అహంకారం.. తెచ్చిన ప్రమాదం..

బదరీవనంలో జంతువులన్నీ ఆనందంతో గంతులేస్తున్నాయి. వాటి అల్లరితో అక్కడంతా కోలాహలంగా మారింది. అడవిని పాలించే మృగరాజు కుటుంబంలోకి కొత్తగా బుల్లి సింహం రావడమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా మృగరాజు అన్ని జంతువులను పిలిచి విందు ఏర్పాటు చేసింది. బుల్లి సింహాన్ని యువరాజుగా ప్రకటించింది. అప్పటి నుంచి యువరాజు

Published : 02 Sep 2020 00:28 IST

బదరీవనంలో జంతువులన్నీ ఆనందంతో గంతులేస్తున్నాయి. వాటి అల్లరితో అక్కడంతా కోలాహలంగా మారింది. అడవిని పాలించే మృగరాజు కుటుంబంలోకి కొత్తగా బుల్లి సింహం రావడమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా మృగరాజు అన్ని జంతువులను పిలిచి విందు ఏర్పాటు చేసింది. బుల్లి సింహాన్ని యువరాజుగా ప్రకటించింది. అప్పటి నుంచి యువరాజు ప్రవర్తనలో మార్పు వచ్చింది. భవిష్యత్తులో తానే రాజుగా భావించి.. మిగతా జంతువులతో దూరం దూరంగా ఉండేది. ఏ జంతువైనా పొరపాటుగా దగ్గరకు వస్తే.. కాబోయే మహరాజును, నా సమీపంలో నడవకూడదు.. నా ముందు తలెత్తకూడదు.. వీటికి భిన్నంగా వ్యవహరిస్తే నా ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించేది. మిగతా జంతువులు కూడా ఈ వైఖరి నచ్చక అంటీముట్టనట్లు వ్యవహరించేవి. పెద్ద సింహానికి విషయం తెలిసి.. యువరాజును హెచ్చరించినా మారలేదు.

ఒకరోజు అడవిని మబ్బులు కమ్మేసి భారీ వర్షం పడుతుంది. ఇటువంటి సందర్భంలోనూ యువరాజు గుహ నుంచి వచ్చింది. అది గమనించిన మిగతా జంతువులు తిరగొద్దని చెప్పబోగా ‘నేను యువరాజును. భయపడే వారే ఇంట్లో దాక్కుంటారు. నేను ధైర్యశాలిని’ అంటూ ముందుకుసాగింది.

గంటలు గడిచినా యువరాజు తిరిగి రాకపోవడంతో జంతువులన్నీ కటిక చీకటిగా మారిన అడవిలో వెతకసాగాయి. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. అంతలో ఓ వైపు నుంచి మూలిగిన శబ్దం వినపడింది. అటు వెళ్లి చూడగా యువరాజు పెద్ద గుంతలో కూరుకుపోయి ఉంది. బయటకు వచ్చేందుకు చాలా సమయం నుంచి విశ్వప్రయత్నం చేసి అలసిపోయినట్లు కనిపించింది. కాలు కూడా కదపలేని స్థితిని చూసి జంతువులు జాలిపడ్డాయి. ఎలాగైనా బుల్లి సింహాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాయి. కానీ, దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా.. అక్కడ ఓ మర్రిచెట్టు కనిపించింది. ఒక ఊడను తీసుకొచ్చాయి. మరి యువరాజు దగ్గరకు వెళ్లి ఎవరు అందిస్తారు? ఇంతలో జిరాఫీ ముందుకు వచ్చి నేను చాలా ఎత్తుగా ఉంటా.. నా మెడ కూడా పొడవుగా ఉంటుంది కాబట్టి దూరం నుంచి ఊడను అందిస్తా అని చెప్పింది. మిగతా జంతువులన్నీ అంగీకరించి మర్రి ఊడను జిరాఫీకి ఇచ్చాయి. అది తీసుకెళ్లి అతి కష్టంగా యువరాజు నోటికి అందించడంతో ప్రమాదం నుంచి బయట పడింది. ‘అహంకారంతో మిమ్మల్ని దూరం పెట్టినా.. దగ్గరకు వచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఇకనుంచి మనమంతా స్నేహితులం.. కలిసి ఆడుకుందాం’ అని యువరాజు అనడంతో జంతువులన్నీ సంతోషించాయి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, ఖమ్మం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని