పల్లె కెరటం.. కడలిపై పోరాటం

రాజుది చిత్తూరు జిల్లా సీఆర్‌ కండ్రిగ. కనీస సదుపాయాలు లేని మారుమూల పల్లె. అయినా చుట్టుపక్కల పరిస్థితులను నిశితంగా గమనించేవాడు. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకునేవాడు. ఆ అలవాటే మోహన్‌ని

Updated : 08 Jan 2022 05:55 IST

బస్సులు తిరగని పల్లెటూరిలో పుట్టాడు. భారీ నౌకలకి టెక్నాలజీ తళుకులు అద్దుతున్నాడు. ఊరు దాటితేనే గొప్ప అనుకునే కుటుంబం... దేశదేశాలు తిరుగుతూ సేవలందిస్తున్నాడు. తనే చిత్తూరు యువకుడు మోహన్‌రాజు. విదేశీ షిప్పింగ్‌ కంపెనీకి మెరైన్‌ ఐటీ హెడ్‌. తను ఎదిగిన వైనం యువతకి స్ఫూర్తిదాయకం.

రాజుది చిత్తూరు జిల్లా సీఆర్‌ కండ్రిగ. కనీస సదుపాయాలు లేని మారుమూల పల్లె. అయినా చుట్టుపక్కల పరిస్థితులను నిశితంగా గమనించేవాడు. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకునేవాడు. ఆ అలవాటే మోహన్‌ని ఉన్నతస్థానంలో నిలిపింది. ఇంటర్‌ అయ్యాక చెన్నైలోని ఓ కాలేజీలో తనకిష్టమైన మెరైన్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు. తర్వాత ఒక షిప్పింగ్‌ కంపెనీలో మెరైన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అక్కడ మెరైన్‌ ఇంజినీరింగ్‌ అంతా పాత పద్ధతుల్లో.. యంత్రాల చుట్టే తిరుగుతోంది తప్ప టెక్నాలజీ అందిపుచ్చుకోవడం లేదనే విషయం గమనించాడు. ఇందులో నైపుణ్యం సాధించడానికి ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కస్టమర్‌ సర్వీసెస్‌’ అంశంలో ఎంబియ్యే పూర్తి చేశాడు. తర్వాత డెన్మార్క్‌ ప్రధాన కార్యాలయంగా ముంబైలో సేవలందిస్తున్న ‘అల్ట్రాషిప్‌’ అనే షిప్పింగ్‌ కంపెనీలో చేరాడు. నౌకల్లో ఆధునిక పద్ధతులు అవలంబించడం, టెక్నాలజీ మార్పుపై ఓ ప్రాజెక్టు రూపొందించే బాధ్యతలు అతడికి అప్పజెప్పింది సంస్థ. ఈ అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకొని నావిగేషనల్‌ సాఫ్ట్‌వేర్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, మెరైన్‌ ఈఆర్పీ, మెరైన్‌ సిస్టమ్స్‌ సైబర్‌ భద్రతలతోపాటు నౌకల్లో ఇంటర్నెట్‌ సదుపాయాలను ఏర్పాటు చేసేలా ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. ఇది సంస్థలోని ఉన్నతాధికారులకు నచ్చి డెన్మార్క్‌లోని ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడికెళ్లి పెద్దల్ని ఒప్పించడంతో మోహన్‌ సూచించిన టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 భారీ నౌకల్లో అమలు చేయమన్నారు.

నౌక సముద్రంలోకి వెళ్లిన తర్వాత అందులోని సిబ్బంది, ప్రయాణికులు భూమిపై ఉన్నవారితో మాట్లాడటం కుదరదు. రక్షణశాఖకే సొంతమైన ఈ టెక్నాలజీని ప్రైవేటు షిప్పింగ్‌ సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు రాజు. దానికోసం నౌకల్లో ప్రత్యేక యాంటెన్నాలు ఏర్పాటు చేసి వాటిని ఉపగ్రహంతో అనుసంధానం చేశాడు. దీనికోసం ‘సీస్‌నెట్‌’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. నాలుగేళ్లలో జపాన్‌, సింగపూర్‌, డెన్మార్క్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, అమెరికా సహా 35 దేశాలు తిరిగాడు. దీంతోపాటు నౌకల్లోని సిబ్బందికి ఈ విషయాలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నాడు. మెరైన్‌ ఇంజినీరింగ్‌కి, టెక్నాలజీని సమ్మిళితం చేసిన ఓ పల్లెటూరి యువకుడు చిన్న ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి ఓ విదేశీ కంపెనీలో మెరైన్‌ ఐటీ హెడ్‌ స్థాయికి ఎదగడం చెప్పుకోదగ్గ విజయమే.

- మహంకాళి కిరణ్‌కుమార్‌, తిరుపతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని