అడవి న్యాయం!

తోటి స్నేహితులతో ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. పొరపాటున దారి తప్పి పక్కనే ఉన్న మరో అడవిలోకి వచ్చింది ఒక గున్న ఏనుగు. ఆ అడవి అంతా దానికి కొత్తగా అనిపించింది. పరిసరాలు ఎప్పుడూ చూసినట్లుగా అనిపించలేదు.

Updated : 10 Aug 2021 06:26 IST

తోటి స్నేహితులతో ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. పొరపాటున దారి తప్పి పక్కనే ఉన్న మరో అడవిలోకి వచ్చింది ఒక గున్న ఏనుగు. ఆ అడవి అంతా దానికి కొత్తగా అనిపించింది. పరిసరాలు ఎప్పుడూ చూసినట్లుగా అనిపించలేదు. అమ్మ కనిపిస్తుందేమో అని ఆశగా చూసింది. ఎక్కడా కనపడలేదు. అంతలోనే, ఒక నక్క పొదల నుంచి బయటకు వచ్చింది. ‘ఏయ్‌.. ఏనుగు పిల్లా.. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా అడవిలో ఎప్పుడూ నిన్ను చూడలేదు. ఇక్కడికి కొత్త జంతువు రావాలంటే మా రాజుగారి అనుమతి తీసుకోవాలి. నువ్వు తీసుకున్నావా?’ అని ప్రశ్నించింది.

‘లేదు.. నాకు ఈ అడవి నియమాలు తెలియవు. పక్కనే ఉన్న అడవి నుంచి తప్పిపోయి వచ్చాను’ అంది గున్న ఏనుగు. ‘ఓ.. అలాగా.. అయితే నిన్ను మా రాజు గారి దగ్గరకు తీసుకెళ్తాను... పద’ అంటూ గున్న ఏనుగును తీసుకెళ్లసాగింది నక్క. దారిలో అడవిలోని జంతువులు అన్నీ గున్న ఏనుగును చూసి అనుసరించడం మొదలు పెట్టాయి. ‘పాపం.. మన అడవి నియమాలు తెలియక వచ్చినట్లుంది. రాజుగారికి ఆహారం కావడం ఖాయం’ అంటూ గుసగుసలాడుకున్నాయి జంతువులు.

నక్క, సింహం గుహ దగ్గరకు తీసుకెళ్లి.. ‘మహారాజా.. బయటకు రండి. మీకు ఓ శుభవార్త మోసుకు వచ్చాను. మీ కోసం ఆహారం పట్టుకొచ్చాను’ అంటూ గట్టిగా పిలిచింది. అడవికి రాజైన సింహం బయటకు వచ్చింది. బలిష్టమైన శరీరంతో గంభీరంగా ఉంది ఆ సింహం. రాగానే గున్న ఏనుగును చూసి వివరాలు అడిగింది.

‘మహారాజా..! నన్ను క్షమించండి. నేను చాలా చిన్న దాన్ని. పక్కనే ఉన్న అడవి నుంచి పొరపాటున ఈ అడవిలోకి వచ్చాను. నా కోసం మా అమ్మానాన్నలు, స్నేహితులు, తోబుట్టువులు ఎదురుచూస్తూ ఉంటారు. నా కోసం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. దయచేసి నన్ను వదిలేయండి. మీ అనుమతి లేకుండా మరోసారి ఈ అడవిలో అడుగు పెట్టను’ అంటూ ప్రాధేయపడింది గున్న ఏనుగు. ‘లేదు. నిన్ను క్షమించలేను. మా అడవి న్యాయాన్ని తప్పలేను. నీకు శిక్ష పడాల్సిందే. నువ్వు ఆహారం కావాల్సిందే’ అంటూ సింహం పంజా విసరడానికి ముందుకు వచ్చింది.

ఇంతలోనే రివ్వున ఎగురుతూ ఓ కాకి అక్కడకు వచ్చింది. ‘మహారాజా..! ఆగండి.. పాపం.. ఏమీ తెలియని ఆ ఏనుగు పిల్లను చంపకండి’ అన్నది కాకి. ‘ఏం.. ఎందుకు? మాకే ఎదురు చెబుతావా? ఎంత ధైర్యం నీకు?’ అంటూ గర్జించింది సింహం. ‘శాంతించండి.. మహారాజా! నేను చెప్పిన మాటలు పూర్తిగా వినండి. కొన్ని రోజుల క్రితం మన అడవికి చెందిన ఎలుగుబంటి, పొరపాటున ఆ ఏనుగు పిల్ల ఉండే అడవికి వెళ్లింది. కానీ అక్కడ రాజుగారు మన ఎలుగును ఏమీ అనకుండా తిరిగి పంపించారు. కావాలంటే ఎలుగుబంటిని అడగండి అంది. ఎలుగు వైపు చూసింది సింహం.. ‘నిజమేనా?’ అన్నట్లుగా.

‘నిజమే.. మహారాజా! మన అడవిలో లాగానే వాళ్లకూ ఇలాంటి చట్టమే ఉందట. ఇతర జంతువులు వస్తే చంపేస్తాయంట. కానీ అలాంటి చట్టాల వల్ల అమాయక జంతువులు చనిపోతున్నాయని దాన్ని అమలు చేయడం లేదట’ అన్నది ఎలుగుబంటి. ఆలోచనలో పడింది సింహం. ఎత్తిన పంజాను వెనక్కు తీసుకుంది’ మన ఎలుగుబంటిని చంపకుండా వదిలేశారు. కాబట్టి మనమూ ఈ ఏనుగుపిల్లను వదిలేయడమే మంచిది. ఇక నుంచి మనమూ ఈ చట్టానికి ముగింపు పలుకుదాం’ అన్నది సింహం. జంతువులన్నీ సంతోషంగా చప్పట్లు కొట్టాయి. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది గున్న ఏనుగుకు. సింహం తినగా మిగిలిన ఆహారం దొరికేదని ఆశపడ్డ నక్క మాత్రం నిరాశ చెందింది.

‘సగౌరవంగా ఈ ఏనుగును తన అడవికి చేర్చండి’ అంటూ ఎలుగుబంటిని, కాకిని సింహం ఆదేశించింది. గున్న ఏనుగుకు తోడుగా ఎలుగుబంటి, కాకి బయలుదేరాయి. కాకి దారి చూపిస్తూ ఉంటే ఎలుగుబంటి, కాకి అనుసరించాయి. ‘ఓ కాకీ.. సమయానికి నువ్వు రాకపోతే మీ రాజుగారికి నేను ఆహారం అయ్యేదాన్ని. నువ్వు నాకు మరో జన్మ ఇచ్చావు. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను’ అంది గున్న ఏనుగు.

‘నీకు ఒక విషయం చెప్పాలి. నిన్ను రక్షించడం కోసం మేమిద్దరం రాజుగారితో అబద్ధం చెప్పాం. నిజానికి మీ అడవికి ఎలుగుబంటి వెళ్లనేలేదు’ అంది కాకి. ఆశ్చర్యపోయింది ఏనుగు పిల్ల. ‘అలాగా.. నాకు గొప్ప సహాయం చేశారు. మీరు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తాను. దారి తప్పి అమాయక ప్రాణులు అడవిలోకి వచ్చిప్పుడు చంపే చట్టాన్ని అమలు కాకుండా చూస్తాను. ఎందుకంటే మా నాన్న ఏది చెప్పినా.. మా రాజుగారు కచ్చితంగా వింటారు’ అంది గున్న ఏనుగు. ఈ మాటలకు కాకి, ఎలుగుబంటి సంతోషించాయి.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని