సింహం కళ్లు తెరిచింది

అడవిలో కొండ అంచున ఉన్న మృగరాజుకు అల్లంత దూరంలో ఎవరో మనిషి తాటిచెట్టు ఎక్కి ఏదో చేస్తున్నట్లు కనిపించాడు. చూద్దామని కొండ దిగి అటు వైపు పరుగు తీసింది. చెట్టు మొదలు వద్ద రెండు కుండలు కనిపించాయి.

Updated : 12 Oct 2020 04:57 IST

డవిలో కొండ అంచున ఉన్న మృగరాజుకు అల్లంత దూరంలో ఎవరో మనిషి తాటిచెట్టు ఎక్కి ఏదో చేస్తున్నట్లు కనిపించాడు. చూద్దామని కొండ దిగి అటు వైపు పరుగు తీసింది. చెట్టు మొదలు వద్ద రెండు కుండలు కనిపించాయి. వాటిలో తెల్లటి నురగతో ఏదో ద్రవం ఉంది! రుచి చూసింది. ఇంకా తాగాలన్న ఆరాటం. రెండో కుండనూ ఖాళీ చేసేసింది. గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది దానికి.
చెట్టు మీద నుంచి దిగుతున్న మనిషి.. కింద అలికిడికి తలొంచి చూశాడు. సింహం తూగుతూ పొదల్లోకి వెళ్లిపోవడం కనిపించింది. అప్పటికే పైన మూడు కుండలు కట్టాడు.  కానీ ఇకపై రాకూడదని వెళ్లిపోయాడు.
సింహం మత్తులో పిచ్చి పిచ్చిగా అరుస్తూ.. గెంతుతూ తన గుహకు చేరింది. దాని చేష్టలకు జంతువులు నవ్వుకున్నాయి. కోతులు, నక్కలు, కుందేళ్లు గుహలో చేరి ఎంత అల్లరి చేసినా దానికి మెలకువ రాలేదు. మూడో రోజున మెల్లిగా లేచింది. ఒళ్లంతా ఒకటే నొప్పులు. మెల్లగా ఆ తాటిచెట్టు దగ్గరికే నడిచింది. చెట్టుకు మూడు కుండలు కనిపించాయి. వెంటనే కోతిని పిలిచి.. ‘నువ్వు ఆ చెట్టెక్కి ఒక కుండను జాగ్రత్తగా దించు’ అంది.
‘దించుతా.. అయితే ఒక షరతు! నువ్వు నీ వీపు మీద ఎక్కించుకుని నన్ను అడవంతా తిప్పాలి. మర్కటరాజుకు జై అని జేజేలు పలకాలి..’ అని చెప్పింది కోతి. సింహం సరే అన్నట్లు తల ఊపింది. ‘ముందు మర్కట రాజు పని.. తర్వాతే నీ పని’ అంటూ ఎగిరి సింహం వీపు మీద కూర్చుంది కోతి. తర్వాత కోతి కుండలు దింపితే.. సింహం కల్లు తాగి మత్తుగా పొదల్లో పడుకుంది.
ఇప్పుడు ఏ జంతువూ దానికి భయపడటం లేదు. మొహం మీదే తిడుతున్నాయి. దాని దుస్థితి చూసి ఏనుగుకు జాలేసింది. ‘మిత్రమా.. ఎలాంటి దానివి ఎలా అయిపోయావు? నువ్వు తాగిన ద్రవం కల్లు. దానికి బానిసలైతే ఎవరైనా అంతే! ఇకనైనా ఆ వ్యసనం మానుకో..’ అని చెప్పింది ఏనుగు.
సరే.. కానీ మరి మనుషులు ఎందుకు తాగుతారు దాన్ని అంది సింహం. ఎవరు తాగినా నష్టమే.. అందుకే ‘కల్లు మానండోయ్‌.. కళ్లు తెరవండోయ్‌’ అని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు.. అని వివరించి ఏనుగు తనదారిన తాను వెళ్లిపోయింది. కాసేపు ఆలోచించిన సింహం.. ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది. అంతే అడవిలో మిగతా జంతువులన్నీ గప్‌చుప్‌!

-చంద్రప్రతాప్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని