TS Inter: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే..!

TS Inter: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేశారు.

Updated : 17 May 2023 20:45 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల(TS Inter Advanced Supplementary exams) టైం టేబుల్‌ విడుదలైంది. గతంలో ప్రకటించినట్టు జూన్‌ 4 నుంచి కాకుండా జూన్‌ 12 నుంచి 20వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉండటం తదితర కారణాల రీత్యా ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ నెల 9న విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63.85 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్‌ పరీక్షలను జూన్‌ 5 నుంచి 9 వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించనున్నట్టు నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. జూన్‌ 22న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లింపు గడువు నిన్నటితో ముగియగా.. విద్యార్థులు, తల్లిండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 19వరకు పొడిగిస్తూ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ గడువు సైతం నిన్నటితో ముగియగా.. నేటివరకు గడువు ఇచ్చింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని