ముళ్లపంది సాయం!

ఒక అడవిలో ముళ్లపంది, కుందేలు స్నేహంగా ఉండేవి. ముళ్లపందికి ముళ్లున్నా దాని మంచితనం, సహాయం చేసే గుణాన్ని కుందేలు మెచ్చుకునేది. కుందేలు అడవిలో దొరికే చిన్న చిన్న దుంపలు, పండ్లు తినేది.

Published : 14 Jul 2021 00:44 IST

ఒక అడవిలో ముళ్లపంది, కుందేలు స్నేహంగా ఉండేవి. ముళ్లపందికి ముళ్లున్నా దాని మంచితనం, సహాయం చేసే గుణాన్ని కుందేలు మెచ్చుకునేది. కుందేలు అడవిలో దొరికే చిన్న చిన్న దుంపలు, పండ్లు తినేది. ముళ్లపంది పురుగులు, కప్పలు మొదలైనవి తిని.. ఓ చెట్టు దగ్గర రెండూ కలుసుకుని బోలెడు కబుర్లు చెప్పుకునేవి. ముఖ్యంగా వాటి పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా అందివ్వాలో అని మాట్లాడుకునేవి.

ఒకరోజు కుందేలు పిల్లలకు తిండి దొరకలేదు. అవి నీరసంగా పడుకున్నాయి. వాటి నీరసాన్ని చూసి తల్లి కుందేలు బాధపడి పరుగున తన మిత్రుడు ముళ్లపంది దగ్గరకు వెళ్లి తన పిల్లల బాధ వివరించింది.

‘అయ్యో..! బాధపడకు, నీకు సహాయం చెయ్యకపోతే ఇక మన స్నేహానికి అర్థం ఏముంది? కొంచెం దూరంలో ఒక చెట్టు చూశాను. దానికి బోలెడు పండ్లు ఉన్నాయి. ఆ చెట్టు మీదున్న కోతి ఒక్కటే వాటిని తింటూ బతుకుతోంది. నాతో రా.. ఆ కోతిని కొన్ని పండ్లు కోసి కింద వెయ్యమని అడుగుదాం. అవి తీసుకువెళ్లి నీ పిల్లలకు తినిపించు’ అని చెప్పింది ముళ్లపంది.

‘అలాగే చేద్దాం పదన్నా..’ అని కుందేలు, ముళ్లపంది ఆ చెట్టు వద్దకు వెళ్లాయి. అప్పుడే కోతి రెండు పండ్లను తింటూ కనబడింది. ‘కోతి మామా! నీ చెట్టుకు బోలెడు పండ్లు ఉన్నాయి కదా. మాకో అయిదు ఇవ్వవా, కుందేలు పిల్లలు ఆకలితో ఉన్నాయి’ అని అడిగింది ముళ్లపంది. ‘అయ్యో! అయిదేమిటి ఎన్ని కావాలంటే అన్ని తీసుకువెళ్లండి. చెట్టుకు బోలెడున్నాయి కదా! ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ఎలా?’ అని కోతి ఎంతో వినయంగా అంది. కొమ్మల మీదకు అటు, ఇటు దూకి చాలా పండ్లు తెంచి కింద పడేసింది. కోతి మంచితనానికి కుందేలు, ముళ్లపందులు కృతజ్ఞతలు చెప్పాయి.

‘మరి.. ఇన్ని పండ్లను నా పిల్లల దగ్గరకు ఎలా తీసుకువెళ్లాలి?’ అని కుందేలు అడిగింది. ‘ఉపాయంతో ఏదైనా సాధించవచ్చు చెల్లీ. ఒక పని చేద్దాం.. పండ్లన్నింటినీ దగ్గరకు చేర్చి కుప్పగా వేద్దాం. నేను ఆ కుప్ప మీద దొర్లుతాను. అవన్నీ నా ముళ్లకు గుచ్చుకుని నా వీపు మీద నిలబడతాయి. వెంటనే నీ పిల్లల దగ్గరకు వెళ్లి వాటిని అక్కడ విదిలిస్తాను. వాటిని నీ పిల్లలు తిని ఆకలి తీర్చుకుంటాయి’ అని చెప్పింది ముళ్లపంది.

ఆ ఉపాయం కుందేలుకూ నచ్చింది. రెండూ కలిపి పండ్లతో సహా పిల్లల దగ్గరకు వెళ్లాయి. వాటిని తిని తమ ఆకలి తీర్చుకున్నాయి. ‘అన్నా.. నాకు ఇంత సాయం చేసి నా పిల్లల ఆకలి తీర్చావు. మరి నేను కూడా నీకొక సాయం చేస్తాను. నాతో రా’ అని కుందేలు ముళ్లపందిని ఓ మోడువారిన చెట్టు దగ్గరకు తీసుకువెళ్లింది. చెట్టు కాండం దగ్గర బోలెడు పురుగులు కనబడ్డాయి. వాటిని ముళ్లపంది హాయిగా తిని కుందేలు చెల్లికి బోలెడు కృతజ్ఞతలు చెప్పింది.

- కంచనపల్లి వేంకట కృష్ణారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని