చిన్నారి పంతులమ్మ!

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతబడ్డాయి కదా.. గతనెల నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్‌ లేకపోవడంతో గుజరాత్‌లోని ఓ గ్రామంలో లౌడ్‌ స్పీకర్ల సహాయంతో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారని మనం చదువుకున్నాం. గుర్తుంది కదా? అయితే ఇప్పుడు ఓ పదమూడేళ్ల చిన్నారి ఊళ్లోని పిల్లలకు స్వయంగా పాఠాలు చెబుతోంది. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!

Published : 05 Oct 2020 01:11 IST

కేరళ రాష్ట్రంలోని అట్టిపాడు ప్రాంతానికి చెందిన అనామిక త్రివేండ్రంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్‌డౌన్‌తో బడికి వెళ్లడం లేదు. తనతోపాటు చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలు కూడా ఖాళీగా ఉండటాన్ని గమనించింది. వారి తల్లిదండ్రులంతా దినసరి కూలీలే. ఆ పిల్లలు చదువుపరంగా నష్టపోకుండా.. తాను బడిలో నేర్చుకున్న అంశాలను వారికి బోధించాలని అనుకుంది. తన ఇంటి ఆవరణలోని ఓ గుడిసెలో జులై 25న తరగతులు ప్రారంభించింది. అంతేకాదండోయ్‌.. దానికి ‘స్మార్ట్‌ క్లాస్‌’ అని పేరు కూడా పెట్టింది అనామిక. ఆలోచన బాగుంది కదూ..!

జర్మన్‌ కూడా నేర్పిస్తుంది
అనామిక బడికి ప్రతి రోజూ 15 మంది చిన్నారులు వస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు గణితం, మళయాళం, తమిళం, జర్మన్‌, ఇంగ్లిష్‌ నేర్పిస్తుందంట. అట్టిపాడు.. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. అక్కడి చిన్నారులు చాలామంది తమిళ మాధ్యమంలో చదువుకుంటారంట. ఉన్నత విద్య కోసం అనామిక వారికి మళయాళం కూడా చెబుతోంది. తన పాఠశాలలో తృతీయ భాషగా జర్మన్‌ను ఎంపిక చేసుకుంది. కొంత పట్టు ఉండటంతో పిల్లలకు జర్మన్‌ భాషలో ప్రాథమిక అంశాలను వివరిస్తోంది.
మాస్కులు ధరిస్తూ..
కరోనా సోకకుండా పిల్లలు బడికి రాగానే అనామిక వారి చేతిలో శానిటైజర్‌ వేస్తుంది. మాస్కులు ధరిస్తూ.. ఎడం పాటిస్తూ పాఠాలు వింటున్నారు. ‘మేం  రోజూ ఉదయాన్నే పనికి వెళ్తాం. సాయంత్రం వచ్చే వరకు ఖాళీగా ఉండే మా పిల్లలకు అనామిక పాఠాలు చెబుతుండటం సంతోషంగా ఉంది’ అని తల్లిదండ్రులంతా ఆనందపడుతున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని