చిట్టెలుక సమయస్ఫూర్తి!

అదొక చిట్టడవి. కలుగులో నుంచి అప్పుడే బయటకు వచ్చిందొక చిట్టెలుక. ఆకలి వేసి, చుట్టూ చూసింది. కాస్తంత దూరంలో ఏదో కనిపించడంతో ముందుకు కదిలింది. అలా వెళ్లిందో లేదో బుస్సు బుస్సుమంటూ శబ్దం వినిపించడంతో.. భయంతో గజగజా వణికిపోసాగింది.

Updated : 10 Sep 2021 00:17 IST

అదొక చిట్టడవి. కలుగులో నుంచి అప్పుడే బయటకు వచ్చిందొక చిట్టెలుక. ఆకలి వేసి, చుట్టూ చూసింది. కాస్తంత దూరంలో ఏదో కనిపించడంతో ముందుకు కదిలింది. అలా వెళ్లిందో లేదో బుస్సు బుస్సుమంటూ శబ్దం వినిపించడంతో.. భయంతో గజగజా వణికిపోసాగింది. తాను చూసుకోకుండా ఓ పాము పుట్ట దగ్గరకు వచ్చానని తెలుసుకుంది. పైగా పుట్టమీద పాము తనను చూసి పడగ విప్పి బుస కొడుతోందని గ్రహించడానికి చిట్టెలుకకు ఎంతో సమయం పట్టలేదు.

‘పిచ్చి ఎలుకా! కోరి కోరి.. నీ శత్రువునైన నా కోరలకు చిక్కావు. అసలే ఆకలితో ఉన్నా. నా అదృష్టం బాగుంది. పెద్దగా అలసిపోకుండా ఆహారం దొరికింది’ అంటూ పాము జరజరా పాక్కుంటూ చిట్టెలుకకు దగ్గరగా వచ్చింది. చటుక్కున పట్టుకొని లటుక్కున నోట్లో వేసుకునేంతలో చిట్టెలుక ధైర్యం తెచ్చుకుని.. ‘ఆగు మిత్రమా!’ అంది.

ఎలుక తనను ‘మిత్రమా!’ అని పిలవడం పాముకు ఆశ్చర్యంగా అనిపించి, ఒక్కసారిగా ఆగింది. ‘మరో క్షణంలో నిన్ను తినే నేను.. నీకు ఎలా స్నేహితుణ్ని అవుతాను. భయంతో మతి భ్రమించిందా?’ అని అడిగింది పాము. ‘నీ ప్రశ్నకు సమాధానం చెబితే నన్ను విడిచిపెట్టేస్తావా మరి?’ మరింత ధైర్యంగా అడిగింది చిట్టెలుక. ‘నీ సమాధానం నచ్చితేనే విడిచిపెడతాను’ అని పాము అంది. పాము తన దారిలోకి వస్తోందని చిట్టెలుకకు అర్థమైంది. ‘అయితే విను!’ అని చెప్పడం ప్రారంభించింది.

‘శివుడి కుమారుడైన కుమారస్వామి వాహనం నెమలి. కానీ శివుడి మెడలో ఉండే పాముతో స్నేహంగా మెలుగుతుంది. అదే విధంగా శివుడి మరో కుమారుడైన వినాయకుడి వాహనం ఎలుక. దాంతో కూడా పాము స్నేహంగానే ఉంటుంది. ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ జాతివైరాలను పక్కనపెట్టాయి. ఆకలి అవసరం మాత్రమే. స్నేహం అనేది బంధం. అవసరం కన్నా.. బంధం ఎప్పుడూ గొప్పదే. పైగా ఈ రోజు వినాయక చవితి కనుక వినాయకుడికి వాహనంగా ఉన్న మా జాతిపై గౌరవం చూపించి నన్ను విడిచిపెడతావో.. ఏకదంతుడి ఆగ్రహానికి గురవుతావో నువ్వే తేల్చుకో. చంద్రుడికి పార్వతీదేవి శాపం గురించి నీకు తెలుసుకదా..! ఇప్పటికీ నీకు వినాయకుడంటే భయభక్తులు లేకుంటే.. నీ కళ్లముందే ఉన్న నన్ను తినేయ్‌’ అంది చిట్టెలుక.

ఎలుక మాటలు విన్న పాము, ఆలోచనలో పడింది. దానికి కాస్త భయం కూడా వేసింది. కాసేపటి తర్వాత ‘నాకు నీ సమయస్ఫూర్తి, భక్తి నచ్చాయి. నీ వల్ల నాకు తెలియని విషయాలు చాలా తెలిశాయి. చిట్టెలుకవే అయినా కొత్త విషయాలు చెప్పిన నువ్వు.. నాకు గురువుతో సమానం. నిన్ను తింటే ఎలాగూ నా ఆకలి కూడా పూర్తిగా తీరదు. అందులోనూ వినాయక చవితి రోజు నిన్ను చంపడం మహా పాపం!’ అంటూ పాము చిట్టెలుకను మెచ్చుకోలుగా చూస్తూ పాక్కుంటూ తన దారిన తాను వెళ్లిపోయింది.
‘బతుకు జీవుడా!’ అనుకుని తానూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది చిట్టెలుక. అంతకంటే ముందు వినాయకుడికి మనసులోనే మనసారా భక్తితో దండం పెట్టుకుంది.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని