కోకిల గానం.. కాకికి జ్ఞానోదయం!

ఒక పావురం గాల్లో ఎగురుతోంది. అలా వెళ్తూ వెళ్తూ.. అనుకోకుండా కిందకు చూసింది. ఒక కాకి పిల్ల పడిపోయి ఉండటం గమనించింది. ‘అయ్యో!’ అనుకుంటూ అది అమాంతం కిందకు దిగింది. కాకిపిల్లను కాపాడేందుకు చుట్టూ చూసింది. దగ్గర్లోనే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద ఒక కాకి తన పిల్లలతో ఉండటం పరిశీలించింది.

Published : 08 Jul 2021 00:41 IST

ఒక పావురం గాల్లో ఎగురుతోంది. అలా వెళ్తూ వెళ్తూ.. అనుకోకుండా కిందకు చూసింది. ఒక కాకి పిల్ల పడిపోయి ఉండటం గమనించింది. ‘అయ్యో!’ అనుకుంటూ అది అమాంతం కిందకు దిగింది. కాకిపిల్లను కాపాడేందుకు చుట్టూ చూసింది. దగ్గర్లోనే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద ఒక కాకి తన పిల్లలతో ఉండటం పరిశీలించింది.

‘ఒక కాకికి గాయమైతే తోటి కాకులన్నీ ఏకమై వస్తాయి. కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా ఆహారాన్ని కూడా అన్నీ కలిసి పంచుకుని తింటాయి. కలిసికట్టుగా ఉండటం కాకుల్ని చూసి నేర్చుకోవాలి’ అని తన తల్లి గతంలో చెప్పిన మాటలు పావురానికి గుర్తుకొచ్చాయి.

కానీ తోటికాకి పడిపోతే పట్టించుకోకుండా చెట్టుపైనే ఉన్న కాకుల్ని చూసి ఆశ్చర్యపోయింది పావురం. ఎగురుకుంటూ వెళ్లి ఆ చెట్టు మీద వాలి.. ‘ఒక కాకి పిల్ల అక్కడ పడిపోయి ఉంది. నువ్వు చూడలేదా?’ అని అడిగింది పావురం. అప్పుడు ఆ తల్లి కాకి బిగ్గరగా నవ్వి ‘తెల్లనివన్నీ పాలూ కావు. నల్లనివన్నీ కాకులూ కావు!’ అంది. ‘అంటే?’ సరిగా అర్థం కాక కాకిని అడిగింది పావురం. ‘అది కోకిల పిల్ల. నిన్నటి వరకూ నా గూటిలోనే నా పిల్లలతో పాటు పెరిగింది. కానీ నేడు కావ్‌.. కావ్‌.. అని కాకుండా కుహూ..కుహూ.. అని రాగం తీసింది. వినగానే తరిమేశాను’ అంది తల్లి కాకి.

‘ఎంత పని చేశావు కాకీ! నీకు తోటి పక్షులపై సానుభూతి లేదా? రెక్కల బలం లేని ఆ కోకిల పిల్ల ఎగరలేక పడిపోయింది. నీకు దాన్ని చూస్తే జాలి కలగడం లేదా?’ పావురం అడిగింది. ‘లేదు!’ ఏ మాత్రం ఆలోచించకుండా పావురానికి బదులిచ్చింది తల్లి కాకి. పావురానికి కాకి బుద్ధి చూసి అసహ్యం వేసింది. కోకిల పిల్ల అవస్థ చూసి బాధేసింది. ‘కోకిలకు గూడుకట్టడం రాదు కనుక వాటి గుడ్లను నీ గూటిలో చేరుస్తాయని నీకూ తెలుసు. పాపం ఇందులో ఆ పిల్ల తప్పేముంది. నిన్నటి వరకూ కాపాడిన నువ్వే.. కనికరం లేకుండా ఈ రోజు ఇలా తరిమేయడం బాగోలేదు. మనందరమూ.. రెక్కలున్న పక్షులం. మనలో మనం సాయం చేసుకోవాలి. అంతేగాని నా సంతానం కాదని తోటి పక్షులను గాయపరచకూడదు. ఇప్పటికైనా నీలో మార్పు రావాలి. కోకిలపై చులకన భావం పోవాలి.  కోకిలను కాపాడి చేసిన తప్పును సరిదిద్దుకో’ అంది పావురం.

కానీ పావురం మాటలను తల్లి కాకి వినలేదు. ముందుకు రాలేదు.

అంతలోనే కాకిపిల్లలు వాటి రెక్కల బలం కూడదీసుకుని కోకిల పిల్ల వద్దకు చేరాయి. అది చూసిన పావురానికి చాలా ఆనందం వేసింది. తల్లి కాకి ఆశ్చర్యపోయింది. ‘ఓ కాకీ.. నీలో రాని మార్పు నీ పిల్లల్లో వచ్చింది. రేపటి కాకి-కోకిల స్నేహానికి నేడు బీజం పడింది. ఈ మార్పు చాలు!’ అంటూ పావురం కూడా అక్కడకు చేరింది.

కాసేపటికి తల్లి కాకి కూడా కోకిల పిల్ల దగ్గరకు వచ్చి వాలింది. అన్నీ కలిసి కోకిల పిల్లను కాపాడాయి. తల్లి కాకిలో వచ్చిన మార్పును చూసి పావురం ఆనందించింది. గాయం నయమైన కోకిల పిల్ల తేరుకుని ‘కుహూ.. కుహూ..’అని రాగం తీసింది. పావురంతోపాటు కాకులు కూడా ఆ కోకిల గానం విని చాలా సంతోషించాయి.

- కె.వి.లక్ష్మణ రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని