రాజు మెచ్చిన గానం

సింహపురి రాజ్యానికి దేవదత్తుడు రాజు. ఆయనకు సంగీతమంటే ఇష్టం. కానీ తన ఆస్థానంలోని కళాకారుల వల్ల సంతృప్తి కలిగేది కాదు. దీంతో పొరుగు రాజ్యాల నుంచి కళాకారులను పిలిపించి వారితో సంగీత సభలు పెట్టేవాడు. అలరించిన వారికి భారీగా కానుకలిచ్చేవాడు. ఒక్కోసారి సుదూర ప్రాంతాలకు గుర్రంపై వెళ్లి కచేరీలకు హాజరయ్యేవాడు. రోజుల తరబడి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇలా రాజ్యాన్ని, ప్రజలను వదిలివెళ్లడం సబబు కాదని కొన్నాళ్లకు దేవదత్తుడికి అనిపించింది.

Updated : 09 Oct 2020 01:29 IST

సింహపురి రాజ్యానికి దేవదత్తుడు రాజు. ఆయనకు సంగీతమంటే ఇష్టం. కానీ తన ఆస్థానంలోని కళాకారుల వల్ల సంతృప్తి కలిగేది కాదు. దీంతో పొరుగు రాజ్యాల నుంచి కళాకారులను పిలిపించి వారితో సంగీత సభలు పెట్టేవాడు. అలరించిన వారికి భారీగా కానుకలిచ్చేవాడు. ఒక్కోసారి సుదూర ప్రాంతాలకు గుర్రంపై వెళ్లి కచేరీలకు హాజరయ్యేవాడు. రోజుల తరబడి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇలా రాజ్యాన్ని, ప్రజలను వదిలివెళ్లడం సబబు కాదని కొన్నాళ్లకు దేవదత్తుడికి అనిపించింది.
సొంత రాజ్యంలోనే మంచి కళాకారులను వెదికి పట్టుకుంటే ఈ ప్రయాణాల బాధ తప్పుతుందన్న ఆలోచన కలిగింది. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించాడు. నెల రోజుల్లోపు రాజుగారు పరవశించిపోయేలా చేసిన గాయకులు, సంగీత కళాకారులకు తగిన సత్కారంతో పాటు, ఆస్థాన కళాకారుడి స్థానం దక్కుతుందన్న వార్త రాజ్యమంతా పాకింది.
పోటీల కోసం మరుసటి రోజు నుంచే కోట వద్ద బారులు తీరారు. రోజూ వందల మంది తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కానీ మహారాజు సంతృప్తిపడేలా ఎవరూ పాడలేకపోతున్నారు. సంగీతంలో కాస్త నైపుణ్యం ఉన్న సుదాసుడిని మినహా అందరినీ తిరస్కరించాడు. దీంతో ఇక ఆ స్థానం నాదేనని సుదాసుడు ఆనందపడ్డాడు. తనే విజేతనని ఇంకెవరూ తనని మించిపోయే సాహసం చేయరని స్వగ్రామానికి ఆనందంగా బయలుదేరాడు.
మార్గమధ్యంలో ఒక సుమధుర పిల్లనగ్రోవి స్వరం వినిపించి ఆగిపోయాడు. వివేకుడు అనే గొర్రెల కాపరి పాటలు పాడుతూ ఎదురుగా రావడం గమనించాడు. ఇతడు పోటీలకు వెళ్తే తన ఆస్థాన కళాకారుడి స్థానం ఎగరేసుకుపోవడం ఖాయమని అసూయ కలిగింది. తన దగ్గరికి వెళ్లి మురళీగానం చెవుల్లో అమృతం పోసినట్లు ఉందని పొగడ్తల్లో ముంచెత్తాడు. మాటల మధ్యలో తను పోటీల కోసం వెళ్తున్నానని, కోటకు దారి తెలియట్లేదని వివేకుడు, సుదాసుడితో అన్నాడు.
‘మిత్రమా.. నీ గానం అద్భుతంగా ఉంది. పోటీలకు వెళ్తే సత్కారాలు, కానుకలు, పదవి అన్నీ వరిస్తాయి. కానీ నువ్వు దారితప్పి ఈ మార్గానికి వచ్చావు. మరో దారిన వెళ్తే కోటకు చేరుకుంటావు’ అని సుదాసుడు గొర్రెల కాపరికి కోటకు వెళ్లే దారి కాకుండా మరో మార్గాన్ని చూపించాడు.
వివేకుడు ఎంత దూరం నడిచినా కోట రాకపోవడంతో నది ఒడ్డున కూర్చుని పిల్లన గ్రోవితో స్వరాలు పలికిస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు. సరిగ్గా అదే సమయానికి మహారాజు ఆ మార్గం గుండా వెళ్తూ మురళీగానం విని ఆగిపోయాడు. వివేకుడు కాసేపు మురళీ గానం ఆపి వెంటనే గొంతెత్తి పాడే సరికి దేవదత్తుడు పరుగున వెళ్లి ప్రశంసల్లో ముంచెత్తాడు.
అక్కడి నుంచి నేరుగా వివేకుడిని కోటకు తీసుకెళ్లి మరుసటి రోజు సభలో ఆస్థాన కళాకారుడి పదవినిచ్చి సత్కరించాడు. దురాశతో వివేకుణ్ని కోటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు సుదాసుడు పశ్చాత్తాపపడ్డాడు. తనకు పదవి దక్కనందుకు ముందు బాధపడినా, వివేకుడే ఆ స్థానానికి అర్హుడని వెళ్లి అభినందించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని