సోల్‌మేట్‌.. సొంతమైందిలా!

ఓరోజు సాయంత్రం అంతా ఆరుబయట కూర్చున్నాం. అమ్మ సెల్‌ఫోన్‌ తీసి చూస్తుంటే ఒకమ్మాయి ఫొటో కనిపించింది. మొహం చాలా కళగా ఉంది.

Published : 20 Feb 2021 00:36 IST

ఓరోజు సాయంత్రం అంతా ఆరుబయట కూర్చున్నాం. అమ్మ సెల్‌ఫోన్‌ తీసి చూస్తుంటే ఒకమ్మాయి ఫొటో కనిపించింది. మొహం చాలా కళగా ఉంది. ‘మీ పెదనాన్న ఫ్రెండ్‌ కూతురట. చూపించమని పంపారు. అమ్మాయి సన్నగా ఉంది కదా! నీకు నచ్చదని చెప్పేశాంలే’ అడిగితే అమ్మ నిష్ఠూరమాడింది. గతంలో చాలా సంబంధాలు ఏదో వంకతో వద్దన్నాననే కోపంతో. కానీ ఎందుకో నేను వెతుకుతున్న సోల్‌మేట్‌ తనేననిపించింది. పెళ్లిచూపులకు ఒప్పించా.
పొద్దునే వాళ్లింటికెళ్లాం. కాసేపయ్యాక తనొచ్చి నా ఎదురుగా కూర్చుంది. ఇంటర్వ్యూ ఆఫీసర్లలా మావాళ్లు ప్రశ్నలడుగుతున్నారు. తను నోరు విప్పింది. కోకిల స్వరం నా గుండెను మీటింది. ‘అమ్మాయిని ఏదైనా అడగాలనుకుంటే అడుగు బాబూ’ అంతా అయ్యాక నాకో అవకాశమిచ్చారు. తను తలెత్తట్లేదు. నాకూ ధైర్యం సరిపోవట్లేదు. ‘ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అలా వసారాలోకి వెళ్లండి’ అన్నాడొకాయన. ఊపిరి పీల్చుకున్నా. ‘మీది చిన్న కుటుంబం. మాదేమో ఉమ్మడి కుటుంబం. మీకిష్టమేనా?’ అంటూ నేరుగా మాటల్లోకి దిగా. ‘ఓహ్‌.. అంతా కలిసుంటే ఎంత బాగుంటుందో. ఆడుకోవడానికి పిల్లలు.. ఆపదొస్తే తీర్చే పెద్దలు.. ఆ సందడి నాకు భలే ఇష్టం’ అంది కళ్లు చక్రాల్లా తిప్పుతూ. ఆ మాటతో తను నేరుగా నా గుండెల్లోకి చేరింది. పైగా ప్రతి మాట వెనకాల ఓ చిర్నవ్వు. తేనెలవర్షంలో తడిచిపోతున్న ఫీలింగ్‌ నాకు. అవీఇవీ మాట్లాడాక నన్ను తన ముందుంచా. ‘నేను స్టైల్‌గా ఉండను. హంగూ ఆర్భాటాలు నచ్చవు. సింపుల్‌గా ఉంటాను’ అన్నా. ‘ఇవన్నీ ఎవడిక్కావాలండీ.. మంచి మనసుంటే చాలదూ?’ పన్నీటి జల్లులు చల్లింది నాపై.
కారెక్కుతుంటే ‘బాబూ.. అమ్మాయి నచ్చిందా?’ అనడిగింది వాళ్లమ్మ. నవ్వే నా సమాధానం. తనూ సిగ్గుపడుతూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసిందట. మనసులోని ఊసులు చెప్పాలనీ, ఒకర్నొకరం పూర్తిగా అర్థం చేసుకోవాలనీ... ఆతృతగా ఫోన్‌ కలిపేవాణ్ని. ఎప్పుడో ఓసారి ఎత్తేది. ఆచితూచి మాట్లాడేది. ఆ కొద్ది మాటలే పంచదార, తేనె అద్ది నా గుండెల్లోకి తీయగా విసిరేది.
మా దురదృష్టంకొద్దీ నిశ్చితార్థం అయిన వెంటనే లాక్‌డౌన్‌ వచ్చిపడింది. 1.. 2.. 3.. పొడిగిస్తున్నకొద్దీ పెళ్లి ముహుర్తం వాయిదా పడుతోంది. తన నవ్వు.. రూపం.. నన్ను కుదురుగా ఉండనీయడం లేదు. నాకింకా ఆగే ఓపిక లేదు. డేట్‌ ఫిక్స్‌ చేయించా. నా అదృష్టంకొద్దీ కరోనా తగ్గుముఖం పట్టింది. ఏర్పాట్లు ఘనంగా చేశాం. బంధువులంతా వచ్చి ఆశీర్వదించారు. పెళ్లయ్యాక తను మాటల సునామీనే. అప్పుడేమో అంటీ ముట్టనట్టుగా ఉండేది. ఇప్పుడేమో ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతలో ఎంత మార్పు? ఇదే మాటడిగితే ‘పెళ్లికి ముందే ప్రేమంతా చూపిస్తే అబ్బాయి గారికి మొహం మొత్తేయదూ! కొసరికొసరి వడ్డించడానికే నా వలపునంతా దాచుకున్నా’ అంటోంది గడసరిగా. నాకు నచ్చే అమ్మాయి దొరుకుతుందో, లేదో.. అని ఒకప్పుడు టెన్షన్‌ పడేవాణ్ని. ఇప్పుడు నా జీవితంలో ప్రతీక్షణం రంగులమయమే. ఇంతకీ తన పేరు చెప్పనే లేదు కదూ! భవ్య. నేను దీపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని