నన్ను, అతణ్నీ మోసం చేస్తోంది

ఒకమ్మాయితో మూడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నా. మేం అన్నిరకాలుగా దగ్గరయ్యాం. కానీ మంచి సంబంధం వచ్చిందనే కారణంతో తను నన్ను దూరం పెట్టింది.

Updated : 03 Jul 2021 05:47 IST

మనలో మనం

ఒకమ్మాయితో మూడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నా. మేం అన్నిరకాలుగా దగ్గరయ్యాం. కానీ మంచి సంబంధం వచ్చిందనే కారణంతో తను నన్ను దూరం పెట్టింది. త్వరలోనే పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్తోంది. ఇలా చేయడం నన్ను, పెళ్లాడబోయే వాడినీ మోసం చేస్తున్నట్టేగా. తనపై చాలా కోపంగా ఉంది. మేం సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఆ అబ్బాయికి చూపించాలనుకుంటున్నా. మరోవైపు నైతికంగా సరికాదు అనిపిస్తోంది. తనని మర్చిపోలేకపోతున్నా. ఏం చేయాలి?

- ఎస్‌.శ్రీహర్ష, ఈమెయిల్‌

మితంగా ఇష్టపడ్డ అమ్మాయి వేరొకరితో పెళ్లికి సిద్ధపడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులో నుంచి బయటికొచ్చి.. తను మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తోంది? మీ బలహీనతలేంటో ఒక్కసారి విశ్లేషించుకోండి. అప్పటికీ మీరు తనకి సరిజోడి అనిపిస్తే, మీది నిజమైన ప్రేమే అనిపిస్తే మీ మనోభావాలను, ఆ అమ్మాయి పట్ల మీకున్న ఫీలింగ్స్‌ అర్థమయ్యేలా వివరించండి. అయినా తను మీ ప్రేమను అంగీకరించకపోతే అది ప్రేమ కాదు ఆకర్షణే అని గ్రహించండి. మంచి స్నేహితుడిగా ఆమె భావి జీవితానికి స్వాగతం పలకండి. సొంత భవిష్యత్తు కోసం ఆమె మిమ్మల్ని వదిలి మరో మార్గం చూసుకుంది. అది స్వార్థమే కావొచ్చు. మిమ్మల్ని వద్దనుకొని వెళ్లిపోయిన అమ్మాయిని మళ్లీ మీ జీవితంలోకి అహ్వానించాలని ఎలా అనుకుంటున్నారు? మీకూ ఆత్మాభిమానం ఉంటుంది కదా?! పైగా వాళ్ల పెళ్లి చెడగొట్టాలనుకోవడం నైతికంగా కరెక్ట్‌ కాదని మీరే భావిస్తున్నారు. అంటే మంచి, చెడులు విశ్లేషించుకునే సామర్థ్యం మీలో ఉంది. ఇప్పటికైనా ఏది జరిగినా అది మన మంచికే అనే దృక్పథంతో ముందడుగు వేయండి. ప్రేమ మధురమైందే.. కానీ అదే జీవితం కాదు. ఇకపై భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆ ప్రేమ తాలూకు గుర్తులేవీ మీ దగ్గర పెట్టుకోకండి. ఆమె వస్తువులు, ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌.. అన్నీ తొలగించండి. సామాజిక మాధ్యమాల్లో తనని అనుసరించడం ఆపండి. ఖాళీగా ఉంటే ఆ ఆలోచనలే వేధిస్తాయి. మీకిష్టమైన వ్యాపకం ఏదైనా ఎంచుకోండి. కొత్త నైపుణ్యాలు పాత గాయం నుంచి కోలుకునేలా చేస్తాయి. చదువు, వృత్తిలో లక్ష్యాలు ఏర్పరచుకొని ముందుకెళ్తే ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, కుంగుబాటు తగ్గుతాయి. మీలో మీరే సతమతమయ్యే బదులు సామాజిక సంబంధాలు మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించండి. ఆప్త మిత్రులతో బాధ పంచుకోండి. పాత జ్ఞాపకాల్ని మర్చిపోయేలా ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఇవి మిమ్మల్ని కుదుట పడేస్తాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ధైర్యానిస్తాయి. ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని