Uma Harathi: ఎన్నో ఫెయిల్యూర్స్‌ చూశా.. నాన్నే నాకు స్ఫూర్తి: సివిల్స్‌ టాపర్‌ ఉమా హారతి

Civils topper Uma Harathi: తన తండ్రే తనకు ఎంతో ప్రేరణ అని సివిల్స్‌లో మూడో ర్యాంకుతో సత్తా చాటిన ఉమా హారతి చెప్పారు. సివిల్స్‌ లాంటి పరీక్షల్లో పోటీ పడాలంటే ఎమోషనల్‌ సపోర్టు, కుటుంబ సపోర్టు ఎంతో అవసరమన్నారు. 

Updated : 23 May 2023 20:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (UPSC CSE 2022 Results)ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యువతి నూకల ఉమా హారతి(Uma Harathi) మూడో ర్యాంకుతో మెరిశారు. ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం విశేషం. ఉమా హారతి సాధించిన విజయానికి ప్రశంసల జల్లు కురుస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఉమా హారతి మీడియాతో మాట్లాడారు. తాను సివిల్స్‌లో విజేతగా నిలవడానికి గల కారణాలను పంచుకున్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన విశేషాలివే.. 

ఎమోషనల్‌ సపోర్టు చాలా అవసరం..

‘‘ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్ని.  ముందుగా జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఐదేళ్లుగా నేను ప్రిపేర్‌ అవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్‌ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి. కానీ ఎమోషనల్‌, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు’’

చాలా ఫెయిల్యూర్స్‌ చూశాను.. అయినా..!

‘‘ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు. నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్‌ అవుతున్నా. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్‌ చూశాను. అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లాను.. నేను ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తర్వాత ఉద్యోగంలో చేరలేదు. సివిల్స్‌ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాను. నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు. సివిల్స్‌ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను. నా ఫ్రెండ్స్‌ చాలా సపోర్టు చేశారు. నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి, ప్రేరణ.

మహిళల విద్యపై దృష్టిసారిస్తా..

ఐదో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు సాధించాను. గతంలో కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యాను. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఎక్కువగా ప్రాక్టీసు చేశాను. బ్యాడ్మింటన్‌, కుకింగ్; రన్నింగ్ నా హబీలు, గతంలో పూర్తిగా పుస్తకాల్లో మునిగిపోయేదాన్ని. పుస్తకాలు తప్ప మిగతా విషయాల్లో సమతూకం ఉండేది కాదు. ఈ సారి పరీక్షలకు అన్నీ సమతూకంగానే సాధన చేశాను. మహిళల విద్యపై ఎక్కువగా దృష్టిపెడతాను. అభ్యర్థులు ప్రతి దశలో పరీక్షను అర్థం చేసుకోవాలి. పరీక్షను అర్థం చేసుకుంటే 90శాతం సాధించినట్టే. గత ప్రశ్న పత్రాలు ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి. మూరుమూలన ఉన్నా ఇంటర్నెట్‌ ఉంటే కష్టమేమీ కాదు’’ అని ఉమా హారతి చెప్పుకొచ్చారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని