Updated : 26 Jun 2022 05:47 IST

TS Exams 2022: ఫలించని ఫార్ములాలు!

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!
తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం

ముల్కీ నిబంధనలను పక్కన పెట్టడంతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు మొదట 8 సూత్రాలు, ఆ తర్వాత  తలెత్తిన జై ఆంధ్ర పోరాటాన్ని నిలువరించేందుకు మరో 5 సూత్రాలు, చివరి ప్రయత్నంగా ఇంకో 6 సూత్రాలను ప్రతిపాదించినా తెలుగు ప్రాంతాల్లో సయోధ్య సాధ్యం కాలేదు. చెలరేగిన ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. ఈ దశలో కేంద్రం చేపట్టిన చర్యలు ఉద్యమాలను  చల్లార్చకపోగా మరింత ఎగసేలా చేశాయి. ఈ పరిణామ క్రమాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.


ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు - సయోధ్య సూత్రాలు

జై తెలంగాణ ఉద్యమ కాలం (1969)లో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు నాటి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం నేర నివారక నిర్బంధ చట్టాన్ని విచక్షణారహితంగా వినియోగించి అనేక మందిని అకారణంగా నిర్బంధించింది. ఈ ఉద్యమం కారణంగా పలు చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనల్లో పెద్దమొత్తంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం 1969 ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇరు ప్రాంతాల నేతలతో చర్చించారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్‌ 11న 8 సూత్రాల పథకాన్ని లోక్‌సభలో ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల ఉద్యోగ అవకాశాలకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవడమే ఈ అష్టసూత్రాల పథకం ప్రధాన లక్ష్యం.


అష్ట సూత్రాల పథకం

1) తెలంగాణ మిగులు నిధుల తరలింపు అంచనాల కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించడం. దీని ప్రకారం జస్టిస్‌ వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేశారు.

2) తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలో కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ  శాఖలతో పాటు కేంద్ర ప్రణాళికా సంఘం ప్రతినిధులతో చర్చించడం. గత 12 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు నిధులను సమీకరించడం.

3) తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేయడం. ఇందులో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు సభ్యులుగా ఉంటారు.

4) ప్రణాళికా సంఘం పర్యవేక్షణలో తెలంగాణలో ప్రణాళికా పథకాలను అమలుచేయడానికి ఒక ఉపకమిటీని నియమించడం.

5) తెలంగాణ ప్రాంతంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రాంతీయ సంఘానికి అధికారం కల్పించడం.

6) ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన (అపాయింట్‌మెంట్‌, సీనియారిటీ, ప్రమోషన్స్‌) రాజ్యాంగ రక్షణలను న్యాయ నిపుణుల ద్వారా పరిశీలించడం.

7) తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిశీలన కోసం ఒక ఉన్నత కేంద్ర సలహా మండలిని ఏర్పాటుచేయడం.

8) ప్రధానమంత్రి ప్రతి ఆరు నెలలకు ఒకసారి  పై అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.

ఈ ఎనిమిది సూత్రాల పథకంలో ప్రత్యేకించి తెలంగాణ రక్షణలు లేకపోవడంతో తెలంగాణ ఉద్యమ నేతలు, ప్రజలు దీన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ పథకంలో పేర్కొన్న కమిటీలన్నీ కాలయాపన చేస్తున్నాయని, ఇది తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నాటి ప్రభుత్వం చేసిన కుట్ర అని ఉద్యమ నేతలు విమర్శించారు.


జస్టిస్‌ వశిష్ఠ భార్గవ కమిటీ

అష్టసూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం 1969, ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వశిష్ఠ భార్గవ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమించింది.ఈ కమిటీ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

* 1956 పెద్ద మనుషుల ఒప్పందం. రి 1959లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం. రి 1969, జనవరి 19వ తేదీ నాటి అఖిలపక్ష సమావేశంలో జరిగిన ఒప్పందం.
ఈ కమిటీ రూ.28.34 కోట్ల తెలంగాణ మిగులు నిధులను ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి వినియోగించినట్లుగా నిర్ధారించింది. అయితే ఈ కమిటీ నివేదికను తెలంగాణ ఉద్యమ నాయకులతో పాటు ప్రాంతీయ కమిటీ వ్యతిరేకించింది. ప్రధానమంత్రి అష్టసూత్రాల పథకాన్ని వ్యతిరేకించిన తెలంగాణ నాయకులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రత క్రమంగా తగ్గడంతో 1969 సెప్టెంబరులో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి.  క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత 1972, అక్టోబరు 3న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని ప్రకటించింది. దీంతో 1972, అక్టోబరు 18న జై ఆంధ్రా ఉద్యమం ప్రారంభమై అనతికాలంలోనే తీవ్రరూపం దాల్చింది. జై ఆంధ్రా ఉద్యమ నేతలు తెలంగాణకు కల్పించిన రక్షణలన్నింటినీ రద్దు చేసి ఆంక్షలు లేని సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేబినెట్‌లో చర్చించి 1972, నవంబరు 27న పంచసూత్రాల  పథకాన్ని లోక్‌సభలో ప్రకటించారు.

పంచసూత్రాల ఫార్ములా

1) తెలంగాణ ప్రాంతంలో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు, తహసీల్దారు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, జూనియర్‌ ఇంజినీర్లకు కూడా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర ఉమ్మడి సంస్థల్లో నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకంలో ప్రతి మూడింటిలో రెండో ఉద్యోగానికి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి.

2) ఈ రక్షణలు తెలంగాణ ప్రాంతంలో 1980, డిసెంబరు 31 వరకు, జంట నగరాల్లో 1977, డిసెంబరు 31 వరకు అమల్లో  ఉంటాయి. ఆ తర్వాత రద్దవుతాయి. రాష్ట్ర రాజధాని జంట నగరాల్లో ఉన్న కారణంగా ఈ తేడా కల్పించారు.

3) ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతులకు వీలుగా సర్వీస్‌ క్యాడర్స్‌కు సంబంధించి ప్రథమ లేదా ద్వితీయ గెజిటెడ్‌ స్థాయి వరకు స్థానికం చేశారు.

4) జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక, వృత్తి విద్యలతో పాటు ఇతర అన్ని విద్యాసంస్థల్లో సౌకర్యాలకు ఎలాంటి విఘాతం ఉండదు. ఈ సౌకర్యాలు క్రమంగా విస్తృతమవుతాయి.

5) హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు ఉమ్మడి పోలీసు వ్యవస్థ ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి  రూపొందిస్తారు.

ప్రభావం: ఈ పథకం ఇరు ప్రాంత ప్రజలను సంతృప్తి పరచకపోగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ఉద్ధృతికి దారితీసింది. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి దీన్ని ‘తెలంగాణ రక్షణలకు గొడ్డలిపెట్టు’ అని విమర్శించారు.

ఈ విధంగా జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రకటించిన అష్టసూత్రాల పథకం, జై ఆంధ్రా ఉద్యమ కాలంలో ప్రకటించిన పంచసూత్రాల పథకం రెండూ ఫలించలేదు. కానీ ఆ తర్వాత 1973, సెప్టెంబరు 21న ప్రకటించిన ఆరు సూత్రాల పథకం ఆంధ్రా ప్రాంత ప్రజలకు మోదాన్ని కలిగించగా, తెలంగాణ ప్రజలకు ఖేదాన్ని మిగిల్చింది. దీని ద్వారా తెలంగాణ రక్షణలన్నీ రద్దయ్యాయి.


https://tinyurl.com/24vjf3sa


ప్రిపరేషన్‌టెక్నిక్‌

యాంత్రికంగా చదవడం వల్ల ఎలాంటి  ఉపయోగం ఉండదు. త్వరగా మర్చిపోయే అవకాశం కూడా ఉంది. అదే ఏ అంశాన్నైనా అర్థం చేసుకుంటూ, ఒక క్రమంలో చదివితే ఎక్కువకాలం గుర్తుంటుంది


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని