బాతాఖానీ కొట్టేవాళ్లు.. బాధలు పంచుకునేవాళ్లు!

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. స్నేహితుల్లోనూ రకరకాలుంటారు. బాతాఖానీ కొట్టేవాళ్లు.. బాధలు పంచుకునేవాళ్లు.. పార్టీలకు ముందుండేవాళ్లు.. పరేషాన్‌లో కూల్‌ చేసేవాళ్లు.. అబ్బో.. చెప్పుకుంటూ పోతే జాబితా తెగదు. సరదాగా కొందరిని టచ్‌ చేద్దాం రండి.

Updated : 31 Jul 2021 05:28 IST

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. స్నేహితుల్లోనూ రకరకాలుంటారు. బాతాఖానీ కొట్టేవాళ్లు.. బాధలు పంచుకునేవాళ్లు.. పార్టీలకు ముందుండేవాళ్లు.. పరేషాన్‌లో కూల్‌ చేసేవాళ్లు.. అబ్బో.. చెప్పుకుంటూ పోతే జాబితా తెగదు. సరదాగా కొందరిని టచ్‌ చేద్దాం రండి.

చెడ్డీ దోస్త్‌లు: కాకి ఎంగిలితో తినుబండాలు షేర్‌ చేసుకున్నవాళ్లు.. చెరువులో కలిసి ఈత కొట్టినోళ్లు.. చిల్లర డబ్బులు పోగేసి వన్‌బై టూ చాయ్‌ తాగినోళ్లు.. వీళ్లు జిందగీ చివరిదాకా ఉంటే మన జీవితం ఫుల్‌ ఖుషీ అన్నమాటే.

పార్టీ ఫ్రెండ్‌: పార్టీ ఉందంటే పక్క రాష్ట్రానికైనా పరుగెత్తుకొచ్చే బాపతు. సంతోషాలకు ‘ఛీర్స్‌’ అంటాడు. కష్టాలు షేర్‌ చేసుకోవడం తక్కువే. ఆనందాల ‘నిషా’ కోరుకునేవాళ్లకు వీళ్లు ఓకే. కానీ ఈ స్నేహాలను దూరం పెడితేనే సేఫ్‌.

ఊహా నేస్తం: కలుసుకోవడం లేదు.. భుజంభుజం రాసుకునేదే లేదు. సోషల్‌ మీడియా, ఫోన్‌ కలిపిన దోస్త్‌లు వీళ్లు. అన్నీ షేర్‌ చేసుకుంటారు. అపోజిట్‌ ఫ్రెండ్స్‌ అయితే రొమాంటిక్‌గా, ఓపెన్‌గా మాట్లాడుకుంటారు.

నిఖార్సైన ఫ్రెండ్‌: థియేటర్‌లో  పక్కసీట్లో ఉంటాడు. పిలిస్తే పరుగెత్తుకొస్తాడు. అమ్మాయి మీద మనసు పడితే లవ్‌ లెటర్‌ రాసిస్తాడు. రోగమొస్తే డబ్బులతో మందులు తీసుకొస్తాడు. బాధల్లో ఉంటే జేబులో కరెన్సీ నోట్లు కుక్కుతాడు. క్లాస్‌మేట్‌, కొలీగ్‌, ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఎవరైనా కావొచ్చు. వీడు పక్కనుంటే భరోసా మన పాకెట్లో ఉన్నట్టే.

సలహాదారు: అడక్కముందే అన్నీ సలహాలు ఇచ్చేస్తుంటారు. ఫలానా కోర్సులో చేరు.. ఈ రంగు బైకే తీసుకో.. ఆ అమ్మాయి నీకు సరిజోడు.. ఇలా వాళ్ల అభిప్రాయాల్ని మనపై రుద్దేస్తుంటారు. మంచి సలహా తీసుకుంటే తప్పేం లేదు. కాకపోతే వీడికి హద్దులు గీస్తే మంచిది.

ఫన్‌ ఫ్రెండ్‌: వీడు ఎక్కడ ఉంటే అక్కడ సరదాల సునామీనే. ఆ సందడి కోసమే ఫ్రెండ్షిప్‌ చేయాలనిపిస్తుంది. అన్నివేళలా తోడుండే ఆత్మీయుడు కాకపోయినా వాడి పేరెత్తగానే పెదాలు విచ్చుకుంటాయి. మరీ అంత క్లోజ్‌ కాకపోయినా బాగా ఇష్టపడే నేస్తం.

క్లోజ్‌ ఫ్రెండ్‌: మన మౌనం వెనక బాధ పట్టేస్తాడు. మన పెదాలకి నవ్వులు అద్దుతాడు. నీ కష్టం నాదంటాడు. బీఎఫ్‌ఎఫ్‌, జిగిరీ దోస్త్‌.. పేరేదైనా పెట్టుకోవచ్చు. విషయం ఏదైనా ముందు తనకే చెప్పుకోవాలనిపిస్తుంది. కడుపులో ఏమీ దాచుకోకుండా వెళ్లగక్కేయాలి అనిపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని