అప్పుడెప్పుడో మాయమై.. మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమై!

పిల్లలూ.. గుడ్లగూబ అనగానేే ముదురు రంగులో ఉండే ఓ జీవి గుర్తొస్తుంది కదూ! పదునైన ముక్కుతో, గుండ్రటి ముఖంతో కనిపించే దాన్ని చూడగానే కొంచెం భయపడతాం. అయితే, తెలుపు రంగులో ఉండే గుడ్లగూబలను మీరెప్పుడైనా చూశారా? ఆ అరుదైన పక్షి ఇటీవల అమెరికాలో కనిపించింది.

Published : 02 Feb 2021 00:44 IST

పిల్లలూ.. గుడ్లగూబ అనగానేే ముదురు రంగులో ఉండే ఓ జీవి గుర్తొస్తుంది కదూ! పదునైన ముక్కుతో, గుండ్రటి ముఖంతో కనిపించే దాన్ని చూడగానే కొంచెం భయపడతాం. అయితే, తెలుపు రంగులో ఉండే గుడ్లగూబలను మీరెప్పుడైనా చూశారా? ఆ అరుదైన పక్షి ఇటీవల అమెరికాలో కనిపించింది. ఇంతకీ ఆ గుడ్లగూబ విశేషాలేంటో తెలుసుకుందాం..!!
న్యూయార్క్‌ నగరంలోని సెంట్రల్‌ జూపార్క్‌లో అరుదైన మంచు గుడ్లగూబ(Snowy Owl) కనిపించింది. దాదాపు 130 సంవత్సరాల క్రితం అమెరికాలో కనిపించిన ఈ జాతి గుడ్లగూబ.. మళ్లీ ఇన్నాళ్లకు వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దాన్ని చూసేందుకు అక్కడి వారంతా పార్క్‌కు క్యూ కడుతున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుండటంతో వైరల్‌గా మారుతున్నాయి.
ఆర్కిటిక్‌ నుంచి..
ఈ మంచు గుడ్లగూబలు 1890 ప్రాంతంలో సెంట్రల్‌ పార్క్‌లో ఎక్కువగా ఉండేవట. క్రమక్రమంగా అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే, ఈ జీవులు మంచు అధికంగా కురిసే ఆర్కిటిక్‌ ప్రాంతంలో నివసిస్తాయని, శీతాకాలంలో మాత్రం దక్షిణ దిశగా పయనిస్తాయని పలువురు పక్షి ప్రేమికులు, నిపుణులు చెబుతున్నారు.

మన గుడ్లగూబలకు భిన్నంగా..  
సాధారణంగా మన ప్రాంతంలో కనిపించే గుడ్లగూబలు పగలు నిద్రపోయి, రాత్రి ఆహారాన్వేషణకు వెళ్తుంటాయి. కానీ, ఈ మంచు గుడ్లగూబలు మాత్రం పగటి వేళల్లోనే తిరుగుతాయట. వీటి చూపు కూడా చాలా తీక్షణంగా ఉంటుంది. చిన్న చిన్న పక్షులు, చేపలు ఇతర జీవులను తింటూ బతికేస్తుంది. మంచు కిందనో, చెట్ల ఆకుల మధ్యలోనో ఏదైనా జీవి దాక్కుంటే.. అది చేసే శబ్దం ఆధారంగా పసిగట్టేస్తుంది. వయసు పెరిగేకొద్ది మగ పక్షులు మరింత తెల్లగా.. ఆడవి మాత్రం గోధుమ రంగులోకి మారతాయంట.
ఆహార లభ్యత ఆధారంగా..
మంచు గుడ్లగూబలు అందుబాటులో ఉండే ఆహారం ఆధారంగా 3 నుంచి 11 గుడ్లు పెడతాయట. అంటే ఆహార లభ్యత ఎక్కువగా ఉంటే ఎక్కువ.. తక్కువ ఉంటే తక్కువ గుడ్లు అన్నమాట. నెల రోజులకు గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి.

పక్షి ప్రత్యేకతలివీ..

జీవితకాలం : 10 సంవత్సరాలు
పొడవు : 20 నుంచి 28 అంగుళాలు
రెక్కల పరిమాణం : 4.2 నుంచి 4.8 అడుగులు
బరువు : 1.5 నుంచి 3 కేజీల వరకు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని