TS Exams 2022: తెల్లదొరల రాజ్యంలో రైతుల దోపిడీ!

ఇండియాపై ఇంగ్లిష్‌ కంపెనీ  రాజకీయ ఆధిపత్యాన్ని సాధించగానే తెల్ల దొరలు రకరకాలుగా దోచుకోవడం ప్రారంభించారు. అనేక స్వార్థ పూరిత చర్యలతో ప్రజలపై పన్నుల భారం మోపారు. వాటిని కట్టలేక రైతులు విలవిలలాడిపోయారు. ఆ సమయంలో ముఖ్యంగా మూడు శిస్తు విధానాలను ఆంగ్లేయులు అమలు చేశారు. పరీక్షల కోసం అభ్యర్థులు వాటిపై అవగాహన పెంచుకోవాలి.

Updated : 24 May 2022 06:40 IST

ఆధునిక భారతదేశ చరిత్ర

ఇండియాపై ఇంగ్లిష్‌ కంపెనీ  రాజకీయ ఆధిపత్యాన్ని సాధించగానే తెల్ల దొరలు రకరకాలుగా దోచుకోవడం ప్రారంభించారు. అనేక స్వార్థ పూరిత చర్యలతో ప్రజలపై పన్నుల భారం మోపారు. వాటిని కట్టలేక రైతులు విలవిలలాడిపోయారు. ఆ సమయంలో ముఖ్యంగా మూడు శిస్తు విధానాలను ఆంగ్లేయులు అమలు చేశారు. పరీక్షల కోసం అభ్యర్థులు వాటిపై అవగాహన పెంచుకోవాలి.


కంపెనీ పాలనలో భూమి శిస్తు విధానం

క్రీ.శ.1857 నాటికి మొత్తం భారతదేశం ఈస్టిండియా కంపెనీ ప్రత్యక్ష లేదా పరోక్ష రాజకీయాధిపత్యం కిందకు వచ్చింది. ప్రారంభం నుంచి భారతదేశాన్ని ఒక వలస రాజ్యంగా, ఇక్కడి ఆర్థిక వనరులను కొల్లగొట్టడమే లక్ష్యంగా కంపెనీ పాలన సాగించింది. అన్ని రకాల శాసనాలు, వర్తక-వాణిజ్య, పారిశ్రామిక, భూమిశిస్తు విధానాలు తదితర చర్యలన్నీ ఇంగ్లిష్‌ వారికి గరిష్ఠ లబ్ధిని చేకూర్చే విధంగా రూపొందించుకున్నారు. ప్రధానంగా భూమి శిస్తు విధానం భారతీయ రైతులను దోపిడీ చేయడమే ధ్యేయంగా ఏర్పడింది.
బక్సర్‌ యుద్ధం (1764) ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప సంఘటన. యుద్ధం తర్వాత ఏర్పడిన అలహాబాదు సంధి (1765) ప్రకారం మొగల్‌ చక్రవర్తి రెండో షా ఆలం ఆంగ్లేయ కంపెనీకి బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ అధికారాన్ని అంటే పన్ను వసూలు చేసే అధికారాన్ని ధారాదత్తం చేశాడు. తదనుగుణంగా బెంగాల్‌లో కంపెనీ రాజ్యాధికారాన్ని (దివానీ) చేపట్టింది. ఆనాడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న కాలంలో వేలం పద్ధతిని ప్రవేశపెట్టాడు. అందరి కంటే ఎక్కువ మొత్తానికి వేలం పాడిన వారికి రెవెన్యూ వసూలు హక్కును కల్పించాడు. కానీ ఈ విధానం అనుకున్నంతగా విజయవంతం కాలేదు. వేలం పాడినవారు పాట మేరకు శిస్తు సరిగా చెల్లించలేదు. కంపెనీకి బకాయి పెట్టడమే కాకుండా రైతులను అమితంగా పీడించడం మొదలుపెట్టారు. ఈ పద్ధతి రెవెన్యూ వసూళ్లలో అనిశ్చిత పరిస్థితికి దారితీసింది. కంపెనీ యాజమాన్యానికి భూమి శిస్తు వసూలు సమస్యగా మారింది. అలాంటి పరిస్థితుల్లో కారన్‌ వాలీస్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వచ్చాడు. ఆయన తన కంపెనీ అధికారి జాన్‌ షోర్‌ సలహా మేరకు శాశ్వత భూమి శిస్తు విధానాన్ని రూపొందించి బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా, వారణాసిలలో ప్రవేశపెట్టాడు.


శాశ్వత భూమి శిస్తు విధానం

నేక ప్రయోగాల తర్వాత ఆనాటి రాజకీయ, ఆర్థిక పాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ క్రీ.శ.1793లో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీనినే జమిందారీ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో జమీందార్లు భూమిపై హక్కు పొందారు. భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించారు. శిస్తు సక్రమంగా చెల్లిస్తున్నంతకాలం జమీందార్లు వంశపారంపర్య హక్కులు కలిగి ఉంటారు. వీరు భూమిని రైతులకు కౌలుకు ఇవ్వచ్చు. ఇష్టానుసారం నిబంధనలు ఏర్పరిచి రైతుల నుంచి శిస్తు వసూలు చేసుకోవచ్చు. పంట లాభ నష్టాలతో సంబంధం లేకుండా ముందుగా నిర్ణీత సొమ్మును జమీందార్లు కంపెనీకి విధిగా చెల్లించాలి. నిర్ణయించిన శిస్తులో 10/11వ వంతు కంపెనీ ప్రభుత్వానికి చెల్లించి, 1/11వ వంతు ఖర్చుల నిమిత్తం జమీందారు ఉంచుకోవచ్చు. ఒకవేళ అధిక భూమి సాగులోకి తెస్తే దానిపై వచ్చిన ఆదాయం జమీందారుకు  చెందుతుంది. దీంతో జమీందార్లు పెద్ద భూకామందులయ్యారు. తమ జమీందారిలోని యావత్‌ భూమికి హక్కుదార్లు అయ్యారు. కౌలుదార్ల జీవితాలు జమీందార్ల విధి విధానాలపై ఆధారపడ్డాయి.

లాభనష్టాలు: భూమి శిస్తు చాలా ఎక్కువగా నిర్ణయించడంతో కంపెనీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. నిర్ణీత సంవత్సరాదాయం సమకూరి దాన్ని వసూలు చేయడానికి అయ్యే ఖర్చు తప్పింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం స్థిరంగా ఉండటంతో వారి కార్యక్రమాలు ముందుగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఏర్పడింది. దాంతో ఉద్యోగులు ఇతర సేవలపై దృష్టి సారించడానికి వీలు కలిగింది. రైతులు సాగులోకి తెచ్చిన కొత్త భూములపై వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి భాగం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల జమీందార్లు ఎక్కువ భూములు సాగులోకి తెచ్చారు. ఇది అధిక వ్యవసాయోత్పత్తి, వాణిజ్యాభివృద్ధికి దారి తీసింది. ఈ విధానం ప్రధానంగా కంపెనీకి వీర విధేయులైన జమీందార్లు అనే ఒక కొత్త సామాజిక వర్గాన్ని సృష్టించింది. అనేక సంకట పరిస్థితుల్లో ఈ వర్గం కంపెనీకి మద్దతుగా నిలిచింది. నష్టాలను పరిశీలిస్తే జమీందార్లు కొత్త భూములు సాగులోకి తెచ్చినా వాటి వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వానికి చెందలేదు.పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కువ శిస్తు విధించి వసూలు చేశారు. రైతులకు భూమిపై ఎలాంటి హక్కు లేకపోవడంతో జమీందారు దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది.


రైత్వారీ విధానం

పద్ధతికి  సర్‌ థామస్‌ మన్రో మూలపురుషుడు. మూడో ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం తర్వాతŸ టిప్పు సుల్తాన్‌ రాజ్యంలోని చాలా ప్రాంతాలు బ్రిటిష్‌ కంపెనీ వశమయ్యాయి. అందులో బారామహల్‌ ఒకటి. మొదటిసారి రైత్వారీ విధానాన్ని అక్కడే అమలుచేశారు. థామస్‌ మన్రో మద్రాసు గవర్నర్‌గా ఉన్న కాలంలో మద్రాసు రాష్ట్రంలో, ఎల్ఫిన్‌స్టోన్‌ (1819 - 27) కాలంలో బొంబాయి రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో రైతు తాను సాగు చేస్తున్న భూమికి హక్కుదారుడు. సక్రమంగా కౌలు చెల్లిస్తున్నంతవరకు అతడికి సాగు చేసుకునే భూమి మీద హక్కు ఉంటుంది. శాశ్వత భూమి శిస్తు విధానంలో కంపెనీకి, రైతులకు మధ్య జమీందారు అనే మధ్యవర్తి ఉండేవాడు. రైత్వారీ విధానంలో ఆ మధ్యవర్తి పాత్ర లేదు. ప్రభుత్వానికి, రైతుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. సాగు చేసే భూమిని పరిశీలించి, ఎంత పంట పండుతుందో ఒక అంచనాకు వచ్చి దానికి అనుగుణంగా రైతు కట్టాల్సిన పన్నును నిర్ణయిస్తారు. పంటలో ఖర్చులు పోను మిగతా భాగంలో సగం వరకు పన్నుగా వసూలు చేస్తారు.  

లాభాలు

ప్రభుత్వానికి, రైతుకు మధ్య మధ్యవర్తులు లేకపోవడం.

జమిందారీ విధానంలో ఉన్నట్లుగా మధ్యవర్తికి (జమీందారుకు) కమిషన్‌ (1/11వ భాగం) చెల్లించాల్సిన అవసరం లేకపోవడం.

దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడం. నీ భూమికి హక్కుదారుగా రైతును గుర్తించడం.

లోపాలు: పంటలు పండకపోయినా, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల్లో కూడా శిస్తు సక్రమంగా చెల్లించాలి. దీనివల్ల రైతులు ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకురావాల్సి వచ్చేది. ఫలితంగా వడ్డీ వ్యాపారుల కోరలకు చిక్కి దుర్భర జీవితం గడిపేవారు.


మహల్వారీ విధానం

దీని రూపకర్త వాయవ్య రాష్ట్రాల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌.ఎమ్‌.బర్డ్‌. ఇతడిని ఉత్తర భారతదేశ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ పితామహుడు అంటారు. విలియం బెంటింక్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. జమిందారీ, రైత్వారీ విధానాల్లో కొన్ని మార్పులు చేసి కొత్త విధానాన్ని రూపొందించారు. గంగాలోయ ప్రాంతం, వాయవ్య భారతం, పంజాబ్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. ఎస్టేట్‌, గ్రామం లేదా రెండు మూడు గ్రామాలు ఈ పన్నుకు ప్రాతిపదిక. ఎస్టేట్‌ను మహల్‌ అని అంటారు. అందువల్ల ఈ పద్ధతికి మహల్వారీ అని పేరు. గ్రామం/ఎస్టేట్‌ మొత్తానికి పన్ను నిర్ణయించి దాని నిర్వహణ, పన్ను చెల్లింపు బాధ్యతకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రైతుల నుంచి పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. కంపెనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాలు రైతుపై పన్నుల భారాన్ని పెంచాయి. సమాజంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులను తయారుచేసి రైతు ప్రయోజనాలు, సంక్షేమాన్ని విస్మరించాయి. వీటివల్ల సామాన్య భారతీయ రైతు ఆర్థిక భారంతో కుంగిపోయాడు.


ప్రిపరేషన్‌టెక్నిక్‌

ఇటీవల భూకంపాలు, సునామీలు, తుపానుల్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చి ఉంటే వాటి సాధారణ వివరాలతోపాటు ఆ విపత్తులు ఏర్పడటానికి కారణాలు, అవి చేసే విధ్వంసాలు, ఇతర ప్రభావాల గురించి తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు