TSPSC: మరో నియామక పరీక్ష వాయిదా

మరో ఉద్యోగ నియామక పరీక్షను వాయిదా వేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది.

Published : 28 Mar 2023 20:32 IST

హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోన్న వేళ ఇప్పటికే పలు ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు/వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4న జరగాల్సిన  ఉద్యాన (హార్టికల్చర్‌) శాఖలో పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షను రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఈ పరీక్షను తిరిగి జూన్‌ 17న నిర్వహించాలని నిర్ణయించింది.  తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించాలా లేదంటే కొంత వ్యవధితో రీషెడ్యూలు చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరిపిన అధికారులు తాజాగా ఆ పరీక్షను వాయిదా వేశారు.  తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఉద్యాన అధికారుల పోస్టులకు ఏప్రిల్‌ 4న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. 

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే  నాలుగు పరీక్షలను కమిషన్‌ రద్దు చేయగా, రెండింటిని వాయిదా వేసిన విషయం తెలిసిందే.  గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి  త్వరలోనే  కొత్త  తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని