చదువుతూనే.. సరికొత్త ఆవిష్కరణ

బాగా చదివితే మంచి మార్కులొస్తాయి... ఆ ప్రతిభని ఆచరణలో పెట్టి జనాలకు ఉపయోపడేలా మలిస్తే...?  ప్రశంసలు పోటెత్తుతాయి.. పురస్కారాలూ వరిస్తాయి... అదేబాటలో రైతన్నకు దన్నుగా నిలిచే ఆవిష్కరణ చేశాడు...

Updated : 25 Sep 2021 06:22 IST

బాగా చదివితే మంచి మార్కులొస్తాయి... ఆ ప్రతిభని ఆచరణలో పెట్టి జనాలకు ఉపయోపడేలా మలిస్తే...?  ప్రశంసలు పోటెత్తుతాయి.. పురస్కారాలూ వరిస్తాయి... అదేబాటలో రైతన్నకు దన్నుగా నిలిచే ఆవిష్కరణ చేశాడు చిత్తూరు జిల్లా పీలేరు విద్యార్థి షేక్‌ అల్తాఫ్‌. జాతీయస్థాయి గుర్తింపు అందుకున్నాడు.

ల్తాఫ్‌ ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థి. ముందునుంచీ చదువులో మెరిట్‌. ఇంజినీరింగ్‌లో తన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రైతులకు మేలు జరిగేలా కొత్త ఆవిష్కరణ చేయాలనుకున్నాడు. సహ విద్యార్థులు ఉమ్మడి వినయ్‌ (నెల్లూరు), గుండుపల్లె అరవింద్‌ (మదనపల్లె), పరిగి ఇర్ఫాన్‌బాషా (అనంతపురం), గాది లింగప్ప (కర్నూలు), జానపాటి మనోజ్‌(కడప)లు చేతులు కలిపారు. నాలుగేళ్ల పాటు కష్టపడి పంటకు నీరు పారించే ‘ఇంటెలిజెంట్‌ ఇరిగేషన్‌ బాట్‌’ ఆవిష్కరించారు. మైక్రో కంట్రోలర్స్‌, సెన్సర్లు, మోటారు, ఫ్రేమ్‌, సోలార్‌ బ్యాటరీలతో రూపొందిన ఈ యంత్రాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాసి మైక్రో కంట్రోలర్‌కు అనుసంధానించారు. దీనికోసం సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ అగ్రిప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం కింద అల్తాఫ్‌ 2 నెలలు శిక్షణ తీసుకున్నాడు.

వాతావరణ మార్పులు, నీటి పారుదలలో హెచ్చుతగ్గులు, అధిక మోతాదులో పురుగుల మందుల వాడకంతో పంట దిగుబడులు తగ్గి చాలామంది రైతులు నష్టపోతున్నారు. దీన్నుంచి బయట పడేయడానికే ఆవిష్కరణ చేశానంటున్నాడు అల్తాఫ్‌. ఈ బాట్‌కి ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సెల్‌ఫోన్‌తో అనుసంధానిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా రైతు ఎక్కడి నుంచి అయినా దీన్ని ఆపరేట్‌ చేయొచ్చు. పంటకి ఎంత నీరు వెళ్లిందీ, భూమిలో తేమ శాతం, ఉష్ణోగ్రతలూ పరిశీలించవచ్చు. ఈ వివరాల సాయంతో బాట్‌ దానంతట అదే పంపును నియంత్రించుకుంటూ నీటి సరఫరా చేస్తుంది. పాలీహౌస్‌, గ్రీన్‌హౌస్‌ పంటలకు ఇది బాగా పని చేస్తుంది. రైతు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేకపోవడంతో విద్యుదాఘాతం, విషసర్పాల బారిన పడకుండా ఉంటారు. విద్యుత్తు, నీరు, సమయం ఆదా అవుతాయి. నీరు కావాల్సిన మేరకే అందడంతో అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రైతులకు ఉపయుక్తంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ రూ.3.3లక్షల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసింది. ప్రయోగదశలో ఉన్న ఈ ఆవిష్కరణను త్వరలోనే పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామంటోంది అల్తాఫ్‌ మిత్రబృందం.


* అమరావతిలో జరిగిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీస్‌ ఫర్‌ స్మార్ట్‌ సిటీలో మొదటి బహుమతి

* అండర్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌లో రెండోస్థానం.

* ఐఐటీ కాన్పూర్‌ టెక్‌ సిటీ ఇన్నోవేషన్‌, హైదరాబాద్‌ ఏసీఐ హ్యాకథాన్‌ పోటీల్లో ప్రదర్శన.

- మల్లేపల్లి సురేంద్ర, పీలేరు గ్రామీణం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని