పదికాలాల..ప్రేమానుబంధం!

ఐదేళ్ల ప్రేమ.. టాటూలు వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో జంటగా ఫొటోలతో చెలరేగిపోయారు. ఇప్పుడేమో ‘బ్రేకప్‌’ అనేశారు. ఇది బుల్లితెర స్టార్ల సంగతి. వీళ్లేకాదు.. ఎన్నో జంటల ప్రేమ.. పెళ్లి పీటలెక్కకుండానే పెటాకులవుతోంది

Updated : 08 Jan 2022 06:05 IST

ఐదేళ్ల ప్రేమ.. టాటూలు వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో జంటగా ఫొటోలతో చెలరేగిపోయారు. ఇప్పుడేమో ‘బ్రేకప్‌’ అనేశారు. ఇది బుల్లితెర స్టార్ల సంగతి. వీళ్లేకాదు.. ఎన్నో జంటల ప్రేమ.. పెళ్లి పీటలెక్కకుండానే పెటాకులవుతోంది. యువ దంపతుల సంసారం విచ్ఛిన్నమవుతోంది. దీనికి కారణాలేంటి? పదికాలాలపాటు బంధం పదిలం కావాలంటే.. ఏం చేయాలి?

గుట్టుగా: రెండు మనసుల మధ్య ఉండాల్సిన ప్రేమను ప్రపంచానికంతటికీ తెలిసేలా చాటుకోవాల్సిన పన్లేదు. ఆ ప్రేమ చాటుకోవాలనే ఆరాటంలో సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కడం.. ఊరంతా చాటింపు వేస్తుంటే.. ఆ ప్రేమ ఇతరులకు కామెంట్‌ చేయడానికి ముడిసరుకైపోతుంది. గిట్టనివారికి కంటగింపుగా మారుతుంది.

అతి చొరవ: మనుషులు అప్పుడప్పుడు దూరంగా ఉంటేనే మనసులు దగ్గరవుతుంటాయి. అతి చొరవ కూడా ఇరకాటంలో పడేస్తుంది. ప్రేమికులు, దంపతుల మధ్య దాపరికాలేం ఉండొద్దంటూ ‘నీ ఎఫ్‌బీ పాస్‌వర్డ్‌ చెప్పు’, ‘క్రెడిట్‌ కార్డు పిన్‌ నెంబర్‌ ఏంటి?’ అని అడిగితే ఒక్కోసారి అవతలివారికి నచ్చకపోవచ్చు. నాకు ప్రైవసీ లేకుండా పోతుందని మథన పడిపోతుండొచ్చు.

సర్దుకుపోవడం: ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. ఎంత మనసుకి నచ్చినవారైనా కొన్ని లోపాలుంటాయి. వాటిని ఆమోదించి, సర్దుకుపోవాలే తప్ప భూతద్దం పెట్టుకొని చూస్తూ కూర్చుంటే, ప్రేమదేవత కాస్తా రాక్షసిలా కనిపిస్తుంది. మనసుకి నచ్చినోడే విలన్‌ అనిపిస్తాడు. లోపాల్ని మన్నించగలిగితేనే ప్రేమకు కలకాలం మన్నిక.

ఆశించొద్దు: తెల్లవారగానే మొదటి గుడ్‌ మార్నింగ్‌ తనదే అయ్యుండాలి.. పుట్టినరోజున ఖరీదైన కానుక ఇవ్వాలి.. వీకెండ్‌లో సరదాగా ఊరంతా తిప్పాలి.. ఇలా ఆశించినప్పుడు అది అన్నిసార్లు జరగకపోవచ్చు. ఆశాభంగం కలిగినప్పుడు మనసు విలవిల్లాడుతుంది. అసలు ఏమీ కోరుకోకుంటే...? హాయిగా ఉంటుంది. అడక్కుండానే భాగస్వామి ఇచ్చేది తీపి జ్ఞాపకంలా మిగులుతుంది.

సన్నిహితంగా: ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లి బంధంలో ఒదిగినప్పుడు ఆ ప్రేమ, అనురాగం భాగస్వామికే దక్కాలి. అలా కాకుండా వేరొకరితో సన్నిహితంగా ఉంటే సహజంగానే బంధం బలహీనమవుతుంది. ఒకవేళ వేరేవాళ్లకి ప్రాముఖ్యం ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే.. ఎందుకలా చేయాల్సి వచ్చిందో విడమరిచి చెప్పగలగాలి. నువ్వంటేనే లవ్వు.. తనతో కొద్ది క్లోజ్‌గా ఉంటే తప్పేంటి? అంటే దాన్ని ఆమోదించేంత విశాల హృదయం అందరికీ ఉండదుగా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని