TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ఫైనల్‌ కీ విడుదల

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ఫైనల్‌ కీ విడుదలైంది.

Updated : 30 May 2023 23:10 IST

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ఫైనల్‌ కీ విడుదలైంది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారి వివరాలను మంగళవారం సాయంత్రమే ప్రకటించిన తెలంగాణ పోలీసు నియామక మండలి(TSLPRB).. కొద్ది గంటల్లోనే ఫైనల్‌ కీని కూడా విడుదల చేసింది. కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

వీటితో పాటు కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది, ఎస్సై సివిల్‌ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది, ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది చొప్పున అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపింది. అభ్యర్థులు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించిన బోర్డు.. జూన్‌ 1 నుంచి 3వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ₹2,000, ఇతరులకు రూ.3,000 చొప్పున దరఖాస్తు రుసుం నిర్ణయించారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వివరాల తప్పులు సరిదిద్దుకునేందుకు ఛాన్స్‌ ఉంటుందని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. 

ఈ ప్రక్రియంతా పూర్తయ్యాక రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కులను బోర్డు నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా మెరిట్ లిస్టును సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో ఈ వివరాలను తెలుసుకోవచ్చు. మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్నవారికి మెడికల్ టెస్టు నిర్వహించి.. ఎస్‌బీ ఎంక్వైరీ చేస్తారు. క్రిమినల్ కేసులు ఉన్నవారిని అనర్హులుగా పరిగణిస్తారు. మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి ఎంపికైన అభ్యర్థులతో తుది ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలతో పాటుగా శిక్షణా షెడ్యూల్‌ను వారి లాగిన్‌లో ఉంచుతారు. ఒకవేళ తుది ఫలితాల లిస్ట్, అభ్యర్థి వివరాలతో పాటుగా అనర్హుల జాబితాను సైతం వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. 

పోస్టుల వారీగా ఫైనల్‌ కీ కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని