బావా అనడమే నా తప్పా?

అక్క ఒకతన్ని మూడేళ్లుగా ప్రేమిస్తోంది. బాగా కష్టపడి ఈమధ్యే వాళ్లిద్దరూ పెద్దలను పెళ్లికి ఒప్పించారు. సమస్య ఏంటంటే.. ఆ అబ్బాయి ఇప్పుడు అక్కను కాదని నా వెంట పడుతున్నాడు. నిన్నే ఇష్టపడుతున్నా  అంటున్నాడు. ఎలాగూ అక్కను

Published : 06 Mar 2021 06:04 IST

 

అక్క ఒకతన్ని మూడేళ్లుగా ప్రేమిస్తోంది. బాగా కష్టపడి ఈమధ్యే వాళ్లిద్దరూ పెద్దలను పెళ్లికి ఒప్పించారు. సమస్య ఏంటంటే.. ఆ అబ్బాయి ఇప్పుడు అక్కను కాదని నా వెంట పడుతున్నాడు. నిన్నే ఇష్టపడుతున్నా  అంటున్నాడు. ఎలాగూ అక్కను పెళ్లి చేసుకోబోతున్నాడు కదా అని తనని ‘బావ’ అని పిలుస్తూ సరదాగా ఉండేదాన్ని. చిన్నచిన్న ట్రీట్స్‌ ఇవ్వమంటూ తనతో హోటళ్లు, రెస్టరెంట్లకు తిరిగేదాన్ని. అదే నేను చేసిన పొరపాటు. సమస్య ఇంతదాకా వస్తుందనుకోలేదు. కొన్నాళ్లకు తను అకస్మాత్తుగా ‘నువ్వంటే ఇష్టం’ అనడం మొదలుపెట్టాడు. ‘మీ అక్క మూడీ.. నన్ను సరిగా అర్థం చేసుకోదు. నువ్వు సరదాగా ఉంటావు. నిన్నే పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు. నాకేం చేయాలో తెలియడం లేదు. 

- కె.ఎ.ఆర్‌., ఈమెయిల్‌

మీరు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే ఆ అబ్బాయికి నిలకడ లేదు అని తెలుస్తోంది. మీ అక్కతో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాను అన్నాడు. అలాంటప్పుడు తనని పూర్తిగా అర్థం చేసుకొని ఉండాలి. మంచిచెడులు తెలుసుకోగలగాలి. ఇంకొకరు చలాకీగా ఉన్నారనో, సరదాగా ఉన్నారనో.. ఆకర్షితుడైతే రేపొద్దున మరొకరిని ఇష్టపడడు అనే నమ్మకం ఏంటి? ఇంతకాలం ప్రేమలో ఉండి, పెద్దల్ని ఒప్పించిన తర్వాత కూడా వేరొకరు ఇష్టం అంటున్నాడంటే అది అతడి అవకాశవాదాన్ని తెలియజేస్తోంది. మీ అక్క ప్రేమని పెద్దలు అంగీకరించి, పెళ్లికి ఒప్పుకున్నాక మీరు అతి చనువుత అతడితో ఒంటరిగా రెస్టరెంట్లకు వెళ్లడం, సరదాగా ఉండటం మీరు చేసిన పొరపాటు. మీ మనసులో వేరే ఉద్దేశం లేకపోయినా తెలిసీ తెలియక చేసిన పొరపాటుతో ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక అమ్మాయి, అబ్బాయి ఎక్కువ సమయం వ్యక్తిగతంగా గడుపుతుంటే, సన్నిహితంగా ఉంటే ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలవడం సహజమే. మీ అంతట మీరు పార్టీ అడగడం, బయటికి వెళ్లడానికి ప్రోత్సహించడంతో ఏదో మూలన మీకూ అతడిపై ఇష్టం ఉందనే అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు తను మీతో ఎలా ఉంటున్నాడు అని కాకుండా మీ అక్క పరిస్థితి ఏంటని ఆలోచించండి. ప్రేమ, పెళ్లి.. జీవితాంతం ఒక్కరితోనే కొనసాగించాలి. తను నిజంగా, మనస్ఫూర్తిగా మీ అక్కని ప్రేమించి ఉంటే ఇంత తొందరగా మనసు మార్చుకునేవాడు కాదు. పెళ్లికి ముందే అతడి నైజం బయట పడటం ఒకరకంగా అదృష్టమే. ఇకనుంచి అతడితో దూరంగా ఉండటమే కాదు.. మీ అక్క భవిష్యత్తు గురించి పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని