TS Exams 2022: తక్కువైతే ఏనుగులు.. ఎక్కువైతే ఎలుకలు!

కంపించే వస్తువుల నుంచి విడుదలై చెవికి వినికిడి స్థిరతను కలిగించే శక్తి స్వరూపాన్ని ధ్వని అంటారు. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్‌ అంటారు. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు. అంటే ఇవి కేవలం యానకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణిస్తాయి. శూన్యంలో ప్రయాణించలేవు. ధ్వని తరంగాలు యానకంలో అనుదైర్ఘ్య యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తాయి.  

Updated : 26 May 2022 06:53 IST

శబ్దం శ్రావ్యంగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. తీవ్రంగా ఉంటే చికాకు కలిగిస్తుంది. అంతేకాకుండా శబ్దం నిర్ణీత ప్రమాణాలకు తక్కువైనా, ఎక్కువైనా మనుషుల చెవులు గ్రహించలేవు. కానీ ధ్వని పౌనఃపున్యం తక్కువ ఉన్నా ఏనుగులు, ఎక్కువ ఉన్నా ఎలుకలు చక్కగా వింటాయి. విచిత్రమైన 
ఆ శబ్ద విశేషాలతోపాటు నిత్యజీవితంలో వైద్యం సహా అనేక రంగాలకు ధ్వని అందిస్తున్న ప్రయోజనాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

ధ్వని

కంపించే వస్తువుల నుంచి విడుదలై చెవికి వినికిడి స్థిరతను కలిగించే శక్తి స్వరూపాన్ని ధ్వని అంటారు. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్‌ అంటారు. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు. అంటే ఇవి కేవలం యానకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణిస్తాయి. శూన్యంలో ప్రయాణించలేవు. ధ్వని తరంగాలు యానకంలో అనుదైర్ఘ్య యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తాయి.  

పౌనఃపున్యం ఆధారంగా ధ్వని తరంగాలను మూడు రకాలుగా విభజించారు. అవి.. 

1) పరశ్రావ్య ధ్వనులు 

2) శ్రావ్య ధ్వనులు 

3) అతి ధ్వనులు

పరశ్రావ్య ధ్వనులు: పౌనఃపున్యం 20 హెర్ట్జ్‌ల కంటే తక్కువగా ఉన్న ధ్వనులను పరశ్రావ్య ధ్వనులు అంటారు. ఇవి మనకు వినిపించవు. ఖడ్గమృగాలు, తిమింగలాలు, ఏనుగులు, పావురాలు, పాములు, కొన్ని రకాల చేపలు, ఆక్టోపస్‌ లాంటివి మాత్రమే ఈ ధ్వనులను వినగలుగుతాయి. పరశ్రావ్య ధ్వనులు సాధారణంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు, అణువిస్ఫోటం, సునామీల సమయంలో విడుదల వుతాయి. 

అనువర్తనాలు: పరశ్రావ్య ధ్వనులను భూకంపాలు అగ్నిపర్వతాలు, సునామీల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

శ్రావ్య ధ్వనులు: ధ్వని పౌనఃపున్యం 20 నుంచి 20,000 హెర్ట్జ్‌ల మధ్య ఉన్న ధ్వనులను శ్రావ్య ధ్వనులు అంటారు. ఈ ధ్వనులను మానవుడు వినగలుగుతాడు. చిన్న పిల్లల శ్రావ్య అవధి దాదాపుగా 16 నుంచి 30,000 హెర్ట్జ్‌లు.

అతి ధ్వనులు: ధ్వని పౌనఃపున్యం 20,000 హెర్ట్జ్‌ల కంటే ఎక్కువగా ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు. వీటిని మనం వినలేం. గబ్బిలాలు, డాల్ఫిన్స్, కుక్కలు, కప్పలు, దోమలు, తాబేళ్లు, ఎలుకలు మాత్రమే ఈ ధ్వనులను వినగలుగుతాయి. సాధారణంగా అతిధ్వనులను ఫిజియో ఎలక్ట్రిక్‌ ఫలితం, మాగ్నటోస్ట్రిక్షన్‌ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తారు. 

అనువర్తనాలు

* పాలల్లో బ్యాక్టీరియాను నశింపజేయడం.

* సముద్రాల్లో చేపలను ఆకర్షించడం.

* మూత్రపిండాల్లోని రాళ్లను పొడిలా మార్చడం.

* ప్లాస్టిక్, కొన్ని రకాల లోహాలను వెల్డింగ్‌ చేయడం.

* లోహాల్లో పగుళ్లను గుర్తించడం.

* సముద్రాలు, జలాంతర్గాముల లోతును, మార్గాలను తెలుసుకునే సోనార్‌ (సౌండ్‌ నావిగేషన్‌ అండ్‌ రేంజింగ్‌) పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.

* దంత వైద్య, సర్జికల్‌ పరికరాలు; పరిశ్రమల్లోని పొగ గొట్టాలను శుభ్రపరచడానికి వాడతారు.

* ఏకరీతి మిశ్రమాలను పొందడానికి వినియోగిస్తారు.

* గర్భస్థ శిశువు ఎదుగుదలను తెలుసుకునే అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌; గుండె, కాలేయం లాంటి అవయవాల పనితీరును తెలుసుకునే స్కానింగ్‌లలో ఉపయోగిస్తారు.

అనునాదం 

రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల సహజ పౌనఃపున్యాలు సమానమైనప్పుడు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక కంపన పరిమితితో కంపించే దృగ్విషయాన్ని అనునాదం ్బళి’(్న-్చ-‘’్శ అంటారు. ఏవైనా రెండు వస్తువుల మధ్య అనునాదం జరగాలంటే ఆ రెండు వస్తువుల సహజ పౌనఃపున్యాలు తప్పనిసరిగా సమానం కావాలి.

నిత్యజీవిత సందర్భాలు

* వివాహాలు, ఇతర శుభకార్యాల్లో బ్యాండ్‌ వాయిస్తున్నప్పుడు దగ్గర్లోని చెంచాలు, గిన్నెల్లాంటి వస్తువులు కంపించడం.

* చప్పట్లు కొట్టడం, ఈల వేయడం.

* సంగీత వాయిద్యాలు పనిచేయడం.

* స్నానాల గదిలో పాడిన పాటలు బిగ్గరగా వినిపించడం.

* వేలాడుతున్న బ్రిడ్జిపై సైనికులను కవాతు చేయవద్దంటారు. ఎందుకంటే కవాతు పౌనఃపున్యం బ్రిడ్జి సహజ పౌనఃపున్యానికి సమానమైతే బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది.

* టీవీ, ఎఫ్‌ఎం రేడియోల్లో ధ్వనులు స్పష్టంగా వినిపించడానికి కారణం వాటి రిసీవర్‌లో ఎలక్ట్రికల్‌ అనునాదం జరగడమే.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని