సేవా నేస్తం.. జాతీయ పురస్కారం

ఊరు బాగు పడటమే మేడిశెట్టి రామ్మోహన్‌ లక్ష్యం. ఆచరణలోకి దిగాడు. అవహేళనలు ఎదురయ్యాయి. అయినా మరింత కసితో ముందుకెళ్లాడు.

Updated : 14 Aug 2021 00:51 IST

ఊరు బాగు పడటమే మేడిశెట్టి రామ్మోహన్‌ లక్ష్యం. ఆచరణలోకి దిగాడు. అవహేళనలు ఎదురయ్యాయి. అయినా మరింత కసితో ముందుకెళ్లాడు. అతడి తపన అర్థమై కొన్ని చేతులు జత కలిశాయి. అలా అందరి కృషితో 24వేల జనాభా ఉన్న ఊరు స్వరూపమే మారిపోయింది. ఈ కష్టానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ జాతీయ యువజన పురస్కారానికి ఎంపికయ్యాడు.

రామ్మోహన్‌ది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంద్రపాలెం. అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో ఆరేళ్ల కిందట ‘మన ఊరు- మన బాధ్యత’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాడు.

ఏం చేశాడు?: ఊరు శుభ్రంగా ఉంటే రకరకాల రోగాలు తగ్గుతాయి. ముందు పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టాడు. రహదారులు, కాలువలు శుభ్రపరిచాడు. రోడ్డుకిరువైపులా వేల మొక్కలు నాటి, ఇనుప కంచెలు ఏర్పాటు చేశాడు. గోదావరి కాలువ గట్టున పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి ఉద్యానవనం ఏర్పాటు చేశాడు. అక్కడే గ్రంథాలయం మొదలైంది. ఆ ప్రాంగణంలో మహాత్మా గాంధీ, అబ్దుల్‌ కలాం లాంటి జాతీయ నేతల విగ్రహాలు నెలకొల్పాడు. విద్యార్థులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం క్లాసులు, పాలిటెక్నిక్‌ కోచింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నాడు. వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, వంతెనకు మరమ్మతులు, పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేయడం, వినాయక చవితికి ఇంటింటికీ ఉచితంగా మట్టి విగ్రహాలు పంచడం.. ప్రతి సందర్భంలోనూ సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తూనే ఉంది రామ్మోహన్‌ ఆధ్వర్యంలోని సంస్థ. ఇది కొవిడ్‌ లాక్‌డౌన్‌లోనూ పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామంలో సౌభ్రాతృత్వం పరిఢవిల్లడానికి కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహిస్తున్నారు.

అడ్డంకులు దాటి: సదాశయంతో సంస్థ ప్రారంభించినా మొదట్లో కష్టాలు తప్పలేదు. పరిశుభ్రత పేరిట గ్రామంలో కాలువలు శుభ్రం చేస్తుంటే ఒక్కడి వల్ల ఊరు బాగు పడుతుందా?’ అని కొందరు అవహేళన చేశారు. ‘ముందు నువ్వు బాగు పడు. తర్వాతే ఊరిని ఉద్ధరించే పని చేద్దువుగానీ’ అంటూ కుటుంబ సభ్యులు మందలించారు. ఎవరేం అన్నా ముందుకే వెళ్లాడు రామ్మోహన్‌. అతడి సదాశయం నచ్చి స్థానికులు, యువకులు చేతులు కలపడం మొదలుపెట్టారు. ముగ్గురితో మొదలైన సంస్థలో ఐదేళ్లలో తన వెన్నంటి ఉండే 200 మంది సేవా సైనికులు తయారయ్యారు. వాళ్లే తలా కొంత పోగేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంస్థ స్ఫూర్తితో స్థానిక బాలికలు, యువతులు స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా ప్రతి ఆదివారం రోడ్లపై చెత్తను ఊడుస్తూ ఉద్యానవనాన్ని శుభ్రం చేస్తున్నారు.

గుర్తింపు: సంస్థ చేస్తున్న కార్యక్రమాలు గుర్తించి జిల్లా అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా సత్కరించారు. 2017-2018 సంవత్సరానికి రామ్మోహన్‌ జాతీయ యువజన పురస్కారానికి ఎంపికయ్యాడు. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నుంచి పురస్కారం అందుకున్నాడు.

- పంపనబోయిన నాగసురేష్‌, కాకినాడ గ్రామీణం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని