భలేడియం

మీకు తెలిసిన విలువైన లోహాలేంటీ? అని ఎవరైనా అడిగితే... బంగారం, వెండి అని చెప్పేస్తారు కదూ... ఆ జాబితాలో నేనూ ఉన్నానంటూ మన పేజీలోకి వచ్చేసింది పలేడియం... ఇంతకీ ఇదేంటీ? దీని సంగతులేంటీ? గబగబా చదివేయండి! 

Published : 04 Feb 2020 00:16 IST

మీకు తెలిసిన విలువైన లోహాలేంటీ?
అని ఎవరైనా అడిగితే... బంగారం, వెండి అని చెప్పేస్తారు కదూ... ఆ జాబితాలో నేనూ ఉన్నానంటూ మన పేజీలోకి వచ్చేసింది పలేడియం...
ఇంతకీ ఇదేంటీ? దీని సంగతులేంటీ?
గబగబా చదివేయండి!


* నా పరిచయం!

* పలేడియం. ఈ పేరు ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా? నేనూ ఒక రసాయన మూలకాన్నే. నా పరమాణు సంఖ్య 46. నన్ను ్ప్ట  అనే సంకేతంతో సూచిస్తారు.
* నేనో అరుదైన ప్రకాశవంతమైన వెండి తెలుపు లోహాన్ని. నాకు తీగలుగా, రేకులుగా సాగే మెత్తని గుణం ఉంది.
* ఎంతకాలం వాతావరణానికి గురి చేసినా సాధారణ ఉష్ణోగ్రతల దగ్గర నా మెరుపు తగ్గదు.
* నన్ను 1803లో రసాయన శాస్త్రవేత్త విలియం హైడ్‌ వూలస్టాన్‌ గుర్తించాడు.
* నత్రికామ్లం, హైడ్రోక్లోరికామ్లం మిశ్రమంలో ప్లాటినమ్‌ను కరిగించినప్పుడు ప్లాటినమ్‌ పూర్తిగా క్షీణించి ఆ మిశ్రమ ఆమ్లాలలో మరొక లోహం మిగిలిపోవడం గుర్తించారు. అదే నేనన్నమాట. ప్లాటినమ్‌, రోడియం, రుథీనియమ్‌, ఇరిడియమ్‌, ఓస్‌మియమ్‌ మూలకాలతో పాటు నన్నూ ప్లాటినమ్‌ వర్గపు లోహాలుగా పిలుస్తారు.


* ఎక్కడి నుంచి లభిస్తానంటే...

* ప్రకృతిలో నేను విడిగా లభిస్తుంటా. పారిశ్రామికంగా నికెల్‌, రాగి ఖనిజాల నుంచి నన్ను ఉత్పత్తి చేస్తారు. అంతేకాదు రాగి, జింక్‌ల శుద్ధి ప్రక్రియల్లో కూడా సహ ఉత్పత్తి రూపంలో (బైప్రోడక్టు) వస్తుంటా.

* బ్రెజిల్‌లో లోహ రూపంలో దొరుకుతుంటా. కానీ ఎక్కువగా సల్ఫైడ్‌ ఖనిజాలైన బ్రాగైట్‌లో బాగా లభిస్తుంటా.

* ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న నా లోహంలో నలభై శాతం రష్యా, దక్షిణాఫ్రికాలు ఉత్పత్తి చేస్తున్నాయి.


* నా వల్ల లాభాలు...

* ఆభరణాల తయారీలో ప్లాటినమ్‌కు బదులుగా నన్ను, నా మిశ్రమ లోహాలను ఉపయోగిస్తారు.
* విద్యుత్‌ సంధానాల్లో, అలంకరణల్లో సాగగొట్టి తయారు చేసిన నా లోహపు రేకులను వినియోగిస్తారు.
* బంగారంతో స్వల్ప పరిమాణంలో నన్నూ కలిపి తయారు చేసిన మిశ్రమలోహం అత్యుత్తమమైన తెల్ల బంగారంగా కనిపిస్తుంది.
* దంత చికిత్సల్లో నా మిశ్రమ లోహాలను ఉపయోగిస్తారు.
* వాహనాల్లో రోడియంతో కలిపి నన్ను కెటాలిటిక్‌ కన్వర్టర్లుగా ఉపయోగిస్తారు. వాహనాల్లో ఎగ్జాస్టు గొట్టాల్లో ఉండే నేను వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య పదార్థాలైన హైడ్రోకార్బన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లను నిరపాయకరమైన నీరు, కార్బన్‌డైఆక్సైడ్‌, నైట్రోజన్‌లుగా మార్చి బయటకు పంపుతుంటా.
* ఎలక్ట్రానిక్‌ ప్రింటెడ్‌ వలయాల తయారీలోనూ నన్ను పూతగా వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్స్‌, పురాతన ఛాయాచిత్ర పరికరాల్లో, నాణాల్లో, నీటిని శుద్ధి చేసే పరికరాల్లోనూ ఉపయోగిస్తున్నారు.


* నా ప్రత్యేకతలు!

* నేను ఆక్సిజన్‌తో చర్యలో పాల్గొనను. అందుకే ఆభరణాల్లో మెరుపు తగ్గని లోహంగా నాకెంతో ప్రాముఖ్యం ఉంది.
* నా ఘన పరిమాణానికి 900 రెట్లు మించి హైడ్రోజన్‌ను పీల్చుకోగలను. అందుకే హైడ్రోజన్‌ను నిల్వ చేసుకునేందుకు నన్ను ఒక పరిపూర్ణమైన పాత్రగా ఉపయోగిస్తారు.
* జీవశాస్త్రప్రకారం చర్యలో పాల్గొనను. అందుకే ఆభరణాల తయారీలో ఇతర ఖరీదైన లోహాలతో పాటు నన్నూ ఉపయోగిస్తారు. నా ఆభరణాలు ధరించిన వారికి ఏవిధమైన అలర్జీరాదు.
* ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న నా లోహంలో దాదాపు సగభాగం కెటాలిటిక్‌ కన్వర్టర్ల తయారీకి వాడుతున్నారు.
* 1939 నుంచి ఆభరణ తయారీదారులు ప్లాటినమ్‌కు బదులుగా నన్ను ఉపయోగించి తెల్లబంగారం సృష్టిస్తున్నారు.
* ప్లాటినమ్‌ వర్గపు లోహాల్లో నేను చాలా చురుకుగా రసాయన చర్యల్లో పాల్గొంటా.
* ఫాస్ఫరస్‌, ఆర్సెనిక్‌, ఆంటిమనీ, సిలికాన్‌, సల్ఫర్‌ వంటి అలోహాలతో చర్యపొంది సమ్మేళన పదార్థాలు ఏర్పరుస్తుంటా.
* పలేడియం ముందు బంగారం, వెండి దిగదుడుపే అని మీరంతా అనుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని