తల తెగినా బతికేస్తాం!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నన్ను చూస్తుంటే ‘బాబోయ్‌ బొద్దింకనా? వంటగదిలో ఇది కనిపిస్తేనే చిరాకు పడిపోతుంటాం. ఇది రాకుండా ఉండటానికి బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది ఇలా పేజీలోకి వచ్చేసిందేంటి’ అనుకుంటున్నారా? కోప్పడకండి ప్లీజ్‌. నన్ను చూడ్డమే తప్ప మీకు నా విశేషాలన్నీ తెలియవని చెప్పడానికి వచ్చా.. మరి వింటారా?

Published : 16 Mar 2020 00:27 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! నన్ను చూస్తుంటే ‘బాబోయ్‌ బొద్దింకనా? వంటగదిలో ఇది కనిపిస్తేనే చిరాకు పడిపోతుంటాం. ఇది రాకుండా ఉండటానికి బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది ఇలా పేజీలోకి వచ్చేసిందేంటి’ అనుకుంటున్నారా? కోప్పడకండి ప్లీజ్‌. నన్ను చూడ్డమే తప్ప మీకు నా విశేషాలన్నీ తెలియవని చెప్పడానికి వచ్చా.. మరి వింటారా?

నేనో కీటకాన్ని. నిశాచర, సర్వభక్షక కీటకాన్ని. అదేనండీ రాత్రివేళల్లో తిరిగేస్తుంటా. ఏదైనా తినేస్తుంటా.
* బ్లటాడియా క్రమానికి చెందిన జీవిని.
* ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో నేనుంటా. ముఖ్యంగా మనుషుల నివాసాల్లో ఎక్కువగా కనిపిస్తుంటా. ఈ విషయం మీకు తెలుసనుకోండి.
* మాలో దాదాపు 4,600 రకాల జాతులున్నాయి. వీటిల్లో 30 రకాల జాతులు మాత్రం ఎక్కువగా మీరుండే ప్రాంతాల్లో తిరుగాడేస్తుంటాయి.
* పొడవైన రెండు మీసాలు, ఆరు కాళ్లతో ఉండే మేం మామూలుగా అర అంగుళం పొడవుంటామంతే. మాలో అతి పెద్ద జాతిది రెండు అంగుళాల పొడవుంటుంది.


* మీకు తెలుసా? 40 నిమిషాల వరకు మేం శ్వాస తీసుకోకుండా ఉండగలం.
* మాకు చీకటంటేనే ఇష్టం. అందుకే వంటింట్లో లైట్లు ఆఫ్‌ చేయగానే వేట మొదలుపెడతాం.
* వేలెడంతైనా ఉండం కానీ మా వేగం మాత్రం ఎక్కువే. గంటకు ఇంచుమించు 3 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాం. మా కాళ్లు ప్రత్యేకంగా ఉంటాయి దీంతో నేల ఎలా ఉన్నా సులువుగా పరుగెడతామన్నమాట.
* ఆడ బొద్దింకలు 10 నుంచి 40 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు ప్రత్యేకమైన ఎగ్‌ కేసుల్లో సురక్షితంగా ఉంటాయి. కొన్ని రోజులకు వీటి నుంచి పిల్లబొద్దింకలు బయటకు వస్తాయి.


* మాలో మడగాస్కర్‌ హిస్సింగ్‌ కాక్రోచ్‌ వింత శబ్దాలు చేస్తుంటుంది.
* తినకుండా మీరు మహా అయితే  ఓ వారం ఉంటారేమో మేమైతే ఏకంగా ఓ నెల రోజుల పాటూ తిండీతిప్పలు లేకపోయినా ఉండగలం. నీళ్లు లేకపోయినా రెండు వారాలపాటు బతికేస్తాం.
* మీకో సంగతి చెప్పనా? మా తలను కత్తిరించినా వారం రోజుల పాటు బతికేస్తాం. కారణం మా శరీరపు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాం. కానీ ఆహారం తీసుకోవడానికి ఉండదు కాబట్టి వారం తర్వాత చనిపోతాం.
* మేం దాదాపు 320 మిలియన్‌ సంవత్సరాల క్రితం నుంచే ఈ భూమిపై ఉంటున్నామట.


* మా ద్వారా 33 రకాల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అందుకే మేమంటే మీకు చిరాకు.
* మాలో చాలా వాటికి రెక్కలుంటాయి. కానీ మేం అంతగా ఎగరలేం.  
* మా రక్తం మీలా ఎర్రగా ఉండదు. తెల్లగా ఉంటుంది. కారణం మా రక్తంలో హిమోగ్లోబిన్‌ ఉండదు.


* మీరు గమనించే ఉంటారు. మేం గుంపులు గుంపులుగా ఒకే దగ్గర కనిపిస్తుంటాం. మాకు అలా ఉండటమే ఇష్టం.
* వినడానికి విడ్డూరంగా ఉన్నా కొంతమంది మమ్మల్ని పెంపుడు కీటకాలుగా పెంచుకుంటారు.
* మాలో జాతుల్ని బట్టి వాటి జీవితకాలం నెలల నుంచి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అమెరికన్‌ కాక్రోచ్‌ సంవత్సరం పాటు బతుకుతుంది.
* మాలో కొన్ని బొద్దింకలు ఎంతటి చల్లని ఉష్ణోగ్రతలు ఉన్నా బతికేస్తాయి. దాదాపు -188 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రతల్లోనూ బతికేస్తాయి.


 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని