంలో లారెన్స్‌ ప్రాణాలు కోల్పోయాడు. బేగం- హజరత్‌ మౌల్వీ అహ్మద్‌షా నేతృత్వంలో అవధ్‌ సైనికులు 1858 మార్చి 20 వరకు వీరోచితంగా పోరాడి మరణించారు.

లార్డ్‌ కారన్‌ వాలీస్‌

 • కారన్‌ వాలీస్‌ భారత్‌లో గవర్నర్‌ జనరల్‌గా 1786 నుంచి 1793 వరకు పనిచేశారు.
 • ఈయన తన పరిపాలనా కాలంలో పలు సంస్కరణలు చేపట్టారు.

సంస్కరణలు:

 • కారన్‌ వాలీస్‌ బెంగాల్, బిహార్‌లో జమీందారీ పద్ధతి లేక శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు.
 • వివిధ స్థాయుల్లో కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయ పరిపాలన నుంచి రెవెన్యూ పరిపాలనను వేరుచేశారు. పరిపాలనా వ్యవస్థను సంస్కరించి అభివృద్ధి చేయడానికి సివిల్‌ సర్వీస్‌లను ప్రవేశపెట్టడం లాంటివి చేశాడు.
 • జిల్లా జడ్జి అనే కొత్త పోస్టును సృష్టించి, దిగువ స్థాయిలో మున్సబ్‌లు న్యాయ అధికారులుగా ఉండేలా చూశాడు.
 • రెగ్యులేషన్‌ చట్టం 1791 ప్రకారం పోలీస్‌ సూపరింటెండెంట్‌కు అధికారాలు అప్పగించారు. ప్రతి జిల్లాను 400 చదరపు మైళ్ల వైశాల్యంతో ఉండేలా విభజించారు. ఇది పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో జరిగింది.
 • కారన్‌ వాలీస్‌ రెవెన్యూ విభాగాన్ని పునర్నిర్మించారు. 1787లో బెంగాల్‌ రాజ్యం ఖజానా సంబంధమైన ప్రదేశంగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉండేది. కారన్‌ వాలీస్‌ను భారతదేశ సివిల్‌ సర్వీసెస్‌ పితామహుడిగా పేర్కొంటారు.

ఝాన్సీ రాజ్యం...

 • డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతానికి బలైన మరో ముఖ్య స్వదేశీ రాజ్యం ఝాన్సీ.
 • ఈ రాజ్యం లార్డ్‌ హేస్టింగ్స్‌ కాలంలో చేసుకున్న ఒడంబడిక ప్రకారం బ్రిటిష్‌ వారి ఆధిపత్యాన్ని అంగీకరించింది. 
 • ఝాన్సీ రాజు గంగాధర్‌రావు, లక్ష్మీబాయికి పుట్టిన ఏకైక పుత్రుడు పసితనంలోనే మరణించడంతో గంగాధర్‌రావు 1852లో దామోదర్‌రావు అనే అయిదేళ్ల బాలుడిని దత్తత తీసుకున్నాడు.
 • పలు అనారోగ్య సమస్యలతో 1853 నవంబరు 21న గంగాధర్‌రావు మరణించాడు. 
 • లక్ష్మీబాయి సంరక్షకురాలిగా ఉంటూ తన దత్త పుత్రుడి పేరిట ఝాన్సీ రాజ్య పరిపాలన చేపట్టింది.
 • గంగాధర్‌రావు తీసుకున్న దత్తత చెల్లదని, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనం చేస్తున్నట్లు 1854లో ప్రకటించారు. లక్ష్మీబాయికి ఏటా రూ. 60 వేల భరణం చెల్లించడానికి ఆంగ్లేయులు ఏర్పాట్లు చేశారు.
 • 1857 తిరుగుబాటు వరకు సుమారు మూడేళ్లపాటు ఆమె కంపెనీ దౌర్జన్యాన్ని సహించి, ఝాన్సీ రాజ్యంలో సిపాయిల తిరుగుబాటు చెలరేగగానే వారితో కలిసి పోరాటం సాగించింది.
 • ఆమె నాయకత్వ లక్షణాలను చూసిన జనరల్‌ హ్యూరోస్‌ (సేనలకు నేతృత్వం వహించిన వ్యక్తి) ‘అత్యంత సాహసవంతురాలైన ఏకైక పురుషుడు’ అని అభివర్ణించాడు.
 • డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతం ఫలితంగా భారతదేశంలోని అత్యధిక భూభాగంపై బ్రిటిష్‌వారి సార్వభౌమాధికారం ఏర్పడింది.

మాదిరి ప్రశ్నలు

1. భారతదేశ సివిల్‌ సర్వీసెస్‌ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

1) కారన్‌ వాలీస్‌   2) డల్హౌసీ

3) వారెన్‌ హేస్టింగ్స్‌    4) మెకాలే

2. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు?

1) రాబర్ట్‌ క్లైవ్‌   2)విలియం బెంటింక్‌

3) డల్హౌసీ    4) కారన్‌ వాలీస్‌

3. సైన్య సహకార విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన బ్రిటిష్‌ అధికారి ఎవరు?

1) చార్లెస్‌ ట్రావెల్‌యాన్‌  2) మెకాలే

3) విలియం బెంటింక్‌  4) వెల్లస్లీ

4. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు?

1) విలియం బెంటింక్‌   2) మౌంట్‌ బాటన్‌

3) వారెన్‌ హేస్టింగ్స్‌ 4) లార్డ్‌ కానింగ్‌

రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు