కోతి.. కొబ్బరిబొండాం!

అడవిలో మిగతా జంతువులతో పాటు కోతి ఒకటి ఉండేది. దానికి కోపం చాలా ఎక్కువ. అందుకే ఎప్పుడూ ఏదో ఒక జంతువుతో కయ్యానికి కాలు దువ్వేది. కోతి స్వభావాన్ని చాలా కాలం నుంచి ఓ కాకి గమనిస్తోంది. ఓ రోజు అది కోతితో.. ‘ఇక్కడ జీవించే అన్ని జంతువులూ సాధు స్వభావంతో ఉంటున్నాయి. నువ్వు కూడా అందరితో స్నేహపూర్వకంగా ఉండు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎవరి అవసరం పడుతుందో చెప్పలేం’ అంది...

Published : 05 Apr 2021 00:19 IST

డవిలో మిగతా జంతువులతో పాటు కోతి ఒకటి ఉండేది. దానికి కోపం చాలా ఎక్కువ. అందుకే ఎప్పుడూ ఏదో ఒక జంతువుతో కయ్యానికి కాలు దువ్వేది. కోతి స్వభావాన్ని చాలా కాలం నుంచి ఓ కాకి గమనిస్తోంది. ఓ రోజు అది కోతితో.. ‘ఇక్కడ జీవించే అన్ని జంతువులూ సాధు స్వభావంతో ఉంటున్నాయి. నువ్వు కూడా అందరితో స్నేహపూర్వకంగా ఉండు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎవరి అవసరం పడుతుందో చెప్పలేం’ అంది.
కాకి మాటలకు కోతి ‘చాల్లే.. గొప్పగా నీతులు చెబుతున్నావు. ఒకరి అవసరం నాకేం పడుతుంది. నేనే అందరికీ సాయం చేస్తుంటాను. మొన్న నక్క, తోడేలు మన అడవిలోకి ప్రవేశిస్తే... వాటిని ధైర్యంగా తరిమికొట్టి మిగతా వాటి ప్రాణాలు కాపాడాను కదా! ఊళ్లోకి వెళ్లినప్పుడు నేను నీకు ఎన్నిసార్లు రొట్టెముక్కలు తెచ్చివ్వలేదు’ అని జవాబుగా చెప్పింది.

‘అలా అని ఇక ఎప్పటికీ నీకు ఎవరి అవసరమూ పడదని విర్రవీగకు’ అని కాకి హితవు పలికింది. కొన్ని రోజుల తర్వాత ఒకసారి ఏనుగుకు భరించరాని ఆకలి వేసింది. అది కోతి ఉన్న చెట్టు ఆకులను తొండం సాయంతో తినడం ప్రారంభించింది. దీంతో కొమ్మలు అటూ.. ఇటూ కదిలి కోతి జారిపడినంత పనైంది. వెంటనే వానరం కోపంతో.. ‘ఏయ్‌.. ఏనుగు! ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇక్కడ ఎవరూ లేరనుకున్నావా? కిందపడితే నా గతేంకాను. అయినా ఇక్కడ ఇన్ని చెట్లుండగా నీకు నేను నివాసం ఉండే ఈ చెట్టే కనిపించిందా? ఇలా కొమ్మలన్నింటినీ నీ పొట్టన పెట్టుకుంటే ఎలా? వెళ్లు.. వెళ్లు..’ అని కసిరి కొట్టింది.
‘పోయి.. పోయి.. ఈ పొగరుబోతు కోతితో నాకు గొడవేంటి?’ అనుకొని వేరొక చెట్టు దగ్గరకు వెళ్లి దాని ఆకులు తిని తన ఆకలి తీర్చుకుని వెళ్లిపోయింది. ఓ సారి ఊళ్లోకి వెళ్లిన కోతి కొబ్బరి తోటలోకి ప్రవేశించింది. దానికి అక్కడ నిగనిగలాడుతున్న కొబ్బరి బొండాం నేల మీద పడి కనిపించింది.
కోతి దాన్ని పైకి ఎత్తి ఆనందంతో.. ‘అబ్బా.. ఎంత అదృష్టం. ఈ రోజు పొద్దున్నే ఎవరి ముఖం చూశానో కానీ చక్కని బొండాం దొరికింది. దీని నీళ్లు తాగి, ఇందులోని కొబ్బరి తింటే భలే ఉంటుంది’ అనుకొని అడవికి బయలు దేరింది. దారిలో ఎదురైన జింకతో ‘చూశావా.. నా దగ్గర ఏముందో..’ అంది. ‘ఓ.. ఊరికే అలా సంబరపడిపోకు. వెయ్యిజన్మలెత్తినా దాన్ని పగలకొట్టడం నీ తరం కాదు. అది నీ దగ్గర ఉందన్న సంబరమే కానీ.. నీకు ఎందుకూ పనికి రాదు’ అంది.
కోతి ఆలోచనలో పడి.. ‘నిజమే! మరి దీన్ని పగలగొట్టేది ఎవరు?’ అనుకొంది. మిగతా జంతువులన్నీ ఎంత ప్రయత్నించినా దాన్ని పగలగొట్టలేకపోయాయి. అప్పుడు కాకి ‘ఎందుకలా తలబాదుకుంటారు. మీకు చేతకాదు. అదిగో ఏనుగు బావ వస్తున్నాడు. తను క్షణంలో ఈ పని చేసిపెట్టగలడు’ అని సలహా ఇచ్చింది. ఇంతకు ముందు తాను ఏనుగును కసురుకున్న విషయం గుర్తుకు వచ్చి కాస్త బెరుకుగానే బొండాం పగలగొట్టి ఇవ్వమని అడిగింది కోతి. గతంలో జరిగిన సంఘటన మనసులో పెట్టుకోని ఏనుగు, కోతి అడిగిన వెంటనే బొండాన్ని పగలగొట్టి ఇచ్చింది. కోతి దానిలోని నీరు తాగి, కొబ్బరిని తలాకొంచెం పంచిపెట్టింది. తర్వాత కాకితో కోతి.. ‘కాకమ్మ.. నీ మాటే నిజమైంది. జీవితంలో ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే అందరితో మంచిగా ఉండాలి. ఇకపై నేను తప్పక పాటిస్తాను’ అంది. చెప్పినట్లుగానే అది తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంది.

- ఆరుపల్లి గోవిందరాజులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని