దొందూ దొందే.. రెండూ రెండే!

ఒక చెరువు ఒడ్డున మర్రిచెట్టు ఉంది. దాని పక్కన చీమలు పెట్టిన రెండు పుట్టలున్నాయి. వాటిలో వేరు వేరుగా రెండు పాములు నివసించేవి. ఆ చెరువులోనే ఓ కప్ప ఉండేది. అది రెండుపాములు బయటకు వెళ్లడం చూసి నీటి నుంచి నేల మీదకు వచ్చింది. ఆ చెట్టు

Updated : 25 Feb 2021 00:32 IST

ఒక చెరువు ఒడ్డున మర్రిచెట్టు ఉంది. దాని పక్కన చీమలు పెట్టిన రెండు పుట్టలున్నాయి. వాటిలో వేరు వేరుగా రెండు పాములు నివసించేవి. ఆ చెరువులోనే ఓ కప్ప ఉండేది. అది రెండుపాములు బయటకు వెళ్లడం చూసి నీటి నుంచి నేల మీదకు వచ్చింది. ఆ చెట్టు కలుగులో దాగి ఉన్న ఎలుకను బయటకు రమ్మని పిలిచింది. కానీ ఆ పాముల భయానికి ఎలుక రాలేదు.
అప్పుడు కప్ప ఎలుకతో.. ‘మనం ఎంచక్కా స్నేహం చేద్దాం. ఇద్దరం కలిసి ఆడుకుందాం.. పాడుకుందాం.. ఇప్పుడు నిన్నుగానీ, నన్ను గానీ తినడానికి ఇక్కడ పాములు లేవు. నువ్వు బయటకు రా’ అని అంది.
కాసేపటికి ఎలుక బయటకు వచ్చింది. ‘చూడు కప్పా! నేను వేరు. నువ్వు వేరు. మన ఆకారాలు, అలవాట్లూ వేరు. నేను కలుగులో ఉంటే.. నువ్వు నీళ్లలో లేదా భూమిపై ఉంటావు. మన ఇద్దరికీ పొత్తు ఎలా కుదురుతుంది? పైగా మనిద్దరికీ ఈ పాములు శత్రువులు. ఇప్పటికే మనం వాటికి చాలా దగ్గరగా నివసిస్తున్నాం. ఓ రకంగా మనం అనుక్షణం ఆపదలోనే బతుకుతున్నాం. అందువల్ల మనం ఎవరి జాగ్రత్తల్లో వాళ్లం ఉందాం’ అని అంది.
ఆ మాటలు విన్న కప్ప ‘అదేం లేదు. స్నేహానికి ఇవేవి అడ్డురావు. ఈ కొద్ది జీవితం మనం ఇద్దరం ఆనందమయంగా గడపాలి. ఆపదలో మనం ఇద్దరం సహాయం చేసుకోవాలి. మనం కలిసి ఉంటే దేన్నైనా సాధించగలం. నాకు తోచని ఉపాయం కూడా నీకు తోచవచ్చు’ అని అంది.
అప్పుడు ఎలుక సంతోషించింది ‘సరే! ఆ పాములు వచ్చే సమయమైంది. రేపటి నుంచి మనం ఇద్దరం అవి బయటకు వెళ్లిన తర్వాత ఆడుకుందాం లే’ అని అంది. ఆ మాటలకు కప్ప ఎంతో సంతోషించింది.
అయితే పుట్టలో ఉన్న రెండు పాములకు తమకు దగ్గర్లోనే కప్ప, ఎలుక ఉన్నట్లు తెలియదు. అందుకే అవి ఆహారం వెతుక్కోవడానికి రోజూ బయటకు వెళ్లేవి. అది వర్షాకాలం. వారం రోజుల నుంచి ఆగకుండా విపరీతంగా వర్షం కురవసాగింది. పాములు బయటకు వెళ్లలేక పుట్టలోనే ఉండిపోయాయి. వాటికి చాలా ఆకలిగా ఉంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో కొంచెం వర్షం తెరపినిచ్చింది.
పాములు వెళ్లిపోయి ఉంటాయి అనుకున్న కప్ప, ఎలుక బయటకు వచ్చాయి. అప్పుడు ఒక పాముకు కప్ప, ఎలుక బయట ఆడుకోవడం కనిపించింది. దానికి ఎలుకను తినాలని ఎన్నాళ్ల నుంచో కోరికగా ఉంది. కానీ ఎలుక కన్నా.. కప్ప దగ్గరగా ఉంది. అది తనకు అందేంత దూరంలో కప్ప ఉన్నా.. ఎలుకను పట్టుకోవాలని చూసింది.
ఇది గమనించిన ఎలుక.. కప్పను హెచ్చరిస్తూ తన కన్నంలోకి పారిపోయింది. పాము వెనక్కు తిరిగి చూసే సరికి కప్ప కూడా తప్పించుకుంది. పాము ‘అయ్యో! అందని ఎలుక కోసం.. తేలిగ్గా దొరికే కప్పను వదిలిపెట్టానే’ అని అనుకుంది. ఇక చేసేది లేక పాము తన పుట్టలోకి వెళ్లిపోయింది.
ఇంతలో మరో పుట్టలో నుంచి ఇంకొక పాము వచ్చి ఈ రెండింటినీ చూసింది. అది కప్పను తినాలని అనుకుంది. కానీ దానికి ఎలుక ఎదురైంది. అది కప్ప కోసం చూసింది. అది ఈ సారి కనబడలేదు. చివరకు ఎలుకను తిందామని అనుకుంది. కానీ ఎలుక కూడా పారిపోయింది. ‘అయ్యో! కప్ప కోసం ఎలుకను వదిలేశాను. నేను ఎంత మూర్ఖురాలిని’ అని అనుకుంది. చేసేదేమీ లేక అది కూడా పుట్టలోకి దూరింది.
రెండు పాములూ.. తమను చూసి కూడా ఏ హాని చేయకపోయేసరికి కప్ప, ఎలుక తెగ ఆనందపడ్డాయి. ఇంతలో రెండు పాములు ఒక్కసారిగా బయటకు వచ్చి ఒక్క ఉదుటున వాటిని పట్టుకున్నాయి. కప్పను తినాలకున్న పాముకు ఎలుక, ఎలుకను తినాలనుకున్న పాముకు కప్ప దొరికాయి. ‘మనం ఈ ఆహారాన్ని ఒకరికొకరం మార్చుకుందాం’ అనుకున్నాయి. ‘నేను నీకు కప్పను ఇస్తే నువ్వు నాకు ఎలుకను ఇవ్వు’ అని ఒప్పందం చేసుకున్నాయి. ఎలుక, కప్ప చనిపోయాయి.. అవి ఎక్కడికీ పోవనుకున్న పాములు వాటిని వదిలిపెట్టాయి.
అప్పుడే గాలికి విరిగిన మర్రిచెట్టు కొమ్మలు రెండూ పై నుంచి పాము-కప్ప, పాము-ఎలుకల మధ్యన విరిగిపడ్డాయి. పాములు కంగారుపడ్డాయి. ఇదే అదునుగా ఎలుక, కప్పలు తప్పించుకున్నాయి. ఆ ప్రాంతాన్ని వదిలి దూరంగా పారిపోయాయి. ‘అందని వాటికి అర్రులు చాచి దొరికిన వాటిని వదిలి పెట్టుకున్నాం’ అని రెండు పాములూ బాధపడ్డాయి.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని