అమ్మ చెప్పిన మాట

రివ్వున ఎగురుకుంటూ చెట్టు మీద వాలింది తల్లి పావురం. దానికి రెండు పిల్లలు. వాటిలో ఒకటి రెండో దానికంటే ఒక రోజు పెద్ద. అవి రెండూ తిండి కోసం బయటకు వచ్చాయి. అవి కొద్ది రోజుల నుంచి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటున్నాయి. తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పిల్లలిద్దరికీ అప్పటికే వివరంగా చెప్పింది తల్లిపావురం. అయినా పిల్లలు ఏం తింటున్నాయో, ఎలా తింటున్నాయో, ఎక్కడ తింటున్నాయో..

Updated : 30 Jun 2021 05:18 IST

రివ్వున ఎగురుకుంటూ చెట్టు మీద వాలింది తల్లి పావురం. దానికి రెండు పిల్లలు. వాటిలో ఒకటి రెండో దానికంటే ఒక రోజు పెద్ద. అవి రెండూ తిండి కోసం బయటకు వచ్చాయి. అవి కొద్ది రోజుల నుంచి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటున్నాయి.

తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పిల్లలిద్దరికీ అప్పటికే వివరంగా చెప్పింది తల్లిపావురం. అయినా పిల్లలు ఏం తింటున్నాయో, ఎలా తింటున్నాయో, ఎక్కడ తింటున్నాయో.. తినేటప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాయో లేదో.. అనే భయంతో అవి ఎక్కడికి వెళ్లినా వాటికి తెలియకుండానే వెనుకనే వెళ్లి గమనించసాగింది.

ఆరోజు కూడా అలాగే పిల్లల వెనుకగా వచ్చి చెట్టుపై వాలి చుట్టూ చూసింది. పిల్లపావురాలు రెండూ దగ్గర్లోని ఇంటి పెరట్లో చల్లిన గింజలు ఏరుకుని తింటున్నాయి. పిల్లలకు తిండి దొరికిందని సంతోషంగా వాటినే గమనిస్తున్న తల్లిపావురానికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. చిన్నపిల్ల తలొంచుకుని అదేపనిగా తింటుంటే, పెద్ద పిల్ల ఉండుండి తలెత్తి చుట్టూ చూస్తూ తింటోంది. అది గమనించిన తల్లిపావురం భయపడిపోయింది. ‘రెండింట్లో ఒక్కదానికి ప్రమాదం గురించి తెలిసినా... రెండో పిల్ల కూడా ప్రాణాలు కాపాడుకోగలుగుతుంది. కానీ ఇద్దరూ కలిసి ఎన్నాళ్లు తింటారు? ఇంకొన్ని రోజులు గడిస్తే విడివిడిగా ఎవరి ఆహారం వాళ్లు సంపాదించుకోవాల్సిందే. అలా తినేటప్పుడు చుట్టూ చూస్తేనే కదా ప్రమాదాల గురించి తెలిసేది. దొరికిందే చాలని తలొంచుకుని తినేస్తే ఎంత ప్రమాదం?’ అని ఆలోచిస్తూ చుట్టూ పరిశీలించి చూసింది తల్లి పావురం.

అక్కడికి దగ్గర్లో పూలకుండీ మాటున పొంచి ఉన్న పిల్లి దాని కంటపడింది. దాంతో పిల్లలకు రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టిన తల్లిపావురం ‘ఎగిరిపోండి.. వెంటనే అక్కడి నుంచి ఎగిరిపోండి’ అని అరుచుకుంటూ పిల్లల వైపు బయలుదేరింది. తల్లి అరుపులు పిల్లలకు వినిపించేలోగానే పిల్లి, పావురాలపైకి ఒక్క దూకు దూకింది. అది గమనించిన పెద్ద పిల్ల రెండోదాన్ని హెచ్చరిస్తూనే గబుక్కున పైకి ఎగిరిపోయింది. ఈలోపే చిన్నపిల్ల తోక పిల్లినోటికి చిక్కి పెనుగులాటలో ఈకలు ఊడిపోయాయి. అతికష్టమ్మీద దాన్నుంచి తప్పించుకుని ఎగిరిపోయింది. ఆ ఎగరటం.. ఎగరటం.. భయంతో ఎక్కడెక్కడో తిరిగి చివరకు చెట్టు మీదకు చేరింది చిన్నపిల్ల. అప్పటికే తల్లిపావురం పక్కన కూర్చుని ఉంది పెద్ద పిల్ల. పిల్లలిద్దరూ ప్రమాదం నుంచి బయటపడినా తల్లిపావురం గుండెల్లో భయం మాత్రం తగ్గలేదు. అక్కడికి చేరిన చిన్న పిల్ల మెల్లగా తల్లి పక్కకు చేరి.. ‘అమ్మా.. నా తోక ఊడిపోయింది చూడు. పిల్లి ఊడగొట్టేసింది’ అంది బాధగా.

‘నేను గమనిస్తూనే ఉన్నాను. అయినా భయం లేకుండా తలొంచుకుని అలా తినేయడమేనా? చుట్టూ చూసుకోవాలి కదా? ఇప్పుడు అక్క నీ పక్కన ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే పిల్లికి ఆహారమైపోయేదానివి తెలుసా? పొలాల్లోనో, విశాలమైన గడ్డి మైదానాల్లోనో అయితే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ఇళ్లలో అలా కనిపెట్టడం కష్టం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి’ అంది తల్లిపావురం.

‘అవునమ్మా! నువ్వు చెప్పావు. అక్క కూడా చెప్పింది. అయినా నేనే పట్టించుకోలేదు. అందుకే నా తోక ఊడిపోయింది’ అంది తల్లి రెక్కల కిందకు చేరి ఏడుస్తూ.. ‘పెద్దవాళ్లు చెప్పింది వినాలి. మనచుట్టూ అన్నీ ప్రమాదాలే. అందుకని మనం ఏమి తిన్నా, ఎక్కడ ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి రేపట్నుంచి కొద్ది రోజులు నువ్వు నా కూడా బయటకు రా. నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి’ అంది తల్లి.

‘సరే అమ్మా..! వస్తే తోక ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పుతావా ?’ అంది అమాయకంగా చిన్న పిల్ల తల్లినే చూస్తూ.. ‘తోకదేముంది. పోతే మళ్లీ వస్తుంది. కానీ ప్రాణం ఒక్కసారి పోతే మళ్లీ రాదు. అందుకని ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నేర్పుతా...’ అంది నవ్వుతూ తల్లిపావురం. ‘అవునమ్మా..! నువ్వు చెప్పింది నిజం’ అంది పెద్ద పిల్ల తల్లి దగ్గరకు జరగుతూ.. ‘అమ్మంటే నువ్వే’ అంటూ తల్లి రెక్కల్లో ఒదిగిపోయింది పిల్లపావురం.

- అనసూయ కన్నెగంటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని