ధైర్యమే ఆయుధం

నాతవరంలో ఉండే గణపయ్య.. చుట్టు పక్కల పల్లెల్లో వరి, పప్పుధాన్యాల వ్యాపారం చేసేవాడు. పల్లెల్లో కొని పట్టణంలో ఎక్కువకు అమ్మి లాభం గడించేవాడు. పంటలు తనకే అమ్మాలని రైతులకు పంట విత్తే సమయంలోనే పెట్టుబడిగా అప్పుల్ని ఇచ్చేవాడు. పంట చేతికి వచ్చాక వసూలు చేసేవాడు.

Updated : 14 Aug 2021 03:09 IST

నాతవరంలో ఉండే గణపయ్య.. చుట్టు పక్కల పల్లెల్లో వరి, పప్పుధాన్యాల వ్యాపారం చేసేవాడు. పల్లెల్లో కొని పట్టణంలో ఎక్కువకు అమ్మి లాభం గడించేవాడు. పంటలు తనకే అమ్మాలని రైతులకు పంట విత్తే సమయంలోనే పెట్టుబడిగా అప్పుల్ని ఇచ్చేవాడు. పంట చేతికి వచ్చాక వసూలు చేసేవాడు.

ఒక ఏడాది వానలు పడక పంటలు పండలేదు. రైతులు సరిగా అప్పులు తీర్చలేకపోయారు. మరో ఏడాది ఉల్లి ధరలు బాగా పెరిగాయని ఎక్కువ మొత్తంలో సరకు కొని నిల్వచేశాడు గణపయ్య. సరిగ్గా ఉల్లి బస్తాల్ని పట్నం పంపేసరికి ధర అమాంతం పడిపోయింది. ఉల్లిపాయలు కూడా కుళ్లిపోయాయి. దీంతో చాలా నష్టం వచ్చింది.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగిలేసరికి తట్టుకోలేకపోయాడు. మనశ్శాంతి కోసం ఎటైనా వెళ్లాలనుని, తీర్థయాత్రలు చెయ్యాలని బయలుదేరాడు. పుణ్యనదుల్లో స్నానం చేస్తూ.. దైవ దర్శనాలతో కొన్నాళ్లు కాలం గడిపాడు గణపయ్య.

ఒకరోజు శ్రీకాళహస్తిలో బాల్యమిత్రుడు కనిపించాడు గణపయ్యకు. అతడి పేరు గుణకరుడు. ‘ఏమిటిలా.. అయిపోయావు.. కారణమేంటని?’ ఆప్యాయంగా అడిగి ఇంటికి తీసుకువెళ్లాడు. గుణకరుడితో తన కష్టాలన్నీ వెల్లబోసుకుని మనశ్శాంతి కోసం వచ్చినట్లు చెప్పాడు గణపయ్య. అంతా విని ‘వీటికే బెంబేలెత్తి పోయావా?’ అన్నాడు హేళనగా గుణకరుడు. ‘నీకు ఎగతాళిగా ఉందా? నావి చిన్న సమస్యలా?’ అన్నాడు గణపయ్య.

‘చిన్నవే.. నీకు తెలియని నా మిత్రుడొకరు పడిన కష్టాలు చెబితే ఆశ్చర్యపోతావు’ అన్నాడు గుణకరుడు. ‘అలాగా.. చెబితే వింటాను’ అన్నాడు గణపయ్య. ‘గతేడాది వచ్చిన అంటువ్యాధితో ఆ మిత్రుడి ఇద్దరు కుమార్తెలు.. భర్తల్ని, అత్తమామల్ని కోల్పోయారు. అది తెలిసిన అతడి భార్య గుండెపోటుతో చనిపోయింది. గోరుచుట్టుపై రోకటిపోటులా వ్యాపారమూ దివాళా తీసింది.’ అని గుణకరుడు చెప్పాడు. ‘అన్ని కష్టాలను ఎలా తట్టుకున్నాడు?’ అడిగాడు గణపయ్య.

‘భయంతో పారిపోకుండా ధైర్యంగా సమస్యను అర్థం చేసుకుని పరిష్కారాలు వెదికాడు. అతడు చేసిన మంచి పని ఏంటంటే మరో వ్యాపారం ప్రారంభించాడు. స్థిమితంగా ఆలోచించాడు. అమ్మాయిలది చిన్న వయసే కాబట్టి వాళ్లకు మళ్లీ పెళ్లి జరిపించాడు’ అని చెప్పాడు గుణకరుడు. ‘నిజమా! అతడితో పోలిస్తే నావి అసలు సమస్యలే కావు’ అని అన్నాడు గణపయ్య.

‘అందుకే చెప్పాను. సమస్యలకు భయపడి పారిపోకూడదు. కష్టాలొచ్చినప్పుడే తట్టుకుని ఎదురు నిలవాలి. బాధలు లేని జీవితమే ఉండదు. ప్రకృతికే తప్పలేదు.. మనం ఎంత? వర్షం కురవాలంటే మేఘం బద్దలవ్వాలి. పంట పండాలంటే భూమిని నాగలితో దున్నాలి. విత్తనాలు కావాలంటే కంకుల్ని బండమీద కొట్టాలి. విత్తనం మొలకెత్తాలంటే అది రెండుగా చీలాలి. గుడ్డు పగలకుండా జీవి బయటకు రాదు. కష్టం లేనిదే ఫలితం ఉండదు. రాటుదేలుతున్న కొద్దీ రత్నంలా మెరుస్తావు. నా మాటల్లో పరిష్కారం కనబడితే.. మళ్లీ జీవితంలో పైకి రావడానికి ప్రయత్నించు’ అన్నాడు గుణకరుడు.

తనలో మళ్లీ ఒకప్పటి ఉత్సాహం ప్రవేశించగా.. ఇంటికి బయలుదేరాడు గణపయ్య. అతడు లేచి వెళ్లిపోగానే గుణకరుడి భార్య.. ‘నాకు తెలియని కొత్త మిత్రులెవరున్నారండి మీకు. మీరు చెప్పింది ఎవరి గురించి?’ అనడిగింది.

అతడు గట్టిగా నవ్వి.. ‘‘అదంతా కల్పించింది. మామూలుగా చెబితే వినేవాడా? ‘నువ్వలాగే చెబుతావు. అనుభవించిన వాడికి తెలుస్తుంది కష్టం’’ అనేవాడు. ఇప్పడలా కాకుండా ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తాడు. వాడిలో ఆత్మవిశ్వాసం పెంచి మునుపటి మనిషిని చేయడానికే అలా చెప్పాల్సి వచ్చింది’’ అని బదులిచ్చాడు గుణకరుడు.

- నారంశెట్టి ఉమా మహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని