కాకి సందేహం.. చిలుక సందేశం!

అడవిలోని జీవులన్నీ తెల్లవారుతుండగానే ఆహార అన్వేషణలో ఉన్నాయి. దోర జామపండును తింటున్న రామచిలుక, తనకు దగ్గర్లో మరో చెట్టుపై దిగులుగా ఉన్న కాకిని చూసింది. ‘కాకి బావా ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు?’ అంది. ‘ఈ సృష్టిలో అన్ని ప్రాణులు అందంగా, ఆనందంగా ఉన్నాయి.

Published : 08 Mar 2021 01:16 IST

డవిలోని జీవులన్నీ తెల్లవారుతుండగానే ఆహార అన్వేషణలో ఉన్నాయి. దోర జామపండును తింటున్న రామచిలుక, తనకు దగ్గర్లో మరో చెట్టుపై దిగులుగా ఉన్న కాకిని చూసింది. ‘కాకి బావా ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు?’ అంది. ‘ఈ సృష్టిలో అన్ని ప్రాణులు అందంగా, ఆనందంగా ఉన్నాయి. మాకు మాత్రం అసహ్యకరమైన ఈ నల్లని, వికృత రూపం ఉంది. గొంతుకూడా బాగోదు. కానీ మాలాగే నల్లగా ఉన్న కోకిలమ్మేమో కమ్మని పాటలు పాడుతుంది. అందుకే కోకిలను అందరూ ప్రేమిస్తారు. మమ్మల్నేమో ద్వేషిస్తారు. ఎంగిలి మెతుకులు తిని బతకడం బాధాకరం. మా అంత కష్టం మరే ప్రాణికీ లేదు’ అని కాకి తన గోడు వెల్లబోసుకుంది

‘సీత బాధ సీతదే! పీత బాధ పీతదే! అన్న సామెత అందరికీ తెలిసిందేగా. ఎవరికి కష్టాలు లేవు? వారి వారి స్థాయికి తగిన కష్టాలు వారికి ఉంటాయి. వాటికి భయపడితే మనుగడ సాధించగలమా? ఎవరికైనా ఈ అడవిలో ఆహారం కానీ, మరేదైనా సౌకర్యం కానీ ఉన్నచోటే లభించవుగా! అయినా మీ కాకులు ఎంత గొప్పవో తెలుసా? ఆహారం దొరికితే మీసాటి కాకులు నాలుగింటిని పిలిచి దొరికిన దాన్ని పంచుకుంటాయి. మీలో ఎవరైనా గాయపడితే, మీరు పదిమంది చేరి సంఘీభావం తెలుపుతారు. మరే ప్రాణుల్లో అయినా ఇలా చూడగలరా? ఐక్యతకు మారు పేరు మీరు’ అంది చిలుక.

కాకి మౌనంగా వినసాగింది. పితృ దేవతలకు మొక్కినప్పుడు మీకు ముందుగా ఆహారం పెడతారు. అంటే మిమ్మల్ని పితృదేవతలకు ప్రతిరూపంగా భావిస్తున్నప్పుడు నువ్వెందుకు చింతించాలి. ఈ యోగ్యత మరే పక్షులకూ లేదు కదా! అందుకే మన ఈ అడవిలో ఎవరూ తక్కువవారు కాదు. గొప్ప వారు లేరు. ఎవరి జీవన విధానం వారిదే! ఈ మాత్రం ఎందుకు ఆలోచించలేకపోయావు అని రామచిలుక కాకితో అంది.

‘చిలుకా నువ్వు చెప్పింది నిజమే. ఒకరిని చూసి ఈర్ష్యపడటం కన్నా ఉన్నదాంతో సంతృప్తి చెందాలని తెలుసుకున్నాను. ఇకపై జీవితంలో ఎన్నడూ నిరాశకు లోను కాను. ఉన్నంతలోనే సంతోషంగా జీవించాలి అని నీ ద్వారా తెలుసుకున్నాను. వెళ్లి వస్తాను’ అంటూ కాకి ఆహార అన్వేషణకు బయలు దేరింది.

- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని