TS Exams: ఆ పర్వతాల్లో ఆకాశ దేవత!

భూగోళశాస్త్రాన్ని ఒక క్రమంలో అధ్యయనం చేయాలంటే ముందుగా నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అందులో పర్వతాలు, కొండలు, పీఠభూములు,  మైదానాలు, ద్వీపాలు, ద్వీపకల్పాల గురించి ఉంటుంది.

Updated : 05 May 2022 06:47 IST

భారత నైసర్గిక స్వరూపం - హిమాలయాలు
ఇండియన్‌ జాగ్రఫీ

భూగోళశాస్త్రాన్ని ఒక క్రమంలో అధ్యయనం చేయాలంటే ముందుగా నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అందులో పర్వతాలు, కొండలు, పీఠభూములు,  మైదానాలు, ద్వీపాలు, ద్వీపకల్పాల గురించి ఉంటుంది. వైవిధ్య భౌగోళిక లక్షణాలతో కూడిన భారత ఉపఖండాన్ని పరిశీలిస్తే ప్రముఖంగా కనిపించేవి హిమాలయాలు.  పలుదేశాల్లో వీటి విస్తరణ, ఏర్పడిన తీరు, శిఖరాల ఎత్తులు, వాటి పేర్లు తదితరాంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.

ఒక ఖండానికి ఉండే విభిన్న లక్షణాలు, విశాలమైన భూభాగం లాంటి అంశాల వల్ల భారతదేశాన్ని ఉపఖండంగా వర్ణిస్తారు. ఇక్కడి నిమ్నోన్నత స్వరూపాలను పరిశీలిస్తే 1951 సెన్సస్‌ కమిషన్‌ రూపొందించిన అంచనా ప్రకారం దేశంలోని మొత్తం భూభాగంలో 10.7 శాతం ఎత్తయిన పర్వత ప్రాంతం, 18.6 శాతం కొండ ప్రాంతం, 27.7 శాతం పీఠభూమి, 43.3 శాతం మైదాన ప్రాంతం ఉన్నట్లు గుర్తించారు. భారత ద్వీపకల్పంలో ఉండే కఠిన శిలల ఆధారంగా ఈ ప్రాంతం 150 కోట్ల సంవత్సరాల కంటే ముందే ఏర్పడినట్లు తెలుస్తోంది. ద్వీపకల్ప భూభాగం తొలుత గోండ్వానా మహాఖండంలో భాగంగా ఉండేది. టెథిస్‌ అనే సముద్రం గోండ్వానా మహాఖండానికి ఉత్తరాన ఉండేది. టెథిస్‌ సముద్రానికి ఉత్తరాన ఉన్న అమెరికా, యురేషియా ఖండాలను అంగారా మహాఖండం అనేవారు.హిమాలయాల పుట్టుక 6 కోట్ల సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైంది. ఇవి ఏర్పడటానికి సుమారు 4 కోట్ల సంవత్సరాలు పట్టింది. భూ అభినతిలో (జియోసింక్లైన్‌) ఏర్పడిన నిక్షేపాలు ఖండ చలనం వల్ల ముడుతలు పడి ఎత్తు పెరగడం ప్రారంభమైంది. హిమాలయ పర్వతాలు ముడుతలు పడటానికి కారణం దక్షిణ భారత ద్వీపకల్పం ఉత్తరం, ఈశాన్యం వైపునకు; అంగారా భూభాగం దక్షిణం, పశ్చిమం వైపునకు జరగడమని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ ముడుతలు పడిన నిక్షేపాలు అంతర్జనిత శక్తుల వల్ల పైకి నెట్టుకువచ్చి మొదట ప్రస్తుతం మనకు కనిపించే ఎత్తయిన శ్రేణులు ఏర్పడ్డాయి. తర్వాత మధ్య భాగం, ఆ తర్వాత వాటి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. 90-120 మీ. ఎత్తున్న శివాలిక్‌ కొండలు హిమాలయాల దిగువన ఉండటం వల్ల వీటిని పర్వతపాద హిమాలయాలు అంటారు. 25 వేల సంవత్సరాలకు పూర్వం గంగా, సింధూ మైదానాలు ఏర్పడ్డాయి.

హిమాలయ పర్వతాలు

ఇవి భారతదేశానికి ఉత్తర దిక్కున తూర్పు, పడమరలుగా విస్తరించి ఉన్నాయి. వీటి పొడవు 3000 కి.మీ., వెడల్పు 300-350 కి.మీ. ప్రపంచ పర్వత శ్రేణులన్నింటిలో హిమాలయ పర్వతాలే నూతన పర్వతాలు. ఇవి సుమారు 5 లక్షల చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. హిమాలయాల ఎగువ భాగాలు నదుల క్రమక్షయ క్రియల ద్వారా కోతకు గురై హిమానీ నదాల ప్రవాహం వల్ల ఇక్కడ ఎక్కువ లోతులో జు ఆకారపు లోయలు ఏర్పడినట్లు కనిపిస్తాయి. హిమాలయాలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.

ఉన్నత హిమాలయాలు: వీటినే ఉత్తర హిమాలయాలు, హిమాద్రి శ్రేణులు, ఇన్నర్‌ హిమాలయాలు అని కూడా అంటారు. ఎవరెస్ట్‌ శిఖరం (8,848 మీ.), రీ2 - గాడ్విన్‌ ఆస్టిన్‌ (8,611 మీ.), కాంచనగంగా (8,598 మీ.), ధవళగిరి (8,172 మీ.), నంగప్రభాత్‌ (8,126 మీ.), అన్నపూర్ణ (8,078 మీ.) ఈ శ్రేణిలోనే ఉన్నాయి. ఈ శ్రేణిని గ్రేటర్‌ హిమాలయాలు అని కూడా పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 6,100 మీ., వెడల్పు 120 - 190 కి.మీ. ప్రపంచంలో ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ కాగా, భారతదేశంలో ఎత్తయిన శిఖరం కాంచనగంగా. ఎవరెస్ట్‌ను టిబెట్‌లో చోమోలుంగ్మా (ఆకాశ దేవత), చైనాలో కోమోలాంగ్మా (ప్రపంచ మాత), నేపాల్‌లో సాగరమాత అని పిలుస్తారు. ఎవరెస్ట్‌ను 1841 - 52 మధ్య జార్జ్‌ ఎవరెస్ట్‌ అనే ఆంగ్లేయుడు కనుక్కున్నాడు. 1865లో ఆయన పేరు మీదనే దీనికి ఎవరెస్ట్‌ అని పేరు పెట్టారు.

మధ్య హిమాలయాలు: వీటినే హిమాచల్‌ శ్రేణులు అని కూడా అంటారు. వీటి సరాసరి ఎత్తు 3,300 మీ. ఇవి 75 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఈ శ్రేణిలోని చాలా శిఖరాల ఎత్తు 5,000 మీ. కంటే ఎక్కువ. హిమాచల్‌ప్రదేశ్‌ ఈ శ్రేణిలోనే ఉంది. ముస్సోరి, సిమ్లా, డార్జిలింగ్‌లు కూడా ఉన్నాయి. మధ్య హిమాలయాల దక్షిణపు వాలు ఎక్కువగా, ఉత్తరం వైపు వాలు తక్కువగా ఉంటుంది. ఇక్కడ సతతహరిత, శృంగాకార అడవులు ఉన్నాయి. పీర్‌పంజల్‌ శ్రేణి, ధౌలధర్‌ శ్రేణి, మహాభారత శ్రేణి, కశ్మీర్‌ లోయ దీనిలో భాగమే.

బాహ్య హిమాలయాలు : వీటినే హిమాలయాల పాద గిరులు, పర్వత పాద హిమాలయాలు అని అంటారు. ఇవి 600 మీ. - 1200 మీ. సరాసరి ఎత్తుతో 2,400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు 8 - 48 కి.మీ. మధ్య ఉంటుంది. ఈ శివాలిక్‌ కొండలు ప్రధాన హిమాలయాల ఒండ్రుమట్టి క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి. ఈ శ్రేణిలో అనేక లోయలు ఉన్నాయి. వీటినే డూన్‌లు అంటారు. డెెహ్రాడూన్‌ ఇక్కడే ఉంది.

ట్రాన్స్‌ హిమాలయాలు:  హిమాద్రికి ఉత్తరాన జమ్మూ-కశ్మీర్‌ (లద్దాఖ్‌), టిబెట్‌ భూభాగాల్లో ఈ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో కారకోరం, లద్దాఖ్‌ (రాకపోసి), జస్కర్‌ పర్వత శ్రేణులు ఉన్నాయి.
కశ్మీర్‌ లోయ : ఇది అభినతి లోయ. గతంలో సరస్సుగా ఉండి ఒండ్రుమట్టితో పూడుకుపోయింది. దీనికి ఉత్తరాన ఉన్నత హిమాలయాలు, దక్షిణాన పీర్‌పంజల్‌ శ్రేణులు ఉన్నాయి.


రచయిత: డాక్టర్‌ జి.ఆనంద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని