ముళ్లకంచెలకో.. మ్యూజియం!!

హాయ్‌ నేస్తాలూ.. మీరింత వరకూ కనీ వినీ ఎరుగని ఒక వింత ప్రదర్శనశాల గురించి చెప్పనా? ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి ముళ్ల కంచెల మ్యూజియం.ముళ్ల కంచెలంటే.. ఏవో మొక్కలకు చెందిన కంచెలు కావు. ఇనుప కంచెల్ని రక్షణ గోడలా కడతారు కదా వాటి మ్యూజియం ఇది.

Published : 09 Aug 2020 02:01 IST

హాయ్‌ నేస్తాలూ.. మీరింత వరకూ కనీ వినీ ఎరుగని ఒక వింత ప్రదర్శనశాల గురించి చెప్పనా? ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి ముళ్ల కంచెల మ్యూజియం.ముళ్ల కంచెలంటే.. ఏవో మొక్కలకు చెందిన కంచెలు కావు. ఇనుప కంచెల్ని రక్షణ గోడలా కడతారు కదా వాటి మ్యూజియం ఇది. దీని గురించి చెప్పే చరిత్ర చాలా ఉంది. రండి ఈ మ్యూజియం ముచ్చట్లు చెప్పుకుందాం...

బార్బుడ్‌ వైర్‌ మ్యూజియం.. దక్షిణ ఆస్ట్రేలియాలోని స్పాల్డింగ్‌లో ఉంది. ఇందులో వ్యవసాయ ప్రయోజనాల కోసం, విద్యుత్‌ ఉపకరణాల పక్కనో వేసిన ఇనుపముళ్ల కంచెలు మాత్రమే కాదు! వివిధ దేశాల సరిహద్దుల్లో వేసే అతి విలువైన ముళ్లకంచెలనూ పేర్చారు. దీని సందర్శన ఉచితం. కానీ క్యాన్సర్‌ బాధితుల విరాళాలివ్వొచ్ఛు.

కంచెకో రకంగా

ఇక్కడ ముళ్లతీగల రకాలను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అతి విలువైన ముళ్ల కంచెమొక్కలూ ఉంటాయి. అలాగే.. భారీ శ్రేణి ఫెన్సింగ్‌ సాధనాలనీ చూడొచ్ఛు వీటిలో కుందేళ్లు, గొర్రెలు, పశువులు, గుర్రాలూ రాకుండా రైతులు వ్యవసాయభూముల చుట్టూ పెట్టే నెట్‌ వైర్లలాంటి వాటితో పాటూ, చొరబాటు దారులు దేశసరిహద్దుల్ని దాటి చొరబడకుండా వేసిన పొడవైన భారీ విద్యుత్‌ కంచెలూ ఉంటాయి.

బార్బుడ్‌ వైర్‌ పబ్‌

ముళ్లకంచె మ్యూజియం పక్కనే ఒక హోటల్‌ ఉంటుంది. దాన్లో వివిధ దేశాలు, ప్రాంతాల నుంచొచ్చే సందర్శకులకు సౌకర్యవంతమైన వసతి ఏర్పాట్లుంటాయి. విశ్రాంతి తర్వాత మ్యూజియాన్ని తీరిగ్గా వీక్షించేందుకు అన్నమాట.

వారసులకు కంచె

బార్బుడ్‌ వైర్‌ మ్యూజియం యజమాని ‘జాక్‌ చిషోల్మ్‌’. ఈయన 18దో శతాబ్దం నుంచే కంచెల్ని సేకరించడం మొదలుపెట్టాడు. తరతరాలుగా వాటి సేకరణ, సంరక్షణ బాధ్యత జాక్‌ వారసులకు వచ్చింది. ప్రస్తుతం ‘జియోఫ్‌ టిల్లర్‌ ’ గత 40 ఏళ్లుగా ఈ మ్యూజియం బాధ్యలను నిర్శహిస్తున్నాడు.

18 వందల నాటివే ఎక్కువ

ఇక్కడ ప్రదర్శనకు పెట్టిన వాటిలో 1860ల వరకూ సేకరించిన కంచెలే ఎక్కువ. ఆ తర్వాత అమెరికా ముళ్లకంచెల తయారీకి పేటెంట్‌ ఇచ్చింది. దాంతో వీటి సేకరణకి వీలు తగ్గింది. అమెరికాలో గొర్రెల కాపరుల్ని అదుపు చేసేందుకు కంచెలను కట్టేవారు.అవి ప్రత్యేకమైన ఇనప తీగలతో తయారయ్యేవి. వాటికి మంచి గిరాకీ ఉండేది. అప్పట్లో సేకరించిన ఆ ముళ్లకంచె ముక్కలు ఓ 2000 రకాల వరకూ ఈ ప్రదర్శనశాలలో చూడొచ్ఛు అన్నిట్లోకీ జాక్‌ చనిపోయే 18 నెలల ముందు సేకరించిన (మేడ్‌ ఇన్‌ జపాన్‌) లోహపు వైరు ప్రత్యేకమైనది. ఇది జపాన్‌ సేవకుడి ద్వారా లభించింది.

ఏమేం ఉంటాయంటే

1400 ఫెన్సింగ్‌ వైర్‌ నమూనాలు, దాదాపు 900 రకాల ముళ్లతీగలతో సహా ఉంటాయి. సాదా, సీదా లింక్డ్‌ వైర్లు, రిబ్బన్‌ వైర్‌, సిగ్నల్‌ ప్లేట్‌ వైర్‌, ప్లాంటర్‌ వైర్‌, రేజర్‌ వైర్‌, నెట్టింగ్‌ వైర్‌, మిలటరీ ఎంటాంగిల్మెంట్‌ వైర్‌ ఇలా చాలా రకాలుంటాయి. వీటికి లేబుళ్లు కట్టి, 22 డిస్ప్లే బోర్డుల్లో అమర్చి ఉంటాయి. ఇంకో 20 బోర్డులలో అమర్చిన 500లకు పైగా ఫెన్సింగ్‌ సాధనాలుంటాయి. సుమారు 400 వేర్వేరు వైర్‌ స్టైనర్లు, వైర్‌ జాయినర్లు, వైర్‌ ఫెన్సింగ్‌ క్లాంప్స్‌, వైర్‌ కట్టర్లు, మైన్‌ పుల్లర్లు మొదలైనవి ఉంటాయి. ఇంకా 150 ఇతర ఫెన్షింగ్‌ సంబంధిత వస్తువుల్ని చూడొచ్ఛు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని