రాజులేని రాజ్యం

రత్నగిరి రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల్లో ఎంతో గొప్ప పేరు. అందుకు కారణం ఆ రాజ్యంలో పేదరికం అనేదే ఉండేది కాదు. కానీ రాజైన కరుణసేనుడికి వారసులు లేరు. దాంతో ప్రజలనే కన్నబిడ్డల్లా చూసుకుంటూ,

Updated : 22 Feb 2021 01:20 IST

త్నగిరి రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల్లో ఎంతో గొప్ప పేరు. అందుకు కారణం ఆ రాజ్యంలో పేదరికం అనేదే ఉండేది కాదు. కానీ రాజైన కరుణసేనుడికి వారసులు లేరు. దాంతో ప్రజలనే కన్నబిడ్డల్లా చూసుకుంటూ, ప్రజల ధనాన్ని ప్రజాసంక్షేమం కోసమే వినియోగించేవాడు. దురదృష్టవశాత్తు రాజుకు ఓ ప్రాణాంతక వ్యాధి సోకింది. ఒక రోజు సభ తీరి ఉండగా ఆయన మంత్రికేసి చూస్తూ.. ‘మంత్రివర్యా! నా తదనంతరం ప్రజాక్షేమాన్ని కోరుకునే యోగ్యుణ్ని ఈ సింహాసనంపై కూర్చోబెట్టండి’ అంటూ కన్నుమూశాడు.
రాజాజ్ఞను శిరసావహిస్తూ మంత్రి ఎందరో రాజులు, యువరాజులు, వీరాధి వీరులకు ఆహ్వానం పంపారు. వారంతా తరలివచ్చారు. అయితే వారిలో ఎవరు రాజసభలోకి ప్రవేశించినా ‘వద్దు.. వద్దు! ఇతడికి నన్ను అధిష్ఠించే అర్హత లేదు’ అంటూ సింహాసనం వద్ద నుంచి బిగ్గరగా మాటలు వినిపించేవి. దాంతో వచ్చినవారు వచ్చినట్లే వెళ్లిపోసాగారు. ఒకరోజు అహంకారి అయిన వజ్రపురి రాజు వచ్చి సింహాసనంపై కూర్చున్నాడు. మరుక్షణం సింహాసనం రివ్వున గాల్లోకి లేచి గిరగిరా తిరుగుతూ తలకిందులైంది. సింహాసనంపై ఉన్న వజ్రపురి రాజు దబ్బున కిందపడి తీవ్రమైన గాయాలకు గురయ్యాడు. అప్పటి నుంచి సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
దాంతో ఆ రాజ్యం.. రాజులేని రాజ్యంగా మారిపోయింది. పాపం వృద్ధ మంత్రి రాజ్యభారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. రాజులేని రాజ్యం కావడంతో పెద్ద పెద్ద వ్యాపారులు, ధనవంతులు విజృంభించి.. పేదప్రజలను దోచుకుంటూ, తమ ఆస్తులు పెంచుకోసాగారు. వారి దెబ్బకు ప్రజలంతా పేదరికం బారినపడ్డారు. ఆ రాజ్యంలో రామసేనుడు అనే పేద యువకుడు ఉన్నాడు. అతడిది వెన్నలాంటి మనసు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూస్తూ అతడు ‘నేను ఎవరికైనా నోటితో నాలుగు మంచి మాటలు చెప్పగలను కానీ చేత్తో నాలుగు ముద్దలు పెట్టలేనుగా’ అనుకుని బాధపడ్డాడు.
కొంతకాలానికి ఆ రాజ్యంలో ఓ ముసుగు వ్యక్తి అక్రమ సంపాదనాపరుల నుంచి సొత్తు దోచుకుని పేదలకు పంచిపెట్టసాగాడు. అప్పటి నుంచి ప్రజల బతుకులు కాస్త గాడిన పడ్డాయి. ఒక రోజు ముసుగు వ్యక్తి ప్రజలకు బంగారు నాణేలు పంచుతుండగా, కఠినపాలుడు అనే ధనవంతుడు తన అనుచరులతో అతడిని చుట్టుముట్టాడు. అక్కడున్న ప్రజలు వారిని ప్రతిఘటించారు. అయినా బంధించి రాజసభకు తీసుకువచ్చి మంత్రి ముందు ప్రవేశపెట్టాడు.
ముసుగు వ్యక్తి రాజసభలోకి అడుగుపెడుతుంటే, సింహాసనం వద్ద నుంచి మాటలు వినబడసాగాయి. ‘ప్రజల్లోంచి వచ్చినోడు.. ప్రజల వెతలు తెలిసినోడు. అహ.. వచ్చాడు వచ్చాడు.. ఇన్నాళ్లకు శ్రీరాముడు’
మంత్రి ఆ మనిషిని ముసుగు తీసి సింహాసనంపై కూర్చోమన్నాడు. మంత్రి చెప్పినట్లుగానే ముసుగు తీసి సింహాసనంపై కూర్చున్నాడు.. అతడిని రామసేనుడిగా గుర్తించిన ప్రజలు ఆనందంతో ‘రామసేన మహారాజుకీ జై’ అంటూ నినాదాలు చేశారు. కఠినపాలుడు ఆగ్రహంతో ‘అతడో దొంగ’ అంటూ అరిచాడు. అప్పుడు సింహాసనం నుంచి ‘రామసేనుడు దొంగ ఎలా అవుతాడు? మీ వంటి ప్రజాద్రోహులు అమాయక ప్రజలను దోచుకుంటే, అతడు మిమ్మల్ని దోచుకుని, ఆ సొత్తును ప్రజలకు పంచిపెట్టాడు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడే రామసేనుడే ఈ రాజ్యానికి అసలు సిసలైన రాజు’ అంటూ మాటలు వినిపించాయి.
అది విన్న సభికులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. అప్పటికప్పుడు మంత్రి అదే సభలో రామసేనుడికి పట్టాభిషేకం చేశారు. అప్పటి నుంచి రాజ్యంలో పేదరికం మాయమైపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించసాగారు. రాజులేని రాజ్యం కాస్తా.. రామరాజ్యంగా మారిపోయింది.

- పుట్టగుంట సురేష్‌కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని