నా మూర్ఖత్వానికి ఇప్పుడేడుస్తున్నా!

‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా... కంటికి వెలుగమ్మా...’ ఫోన్‌ మోగింది. కొత్త నెంబరు. ...

Updated : 24 Apr 2021 09:34 IST

‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా... కంటికి వెలుగమ్మా...’ ఫోన్‌ మోగింది. కొత్త నెంబరు. పరాగ్గా ఎత్తా. ‘ఎలా ఉన్నావ్‌ రవీ?’ అటువైపు నుంచి పలకరింపు. బాగా పరిచయమున్న గొంతులా అనిపించింది. ఆ వెంటే ఎన్నాళ్లుగానో నా గుండెలో కొలువైన రూపం కళ్లలో మెదిలింది. ‘మా...ధు...రీ...’ నమ్మలేనట్లుగా అన్నాన్నేను. ‘హా.. నేనే.. ఎలా ఉన్నావ్‌?’ అవతలివైపు. మాధురి... ఎప్పటి మాధురి! ఆరేళ్లైంది తన గొంతు నా హృదయాన్ని తాకి. అయినా తను మిగిల్చిన జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. లేకుండా ఎక్కడికి పోతాయి! ఒకప్పుడు తనలో నేను.. నాలో తను.

‘ఇందాకే విషయం తెలిసింది. ఈమధ్యే అమ్మ పోయారటగా. మన క్లాస్‌మేట్‌ రజనీ చెప్పింది. మీ అమ్మంటే నీకు ప్రాణమని తెలుసు. ప్రతి విషయాన్నీ ఆమెతో పంచుకునే వాడివి. ఇప్పుడే నువ్వు దృఢంగా ఉండాలి. లేకుంటే నీ భార్య మరింత దిగాలు పడిపోతుంది. పిల్లలు కూడా ఉన్నారు. నాన్నకీ నువ్వే ధైర్యం చెప్పాలి. ముప్పై అయిదేళ్లు. ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా ఉన్నారు. ఈ లోటు ఆయన జీవితంలో ఎవరూ పూడ్చనిది. హార్ట్‌ ప్రాబ్లెం అటగా’ అంటూ చెప్పుకుపోతోంది. ‘అవును. అంతా సడన్‌గా జరిగిపోయింది. కలలో కూడా ఊహించలేదు, అమ్మ ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతుందని. అంతా మా బ్యాడ్‌ లక్‌’ అంటుంటే తెలియకుండానే నా కళ్లలో నీళ్లు. ‘జీవితం అంటే అంతే రవీ! నా లైఫ్‌ కూడా ఇలాగే అనుకోని మలుపు తిరిగింది కదా? సరే, నా మీద కోపం ఇంకా అలాగే ఉందా?’ తను అడుగుతుంటే ఒక్కసారి గతంలోకి వెళ్లా.
కోపం.. అవును. తనంటే చెప్పలేనంత కోపం. కాదు ద్వేషం. నన్ను మోసం చేసింది. మూడేళ్ల ప్రేమని పక్కన పడేసి హాయిగా వేరే పెళ్లి చేసుకుంది. ఇద్దరు బిడ్డల తల్లైంది. అంత త్వరగా ఎలా మారిపోయింది! ఎన్ని ప్రేమలేఖలు. ఎన్ని కబుర్లు. ఎంత ఆనందం. ఎన్ని కలలు. ఎన్ని బాసలు! అప్పట్లో ప్రతి దేవుడికీ తను బాగుండాలని మొక్కుకునేవాణ్ని. మేమిద్దరం ఒక్కటవ్వాలని ప్రతి స్వామినీ వేడుకునేవాణ్ని. కానీ ఆ ప్రేమంతా ఏమైంది? అందుకే తనంటే కోపం.
‘కొన్ని అలా జరిగిపోతుంటాయి రవీ. నేననుకున్నానా, మా నాన్న అంత తర్వగా దూరమైపోతారని? లెక్కలేనన్ని అప్పులు. చేతిలో చిల్లి గవ్వ లేదు. నా వెనుక మరో చెల్లెలు. నడిరోడ్డు మీద నిలబడ్డాం. మా మామయ్య వాళ్లే ఆదుకున్నారు. ఆరు నెలల్లో డిగ్రీ అయిపోతుందనగా అంతా హఠాత్తుగా జరిగిపోయింది. డిగ్రీ తర్వాత పీజీ చేసి, మంచి ఉద్యోగం సాధించాలని ఎన్ని కలలు కన్నాం. అప్పుడు కుటుంబాన్ని నిలబెట్టుకోవటమే నాకు ముఖ్యం అనిపించింది. బావ చేతిలో మూడు ముళ్లు వేయించుకోక తప్పలేదు. నువ్వది అర్థం చేసుకోకుండా...’ తను చెబుతోంది.
అవును. నేను అర్థం చేసుకోలేదు. మధ్యలో రెండు మూడుసార్లు ఫోన్‌ చేసి విషయం చెప్పాలని చూసింది. కానీ, ఎన్ని మాటలన్నాను. ఎంత దూషించాను. అప్పట్లో నేనే తన కుటుంబానికి సాయం చేసి ఉండొచ్చు. కానీ, వ్యవసాయంలో నాన్నకి తీవ్ర నష్టాలు.
‘రవీ, మాట్లాడు’ తన మాటలతో మళ్లీ ఈలోకంలోకి వచ్చా.
‘కోపమేమీ లేదు మాధురీ. నిన్ను అన్ని మాటలన్నా అవేమీ పట్టించుకోకుండా నేను బాధలో ఉంటే మంచి మనసుతో ఫోన్‌ చేశావు. ఇంట్లో మనిషి పోవటమంటే కాళ్లకింద భూమి కదిలిపోవటమేనని మొదటిసారి నాకు తెలిసొచ్చింది. అప్పటి నీ పరిస్థితి ఏంటో నాకిప్పుడు బాగా అర్థమయ్యింది. నన్ను క్షమించు’ అన్నా.
‘ఛఛ.. అంత మాటెందుకులే. ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తుంటాను. నాన్నని జాగ్రత్తగా చూసుకో. తనని నీతోపాటు సిటీకి తీసుకెళ్లు. పిల్లలతో కాలక్షేపం అవుతుంది. నీ కష్టాన్ని పంచుకోటానికి ఒక స్నేహితురాలు ఉందని ఎప్పుడూ గుర్తుంచుకో...’ తను చెబుతుంటే ఇన్నాళ్లూ ఒక మంచి ఫ్రెండ్‌ని మిస్‌ చేసుకున్నందుకు నాకు కన్నీళ్లు ఆగలేదు.  

- ఎంవీబీ (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని