TS Exams 2022: అవక్షేప అగ్నిమయ రూపాంతర శిలలమయం!

భూమి లోపల ఏముంది? అంతర నిర్మాణం ఎలా ఉంటుంది? అంతా మట్టే ఉంటుందా? మరేమైనా ఉందా? నీళ్లు, ఖనిజాలు, శిలలు లాంటివి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు. పరీక్షల కోణంలోనూ ముఖ్యమైన ప్రశ్నలు. వాటికి సమాధానాలు కావాలంటే భూ అంతర్నిర్మాణం గురించి చదవాలి....

Updated : 24 May 2022 06:44 IST

ప్రపంచ భూగోళశాస్త్రం

భూమి లోపల ఏముంది? అంతర నిర్మాణం ఎలా ఉంటుంది? అంతా మట్టే ఉంటుందా? మరేమైనా ఉందా? నీళ్లు, ఖనిజాలు, శిలలు లాంటివి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు. పరీక్షల కోణంలోనూ ముఖ్యమైన ప్రశ్నలు. వాటికి సమాధానాలు కావాలంటే భూ అంతర్నిర్మాణం గురించి చదవాలి.

భూ అంతర్నిర్మాణం

భూఉపరితలంపై జరిగే అనేక సంకోచ, వ్యాకోచాలు; ఊర్ధ్వ, అథో, పార్శ్వ చలనాలు; ప్రకృతిపరమైన మార్పులకు భూ అంతర్భాగంలో ఏర్పడే వివిధ రకాల బలాలు లేదా శక్తులే కారణం. వాటి గురించి తెలియాలంటే భూఅంతర్భాగం గురించి అధ్యయనం చేయాలి. భూఅంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేవు. భూకంప తరంగాలు, ఉల్కాపాతాలను పరిశీలించడం లాంటి పరోక్ష విధానాలు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా భూఉపరితలం నుంచి భూకేంద్రం వైపు వెళ్లే కొద్దీ కొన్ని మార్పులు జరుగుతున్నట్లు గుర్తించారు.  

భూఉపరితలం నుంచి ప్రతి 32 మీటర్ల లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు 1ాది చొప్పున పెరుగుతాయి.

భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు 6000ాది ఉన్నట్లు అంచనా వేశారు.

భూకేంద్రం వైపు వెళ్లే కొద్దీ భూమి విశిష్ట సాంద్రతలు, పీడన బలాలు పెరుగుతుంటాయని గుర్తించారు.

భూ వ్యాసార్ధం 6400 కి.మీ. వరకు ఉన్నట్లు లెక్కించారు.
ఈ అంశాల ఆధారంగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భౌతిక, రసాయనిక లక్షణాల పరంగా భూమిని వివిధ పొరలుగా విభజించారు.
భూ అంతర్నిర్మాణాన్ని సూయస్‌ అనే శాస్త్రవేత్త సియాల్‌, సిమా, నిఫే అనే మూడు పొరలుగా; వాండర్‌ గ్రాచ్‌, గూటెన్‌బర్గ్‌ అనే శాస్త్రవేత్తలు నాలుగు పొరలుగా విభజించారు.
సాధారణంగా భూఅంతర్నిర్మాణాన్ని మూడు పొరలుగా విభజించవచ్చు.
1) భూపటలం లేదా లిథో స్ఫియర్‌ లేదా శిలావరణం  
2) భూప్రావారం లేదా మీసోస్ఫియర్‌
3) భూకేంద్ర మండలం లేదా బారిస్ఫియర్‌

భూపటలం

భూఉపరితలం నుంచి సగటున 40 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉన్న ఘనస్థితిలోని బాహ్యపొర. మొత్తం భూ ఘనపరిమాణంలో ఇది 0.5 శాతాన్ని ఆక్రమించి ఉంటుంది. భూపటలం పైభాగం అవక్షేప శిలాపదార్థాలతో, లోపలి భాగం అగ్నిమయ, రూపాంతర శిలలతో ఏర్పడి ఉంటుంది. దీని మందం ఖండ భూభాగాల దిగువన 35 కి.మీ., సముద్రాల దిగువన 5 కి.మీ. నుంచి 10 కి.మీ. ఉంటుంది. భూపటలంలో అధికంగా ఉన్న మూలకం ఆక్సిజన్‌ (42%), సిలికాన్‌ (27%), అల్యూమినియం (8%), ఐరన్‌ (5 - 6%). భూపటలంలో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం సిలికా (SiO2). భూపటల ఉపరితల దృశ్యంపై రెండు భాగాలు గుర్తించవచ్చు.

ఖండ భూభాగాలు: ఇది సిలికాన్‌, అల్యూమినియం ఖనిజ మూలకాలతో ఏర్పడి ఉండటం వల్ల దీన్ని సియాల్‌ పొర అని పిలుస్తారు. ఇందులో గ్రానైట్‌కు సంబంధించిన శిలలు ఎక్కువగా ఉండి తేలికగా ఉంటుంది. దీని విశిష్ట సాంద్రత 2.5 - 3.0.

సముద్ర భూతలాలు: ఇవి ప్రధానంగా సిలికాన్‌, మెగ్నీషియం మూలకాలతో ఏర్పడి ఉండటం వల్ల వీటిని సిమా పొర అని పిలుస్తారు. సముద్రాల అడుగు భాగం దీనితో ఏర్పడి ఉంటుంది. ఇది బసాల్ట్‌ శిలలతో ఏర్పడి అధిక బరువును కలిగి ఉంటుంది. దీని విశిష్ట సాంద్రత 3.0 - 3.5.

భూప్రావారం

భూపటలం నుంచి 2900 కి.మీ. వ్యాపించి ఉన్న భూ అంతర్భాగం. దీని విశిష్ట సాంద్రత 3.5 నుంచి 5.5 వరకు ఉంటుంది. భూమి మొత్తం ఘనపరిమాణంలో 16 శాతాన్ని ఆక్రమించిన దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు.

ఎగువ ప్రావారపు పొర: ఇది భూపటలం నుంచి దాదాపు 100 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉన్న ఘనస్థితిలోని భూప్రావారం. భూపటలం, ఎగువ ప్రావారపు పొరలను కలిపి శిలావరణం లేదా ఆస్మావరణం అని పిలుస్తారు. ఇది పూర్తిగా ఘనరూపంలో ఉంటుంది. ఇందులో భూఉపరితలంతో పాటు సముద్ర భూతలం కూడా ఉంటుంది.

దిగువ ప్రావారపు పొర: ఇది పాక్షిక ద్రవ, ఘనస్థితిలో (కొల్లాయిడల్‌) ఉండి సిలికేట్స్‌ మిశ్రమంతో ఉంటుంది.

భూకేంద్ర మండలం

ఇది భూప్రావారం నుంచి దాదాపు 3300 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉంటుంది. ప్రధానంగా నికెల్‌, ఐరన్‌ మూలకాలతో ఏర్పడి ఉండటం వల్ల దీన్ని నిఫే పొర అని కూడా పిలుస్తారు. దీని విశిష్ట సాంద్రత 11 నుంచి 13 వరకు ఉంటుంది. ఇది భూమి మొత్తం పరిమాణంలో 85.35 శాతాన్ని ఆక్రమించి ఉంటుంది. దీన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు.

బాహ్య భూకేంద్ర మండలం: భూఅంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న ప్రాంతం బాహ్య భూకేంద్ర మండలం. ఇది పూర్తిగా ద్రవస్థితిలో ఉంటుంది. 2900 నుంచి 4980 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.

మధ్య భూకేంద్ర మండలం: ఇది పాక్షిక ద్రవ, ఘనస్థితిలో ఉండే పలుచని పొర.

అంతర భూకేంద్ర మండలం: ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది. 5 వేల నుంచి 5120 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని