నవ యువకులు.. చరిత్రకు సాక్షులు

చదువుతూనే కొలువు కలలు కంటారు. ఏ సాఫ్ట్‌వేర్‌ జాబో, కార్పొరేట్‌ కొలువో పట్టేద్దాం అనుకుంటారు. జిందగీ జాలీగా గడిపేద్దాం అని ఉవ్విళ్లూరుతుంటారు. ఈతరం కుర్రాళ్ల తీరే అంత! కానీ కొందరుంటారు.. మన ఊహలకు అందరు. నలుగురికీ నచ్చినదీ నాకసలే నచ్చదురో టైపు.

Updated : 30 Oct 2021 06:42 IST

చదువుతూనే కొలువు కలలు కంటారు. ఏ సాఫ్ట్‌వేర్‌ జాబో, కార్పొరేట్‌ కొలువో పట్టేద్దాం అనుకుంటారు. జిందగీ జాలీగా గడిపేద్దాం అని ఉవ్విళ్లూరుతుంటారు. ఈతరం కుర్రాళ్ల తీరే అంత! కానీ కొందరుంటారు.. మన ఊహలకు అందరు. నలుగురికీ నచ్చినదీ నాకసలే నచ్చదురో టైపు. సముద్రాల సునీల్‌, తొడిశెట్టి ప్రణయ్‌లు అదే రకం. శిలాజాలు, చరిత్ర అంటూ అడవుల బాట పట్టారు. అరుదైన పురావస్తు సంపద వెలికితీస్తున్నారు...


అలుపెరుగని అన్వేషి

రాకాసి బల్లుల్ని హాలీవుడ్‌ సినిమాలు, జంతు ప్రదర్శనశాలల్లోనే చూసి ఉంటాం. కానీ వీటిపై అధ్యయనం చేస్తూ, అరుదైన శిలాజాలను వెలికి తీస్తున్నాడు పెద్దపల్లి జిల్లా బేగంపేట యువకుడు సముద్రాల సునీల్‌. వీటికోసం అడవులన్నీ తిరుగుతూ, ప్రమాదకర కొండకోనలు గాలిస్తూ అలుపెరుగని సాహసాలు చేస్తున్నాడు.

సునీల్‌ జేఎన్‌టీయూ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌. ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో చరిత్రకారులు, పురావస్తుశాఖ శాస్త్రవేత్తలతో కలిసి సమీప జిల్లాలకు వెళ్లి పర్వతారోహణ చేస్తుంటాడు. అరుదైన శిలాజాలు సేకరించి భద్రపరుస్తుంటాడు. చరిత్రను వెలికి తీయాలనే ఆలోచన సొంతూరు బేగంపేట నుంచే మొదలైందంటాడు సునీల్‌. ఇక్కడి దగ్గరల్లోని రామగిరి ఖిల్లాపై చారిత్రక ఆనవాళ్లు ఉండటంతో చాలామంది చరిత్రకారులు ఇక్కడికొచ్చి పరిశోధనలు చేసేవారు. అలా తనలో ఆసక్తి మొదలైంది. దీంతోపాటు చరిత్ర పుస్తకాలు చదువుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా డైనోసార్‌లు తిరిగాయనీ, వాటి ఉనికికి సంబంధించిన శిలాజాలున్నాయని తెలుసుకున్నాడు. ఆ సమాచారంతో అంతర్జాలంలో అన్వేషణ మొదలు పెట్టాడు. శిలాజాల నిక్షేపాల కోసం అడవుల బాట పట్టాడు. ఆనవాళ్లు దొరికితే ఫొటోలు తీసి ఈ రంగంలోని పరిశోధకులు, నిపుణులకు పంపి, అవి నిజమైన శిలాజాలే అని నిర్ధారణ అయితే వాటిని భద్రపరుస్తున్నాడు. తన పరిశోధనల వివరాలను విద్యార్థులకు సెమినార్ల రూపంలో తెలియజేస్తున్నాడు.

సాహసోపేతంగా..

ఈ శిలాజాల అన్వేషణ సాహసోపేతమైన పని. అడవులు, లోయలు, కొండలు, క్రూరమృగాలు సంచరించే చోట్ల ప్రాణాలకు తెగించి మరీ వెతకాలి. అయినా బెదురులేకుండా ముందుకే వెళ్తున్నాడు సునీల్‌. ఇప్పటివరకు రాతియుగం పనిముట్లతోపాటు శాతవాహనులు, విష్ణుకుండిణులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, మహ్మదీయ రాజుల కాలం నాటి శాసనాలు, ఆలయాలు, నివాస ప్రాంతాలు, నాణేలు, పనిముట్లు, చారిత్రక అవశేషాలు గుర్తించినట్టు చెబుతున్నాడు. మంచిర్యాల జిల్లాలో ‘కోటాసురాస్‌’ అనే డైనోసార్‌ అస్థిపంజరం దొరికింది. ఇక్కడే పరిశోధనలు చేసి వాటి ఎముకల శిలాజాలు సేకరించాడు. మహారాష్ట్రలోని బారాపాసురాస్‌ డైనోసార్‌ శిలాజాలు దొరికిన ప్రాంతంలోనూ గాలించి పాదముద్రలు సేకరించాడు. తమిళనాడులోని అరియాలూర్‌ ప్రాంతంలో సాండ్‌ డాలర్‌గా పిలిచే అత్యంత ప్రాచీన సముద్రజీవి శిలాజం కనుగొన్నాడు. ఇవికాకుండా రామగుండం, రామగిరిఖిల్లా, మంచిర్యాల, అసిఫాబాద్‌లోని పెద్దవాగు, సిద్దిపేటలోని కొండాపూర్‌ గ్రామం, పెద్దపల్లి, ధర్మారం ప్రాంతాల్లో ఆది మానవుల సమాధులు, రాతి చిత్రాలు కనుగొన్నాడు. ధూళికట్ట బౌద్ధస్థూపం సమీపంలోని పాటిగడ్డ ప్రాంతంలో కుండపెంకులు, రాతియుగంలో వాడిన మట్టి, రంగురాళ్ల పూసలు, ఎముకలతో చేసిన గాజులు సేకరించాడు.

- మిరియాల గణేష్‌కుమార్‌, ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి  


ప్రకృతిపై మమకారంతో..

ఆసిఫాబాద్‌ యువకుడు తొడిశెట్టి ప్రణయ్‌కి చిన్నప్పట్నుంచే పచ్చదనం అంటే ఇష్టం. ప్రకృతితో మమేకమయ్యే ఉద్యోగం సాధించాలనుకునేవాడు. పోటీ పరీక్షలకు సిద్ధమై మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర ర్యాంకుతో అటవీశాఖలో ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. తన విధులు నిర్వర్తిస్తూనే కోట్ల ఏళ్లనాటి పనిముట్లు, శిలాజాలను కనుగొంటున్నాడు.

హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు ప్రణయ్‌. సాఫ్ట్‌వేర్‌కో, కార్పొరేట్‌ ఉద్యోగానికో.. వెళ్లే అవకాశం ఉన్నా పచ్చని అడవిబాట పట్టాలనుకున్నాడు. దాంతో రెండు నెలలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలోనే ప్రణయ్‌కి చరిత్ర, పురావస్తుశాఖ పరిశోధకుడు శ్రీనివాస్‌ పాఠాలు బోధించేవారు. ఈ పరిచయం, తర్వాత కాలంలో ఎంతో ఉపయోగపడిందంటాడు ప్రణయ్‌. తను కనుగొన్న శిలాజాలను శ్రీనివాస్‌కు చూపిస్తే.. ఆయన పరిశోధక బృందాన్ని తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి అవి వేల కోట్ల ఏళ్ల నాటివని నిర్ధారించారు. ఇక్కడే డైనోసార్‌ ఎముక సైతం సేకరించాడు. గోవెన అటవీ ప్రాంతంలో ఆరు కోట్ల ఏళ్లనాటి నత్త శిలాజాలు, పాలరాతి యుగంలో వాడిన పనిముట్లు బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశారు. దీంతోపాటు భూగర్భ శాస్త్రవేత్తలు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారితో కలిసి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 1.25 లక్షల ఏళ్ల కిందటి అర్జునలొద్ది గుహను వెలుగులోకి తెచ్చాడు. ఇక్కడే అప్పటి మానవులు వాడిన రాతి గొడ్డలి స్వాధీనం చేసుకున్నాడు. విధుల్లో భాగంగా కొన్నాళ్ల కిందట గుండాల ప్రాంతంలో దట్టమైన అడవుల్లో కాలిబాటన కిలోమీటర్లకొద్దీ ప్రయాణించాడు. అప్పుడు 60 అడుగుల పైనుంచి కిందికి దూకే పాల నురగల పరవళ్ల జలపాతం కనుగొన్నాడు. దీనికి ముందు ‘బైసన్‌’ అనే పేరు పెట్టినా, గ్రామస్థుల కోరిక మేరకు బోజ్జీరావు జలపాతంగా వ్యవహరిస్తున్నారు.

- చొక్కాల రమేశ్‌, ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని