ఆట సిక్సరూ.. చదువేమో బౌల్డ్‌!

పొట్టి వరల్డ్‌కప్‌ మొదలవుతోంది. మన ఆటగాళ్లని కొత్తగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ఎం.ఎస్‌.ధోనీ- గ్రేటెస్ట్‌ కెప్టెన్‌. విరాట్‌ కోహ్లి- ఆల్‌టైం గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. హార్ధిక్‌ పాండ్యా- మంచి ఆల్‌రౌండర్‌.

Updated : 23 Oct 2021 05:19 IST

పొట్టి వరల్డ్‌కప్‌ మొదలవుతోంది. మన ఆటగాళ్లని కొత్తగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ఎం.ఎస్‌.ధోనీ- గ్రేటెస్ట్‌ కెప్టెన్‌. విరాట్‌ కోహ్లి- ఆల్‌టైం గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. హార్ధిక్‌ పాండ్యా- మంచి ఆల్‌రౌండర్‌. రోహిత్‌ శర్మ- డబుల్‌ సెంచరీల వీరుడు. బంతుల్ని అలవోకగా బౌండరీలు దాటిస్తూ.. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలు రచించే ఈ క్రికెటర్లు డిగ్రీ కూడా దాటలేదనే విషయం మీకు తెలుసా? ఆఫ్‌కోర్స్‌.. చదువుకి, ప్రతిభకు ముడిపెట్టలేం కానీ.. రండి సరదాగా ఆ ముచ్చట్లు చెప్పుకుందాం.


హార్ధిక్‌ పాండ్యా

తొమ్మిది ఫెయిల్‌

గుజరాత్‌లోని సూరత్‌లో పుట్టిపెరిగిన హార్ధిక్‌ పాండ్యాది పేద కుటుంబం. తన తండ్రి క్రికెటర్‌ కావాలని కలలు కన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. పిల్లలైనా ఆటగాళ్లు కావాలని మంచి శిక్షణ సంస్థలో చేర్పించారు. చదువునూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కానీ మనసంతా బ్యాట్‌, బంతిపైనే ఉండటంతో తొమ్మిదిలోనే డింకీ కొట్టాడు పాండ్యా. అయితేనేం.. తర్వాత ఆటతో ఎదిగాడు. ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడే నటాషాని పెళ్లాడాడు.


విరాట్‌ కొహ్లీ

ఇంటర్‌ దాటాడు

విరాట్‌ చదువుల్లో ర్యాంకులు కొట్టాలని ఆయన తల్లి ఆశ. తనేమో బ్యాట్‌తో రికార్డులు సృష్టిస్తూ చదువుని అటకెక్కించాడు. తనకి చిన్నప్పట్నుంచే క్రికెట్‌ అంటే పిచ్చి. తల్లి వద్దని పోరు పెడుతున్నా ఆటలకి ప్రాధాన్యం ఇచ్చే దిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌ స్కూల్‌కి మారాడు. అక్కడ ఇంటర్‌ పూర్తవగానే అండర్‌-19 జట్టుకి ఎంపికయ్యాడు. తర్వాత అంతా చరిత్రే. జూనియర్‌ జట్టుని ప్రపంచకప్‌ విజేతగా నిలపడంతో కొన్నాళ్లకే సీనియర్‌ జట్టు నుంచి పిలుపు వచ్చింది. పుస్తకం వదిలేశాడు.


ఎం.ఎస్‌.ధోనీ - ఇంటర్‌ డాక్టరేట్‌

అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించే సూపర్‌ కెప్టెన్‌ మహీకి చిన్నప్పుడు పుస్తకం పడితే మాత్రం ఏమీ అర్థం అయ్యేది కాదట. అందుకే చదువుకన్నా ఆటనే నమ్ముకునేవాడు. రాంచీ డీఏవీ జవహర్‌ విద్యా మందిర్‌లో ఫుట్‌బాల్‌ ఆటలో ఓనమాలు దిద్దాడు. సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో చేరాక అక్కడ ఓ గురువు సలహాతో క్రికెట్‌కి మారాడు. అత్తెసరు మార్కులతో ఇంటర్‌ పూర్తికాగానే టికెట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. రైల్వేస్‌ జట్టు తరపున బ్యాటుతో చెలరేగిపోవడంతో మళ్లీ పుస్తకం పట్టే అవకాశం రాలేదు. అన్నట్టు డీ మాంట్‌ఫోర్ట్‌ యూనివర్సిటీ నుంచి 2011లో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు ధోనీ.


రోహిత్‌శర్మ

ఇంటర్‌ పాస్‌

వన్డేల్లో అలవోకగా మూడు డబుల్‌ సెంచరీలు బాదిన రోహిత్‌, తన పేరు వెనక ఒక్క డిగ్రీ పట్టా కూడా లేదు. చదువులో మరీ వెనక బెంచీ విద్యార్థి కాకపోయినా క్రికెట్‌లో మంచి అవకాశాలు రావడంతో చదువును వదిలేయక తప్పని పరిస్థితి. ముంబయిలోని లేడీ వేలంకణి హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే జూనియర్‌ స్థాయి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు రోహిత్‌.


శిఖర్‌ ధావన్‌

పన్నెండుతో స్టాప్‌

నమ్మకమైన ఓపెనర్‌ ‘గబ్బర్‌’ చదువులో మంచి ప్రతిభావంతుడే అయినా, క్రికెట్‌ కోసం దాన్ని త్యాగం చేశాడు. తను సెయింట్‌ మార్క్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ నుంచి ఇంటర్‌ పూర్తి చేశాడు. అక్కడే క్రికెట్‌ పరిచయమైంది. మంచి ప్రతిభ చూపడంతో దిల్లీ జట్టు తరపున అవకాశం దక్కింది. అక్కడ పరుగుల వరద పారించడంతో ఇక పైచదువులకు వెళ్లే అవకాశం చిక్కలేదు.


- వీళ్లే కాదు.. క్రికెట్‌ గాడ్‌గా భావించే సచిన్‌ తెందుల్కర్‌ పదోతరగతి వరకే చదివాడు. జహీర్‌ఖాన్‌ ఇంజినీరింగ్‌ డ్రాపవుట్‌ విద్యార్థి. 1983 ప్రపంచకప్‌ని అందించిన కపిల్‌దేవ్‌ క్రికెట్‌ కోసం డిగ్రీ వదిలేశాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని