ఎలుగుబంటి సలహా!

పూర్వం పోలారపేట అనే ఊరు ఉండేది. దానికి ఆనుకొనే ఓ చిట్టడవి.. అందులో రకరకాల జంతువులు నివసిస్తుండేవి. ఆ అడవిలో వృద్ధ కోతి ఒకటి గురుకులం నిర్వహిస్తుండేది. జంతువుల పిల్లలన్నీ అందులో చక్కగా చదువుకునేవి....

Published : 19 Feb 2021 00:52 IST

పూర్వం పోలారపేట అనే ఊరు ఉండేది. దానికి ఆనుకొనే ఓ చిట్టడవి.. అందులో రకరకాల జంతువులు నివసిస్తుండేవి. ఆ అడవిలో వృద్ధ కోతి ఒకటి గురుకులం నిర్వహిస్తుండేది. జంతువుల పిల్లలన్నీ అందులో చక్కగా చదువుకునేవి.
గురువు కోతి ఉన్నప్పుడు మాత్రమే జంతువుల పిల్లలు బుద్ధిగా ఉండేవి. అది పనిమీద ఎటైనా వెళ్తే గోల గోల చేసేవి. గురుకులంలోని వస్తువులను చిందరవందరగా పడేసేవి. వాటి అల్లరి కోతి దృష్టికి రావడంతో.. ఎలాగైనా వాటిని కట్టడి చేయాలని అనుకుంది. క్రమశిక్షణలో ఉంచేందుకు ఓ విద్యార్థి నాయకుడిని ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే గురుకులంలో విద్యనభ్యసిస్తున్న అన్నింటినీ కోతి సమావేశపరిచింది. నాయకుడి అవసరాన్ని, బాధ్యతలను వివరించింది. ఎన్నికకు స్వేచ్ఛనిస్తూ.. ఆసక్తి ఉన్నవారు పోటీలో నిలబడాలని సూచించింది. అవన్నీ తమలో తాము చాలాసేపు గుసగుసలాడుకున్నాయి. చివరకు ఎలుగు పిల్ల, దుప్పి పిల్ల, తోడేలు పిల్ల, నక్క పిల్ల పోటీలో నిల్చున్నాయి.
ఎన్నికల సమయం రానే వచ్చింది. కానీ, వారిలో ఎవరిని ఎన్నుకోవాలో తెలియక అవన్నీ తికమకపడ్డాయి. చివరికి మృదు స్వభావం కలిగి, ఆపదలో అండగా ఉండే దుప్పి పిల్లను తమ నాయకుడిగా ఎన్నుకున్నాయి. తమను పట్టించుకోని వాటి పట్ల తోడేలు పిల్ల, నక్క పిల్ల చిర్రుబుర్రులాడాయి. అక్కడితో ఆగకుండా ఎలాగైనా వాటిపై ప్రతీకారం తీర్చుకోవాలని అవి రెండూ కలిసి ఓటమికి బాధపడుతున్న ఎలుగు పిల్లను రెచ్చగొట్టడం మొదలుపెట్టాయి.
‘నువ్వు దుప్పి పిల్ల కన్నా ఎందులో తక్కువ? మాకంటే ఎక్కువగా.. అవసరానికి అందరికీ సాయపడతావు. నిన్ను ఓడించడమంటే సేవాగుణాన్ని అవమానపరచడమే.. ఇంత అవమానం జరిగింది కాబట్టి మన పెద్దల సహాయంతో వీరందరి పని పట్టాల్సిందే’ అని పుండు మీద కారం చల్లసాగాయి. ఆ మాటలకు ఎలుగు పిల్లకు కూడా పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆరోగ్యం బాగోలేదని గురువుకు చెప్పి గురుకులం నుంచి ఇంటికి వెళ్లిపోయింది. తమ పథకం ఫలిస్తున్నందుకు నక్క పిల్ల, తోడేలు పిల్ల సంతోషపడ్డాయి.
మర్నాడు తల్లిని వెంటబెట్టుకొని ఎలుగు పిల్ల గురుకులానికి వచ్చింది. జరగబోయే కల్లోలాన్ని ఊహించుకుంటూ నక్క, తోడేలు పిల్లలు ఉత్సాహంగా ఎదురుచూడసాగాయి. అక్కడ విషయన్నంతా తెలుసుకున్న తల్లి ఎలుగుబంటి తిరిగి వెళ్లబోతుండగా.. చెట్టు చాటున నక్కి తొంగి తొంగి చూస్తున్న నక్క, తోడేలు పిల్లలను చూసింది. దగ్గరకు రమ్మని కోపంగా పిలవడంతో వాటికి గుండె జారినంత పనైంది. చేసేదేమీ లేక.. అవి రెండూ ఎలుగుబంటి దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డాయి.
తల్లి ఎలుగు మాట్లాడుతూ ‘మీరంతా చాలా చిన్నవారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అందరూ కలిసి ఎంపిక చేసుకున్న నాయకుడిని మీరంతా అంగీకరించాల్సిందే. మీకు అవకాశం రాలేదని.. బాధపడొద్దు. ఎదుటివారికి ఇబ్బంది కలిగించే ఆలోచనలు అసలే చేయవద్దు. హోదాతో సంబంధం లేకుండా మన పని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్లాలి. అదే ప్రకృతి ధర్మం. ఏదో ఒకరోజు మన లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది’ అంది. తమ తప్పు తెలుసుకున్న నక్క, తోడేలు పిల్లలు మౌనంగా తల దించుకొని గురుకులం లోపలికి వెళ్లిపోయాయి. ఎలుగుబంటి ఇచ్చిన సలహాను కోతితో పాటు అక్కడి జంతువులన్నీ విని చప్పట్లు కొట్టాయి.

- బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని