భీమయ్యకు గుణపాఠం

సీతాపురంలో ఉండే రామయ్యకు పది గొర్రెలు, ఎకరం పొలం ఉండేది. ఆ మూగజీవాలను పెంచుకుంటూ వ్యవసాయం చేసుకునేవాడు. రామయ్య పొలానికి ఆనుకొనే భీమయ్య మామిడి తోట, వ్యవసాయ క్షేత్రం ఉంది.

Published : 13 Feb 2021 01:11 IST

సీతాపురంలో ఉండే రామయ్యకు పది గొర్రెలు, ఎకరం పొలం ఉండేది. ఆ మూగజీవాలను పెంచుకుంటూ వ్యవసాయం చేసుకునేవాడు. రామయ్య పొలానికి ఆనుకొనే భీమయ్య మామిడి తోట, వ్యవసాయ క్షేత్రం ఉంది.

ఒకరోజు రామయ్య గొర్రెలు భీమయ్య మామిడి తోటలో పడ్డాయి. భీమయ్య వాటిని అక్కడే కట్టేసి.. రామయ్యకు కబురుపెట్టాడు. ‘నీ గొర్రెలు నా మామిడి తోటలోకి చొరబడి కిందపడిన ఆకులను తినేశాయి. అందుకు నువ్వు నష్టపరిహారంగా గొర్రెకు వంద చొప్పున వెయ్యి రూపాయలు కడితేనే వాటిని వదులుతాను’ అన్నాడు భీమయ్య. ‘గొర్రెలు కిందపడిన ఆకులనే తిన్నాయని చెబుతున్నావు.. అందులో నీకు నష్టం జరగలేదు కదా?’ ప్రశ్నించాడు రామయ్య. అయినా సరే.. పరిహారం కట్టాల్సిందేనని పట్టుబట్టాడు భీమయ్య.
భీమయ్య పరమ పిసినారి. లాభం లేకుండా ఏ పనీ చేసేవాడు కాదని ఊళ్లో అందరికీ తెలుసు. చేసేది లేక గ్రామాధికారి శంకరయ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు రామయ్య. ఇద్దరూ కలిసి మామిడి తోటకు వెళ్లారు. భీమయ్యతో మాట్లాడారు. ‘అవును రామయ్యా! నీ గొర్రెలను జాగ్రత్తగా కాపలా కాయాలి. ఇప్పుడు నేను చేసేదేమీ లేదు. భీమయ్యకు నష్టపరిహారం చెల్లించి నీ గొర్రెలను తీసుకెళ్లు’ అని గ్రామాధికారి తీర్పు చెప్పాడు. రామయ్య సరేనని.. భీమయ్యకు వెయ్యి రూపాయలు చెల్లించి గొర్రెలను తీసుకెళ్లాడు.  
ఒకసారి తన పొలంలో రామయ్య వేరుశనగ పంట వేశాడు. భీమయ్య కూడా రామయ్య చేను పక్కనే ఉన్న పొలంలో వేరుశనగే వేశాడు. పంట బాగా పండటంతో ఇద్దరూ కోత ప్రారంభించారు. మొక్కల నుంచి కాయలను పీకి చేలోనే కుప్పగా పోశారు. రామయ్యకు దిగుబడి ఎక్కువగా రావడంతో కుప్ప చేయడం కాస్త ఆలస్యమైంది. దాంతో ఇంటికి వెళ్లకుండా ఆ రాత్రి అక్కడే కాపలాగా పడుకున్నాడు. భీమయ్య కూడా తన పనివాడితో పాటు వేరుశనగ కాయలను ఎలుకలు తినకుండా పెంపుడు పిల్లిని కాపలాగా ఉంచాడు.
భీమయ్య పిల్లికి రామయ్య పొలంలో ఎలుకలు కనిపించడంతో.. రెండింటిని చంపి తింది. వెంటనే రామయ్య ఆ పిల్లిని పట్టుకొని భీమయ్య పొలంలోని కాపలా వ్యక్తిని పిలిచాడు. ‘మీ అయ్యగారిని పిలుచుకురా.. ఆయన వస్తేగాని పిల్లిని వదలను’ అని చెప్పాడు.  
పనివాడి నుంచి కబురు అందుకున్న భీమయ్య వచ్చి ‘ఏం జరిగింది?’ అని అడిగాడు. ‘నీ పిల్లి నా పెంపుడు ఎలుకలను చంపి తినేసింది. అందుకు నష్టపరిహారంగా రెండు వేల రూపాయలు కడితేనే దాన్ని వదులుతాను’ చెప్పాడు రామయ్య. ‘పిల్లి ఎలుకలను తింటే నీకే మంచిది కదా! దానికి నేనెందుకు పరిహారం కట్టాలి?’ అడిగాడు భీమయ్య. రామయ్య కబురుతో గ్రామాధికారి కూడా అక్కడకు వచ్చి విషయం తెలుసుకున్నాడు. ‘అవును. పిల్లి ఎలుకలను తింటే నీకే కదా లాభం!’ అన్నాడు.
‘అది కాదు అయ్యగారు.. నావి పెంపుడు ఎలుకలు. వేరే చేలోని ఎలుకలను రానివ్వకుండా కాపలాగా ఉంటాయని పెంచాను. అలాంటి వాటిని చంపి తినేసింది ఈ పిల్లి.. దాని మీసాలకు ఉన్న రక్తమే అందుకు సాక్ష్యం’ అన్నాడు రామయ్య. ‘అవును భీమయ్యా. నీ పిల్లిని పనివాడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. రెండు వేలు ఇచ్చి దాన్ని తీసుకెళ్లు’ చెప్పాడు గ్రామాధికారి. మరో మార్గం లేక పరిహారం చెల్లించి తన పిల్లిని తీసుకెళ్లాడు భీమయ్య. బుద్ధి బలంతో భీమయ్యకు భలే గుణపాఠం చెప్పావు అని రామయ్యను గ్రామాధికారి అభినందించాడు.

- యు.విజయశేఖరరెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు