ఏనుగమ్మ ఏనుగు.. గర్వమున్న ఏనుగు!

ఒక పిల్ల ఏనుగుకు తన ఆకారం చూసుకొని మిడిసిపాటు ఎక్కువైంది. ఎంతటి వారైనా తన బలం ముందు పచ్చడి కావాల్సిందే అనుకుంది. అది తనకన్నా చిన్న చిన్న జంతువులన్నింటినీ భయపెట్టసాగింది. అల్పప్రాణులు దానికి భయపడి అది చెప్పినట్లు చేసేవి. అది తల్లి ఏనుగుకు తెలియదు....

Updated : 29 Mar 2021 03:13 IST

క పిల్ల ఏనుగుకు తన ఆకారం చూసుకొని మిడిసిపాటు ఎక్కువైంది. ఎంతటి వారైనా తన బలం ముందు పచ్చడి కావాల్సిందే అనుకుంది. అది తనకన్నా చిన్న చిన్న జంతువులన్నింటినీ భయపెట్టసాగింది. అల్పప్రాణులు దానికి భయపడి అది చెప్పినట్లు చేసేవి. అది తల్లి ఏనుగుకు తెలియదు.
అది ఒకసారి అడవిలో చెట్టుతో ‘నేను తలుచుకుంటే నిన్ను ఒక్క దెబ్బకు కూల్చివేయగలను. నా గురించి ఏమనుకున్నావో’ అంది. ఆ మాటలకు చెట్టు మౌనంగానే ఉంది. కానీ దాని పక్కనే ఉన్న గడ్డిపరక మాత్రం ఆ ఏనుగును చూసి నవ్వసాగింది. అప్పుడు పిల్ల ఏనుగుకు కోపం వచ్చి దాన్ని తన కాళ్లతో గట్టిగా తొక్కి ‘హ్హ..హ్హ..హ్హ..’ అంటూ బిగ్గరగా నవ్వింది. గడ్డిపరక తలవంచుకుని ఏనుగు కాలు తీసి పక్కకు జరిగిన వెంటనే తిరిగి లేచి నిలబడింది. మళ్లీ గున్న ఏనుగును చూసి నవ్వింది. ఏనుగు కోపం తారస్థాయికి చేరింది. ‘ఏంటి ఇంకా నువ్వు పచ్చడి కాలేదా?’ అని తిరిగి కాళ్లతో తొక్కింది. అప్పుడు కూడా గడ్డిపరక వంగి అది కాలు తీయగానే లేచి నిలబడి ‘గజరాజా! మీ ఏనుగుల సేవకు మాత్రమే నేను గౌరవం ఇస్తాను. కానీ నీకు కాదు. అందుకే వినమ్రంగా వంగి ఉన్నాను’ అంది.
మళ్లీ ఒకసారి ఏనుగు తన బలం, గొప్పతనం గురించి ఇతరులతో చెబుతూ.. బండరాయినైనా నేను పిండి చేయగలనంది. అది విని ఒక చిన్న రాయి నవ్వింది. దాన్ని చూసిన ఏనుగు ‘నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నేను తలుచుకుంటే నిన్ను పచ్చడి చేయగలను’ అంది. అప్పుడు కూడా చిన్నరాయి నవ్వింది. వెంటనే ఏనుగు కోపంతో ఆ చిన్న రాయిని కూడా తన రెండు కాళ్లతో తొక్కింది. అయినా దానికి ఏమీ కాలేదు. ‘ఆ.. నీకు కూడా ఏమీ కాలేదా! నువ్వు ముక్కలై పోతావని అనుకున్నానే’ అని ఏనుగు అంది. రాయి నవ్వి.. ‘నీవు నన్నే ముక్కలుగా చేయలేకపోయావు. నా కన్నా పెద్దగా ఉన్న బండరాయిని ఏం చేయగలవు. నీ రెండు కాళ్ల బరువుకు నేను వంగి వినమ్రంగా ఉన్నాను తప్ప మరోటి కాదు’ అంది. ఆ మాటలు విని పిల్ల ఏనుగు ఆశ్చర్యపోయింది.
మరోసారి ఒక నదీ తీరంలో పిల్ల ఏనుగు తన బలం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో కప్ప ఒకటి నవ్వింది. వెంటనే ఏనుగుకు కోపం వచ్చి తన కాలును కప్పపైన పెట్టాలని చూసింది. కానీ అది తప్పించుకుంది. పిల్ల ఏనుగు ఆ బురదలో కూరుకుపోయి పైకి లేవలేకపోయింది.
తల్లి ఏనుగు దాన్ని తన బలంతో పైకి లాగి ‘నీ మాటలు నేను చాటుగా ఉండి అన్నీ విన్నానులే. గర్వం పనికిరాదు. నీకు బలం ఎక్కువగా ఉందనిపిస్తే ఆ కర్రదుంగలను పైకి ఎత్తి సామాన్యుడికి ఇల్లు కట్టుకున్నప్పుడు సాయం చెయ్యి. చిన్న పిల్లలను నీ మీద ఎక్కించుకుని వారికి ఆనందం కలిగించు. పెద్ద పెద్ద బరువులు మోసి ఇతరులకు ఉపకారం చేయి. అంతేగాని.. ఇలా అహంకారంగా మాట్లాడితే నీకు అవమానం తప్ప నీ పైన ఎవరికీ అభిమానం కానీ, అనురాగం కానీ ఉండవు. ఇప్పుడు నేను రాకపోతే నీ గతి ఏమై ఉండేది. ఈ బురదలో దిగబడి నీ ప్రాణాలే పోయేవి. అనవసరంగా ఇంకొకరు నవ్వినా నువ్వు పట్టించుకోవద్దు. మనమే గొప్ప అనే అహంకారం పనికిరాదు. మన కన్నా చిన్నగా ఉండే సింహమే మృగరాజు. కేవలం ఆకారం ఉన్నంతమాత్రాన మనం బలవంతులం కాదని తెలుసుకో’ అని తల్లి ఏనుగు మంచి మాటలు చెప్పింది. పిల్ల ఏనుగు తలవంచుకుని ‘అమ్మా! నేను  ఇకముందు ఎప్పుడూ గర్వంగా మాట్లాడను’ అని అంది. ఆ మాటలకు తల్లి ఏనుగు సంతోషించింది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని