మంచి సింహం!

అనగనగా ఒక అడవి. అందులో రాజుగా ఒక సింహం ఉండేది. అది ఒకరోజు కుందేలును తన దగ్గరకు పిలిపించుకుంది. అది ధైర్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పుడు మృగరాజు కుందేలుతో ‘చూడు కుందేలా! మన అడవికి లాభాలు కలిగించే పనులు ఏమిటో చెప్పు.. వాటి వల్ల అందరికీ మేలు జరగాలి’ అని అంది.

Updated : 14 Sep 2021 00:45 IST

నగనగా ఒక అడవి. అందులో రాజుగా ఒక సింహం ఉండేది. అది ఒకరోజు కుందేలును తన దగ్గరకు పిలిపించుకుంది. అది ధైర్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పుడు మృగరాజు కుందేలుతో ‘చూడు కుందేలా! మన అడవికి లాభాలు కలిగించే పనులు ఏమిటో చెప్పు.. వాటి వల్ల అందరికీ మేలు జరగాలి’ అని అంది.

వెంటనే కుందేలు సంతోషించి ‘మృగరాజా! ముందు అడవి దున్నలు, పందికొక్కుల వంటి ప్రాణులతో ఇక్కడ నేలను తవ్వించండి. వర్షం పడి ఆ గుంటల్లో నీరు చేరుతుంది. అప్పుడు మన జంతువుల దాహార్తి తీరడమే కాకుండా పక్క అడవి జంతువులు కూడా ఇక్కడికి నీటిని తాగడానికి వస్తాయి. మిమ్మల్ని రాజుగా భావించి అవి ఇక్కడే ఉండిపోతాయి’ అని అంది.

అప్పుడు నక్క ‘చాలు నీ చచ్చు సలహా! మన అడవి జంతువులకే నిలువ నీడ లేదంటే పక్క అడవి జంతువులు కూడా వచ్చి ఇక్కడి నీటిని తాగుతాయట’ అని వెటకారంగా అంది. అప్పుడు సింహం నక్కను వారించి.. కుందేలు సలహా ప్రకారం అడవిలోని జంతువులకు ఆదేశం ఇచ్చింది. కుందేలు చెప్పిన ప్రకారం కొన్ని రోజులకు వర్షం పడి అక్కడ గుంటల్లో నీరు చేరింది.

మళ్లీ సింహం కుందేలును పిలిపించి ‘కుందేలా! నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే, జంతువుల దాహార్తి తీరింది. మరి ఇంకా ఏమి చేయమంటావు?’ అని అడిగింది. అప్పుడు కుందేలు ‘మృగరాజా! జంతువుల్ని తాము తిన్న పండ్ల గింజలను మట్టిలో నాటమనండి. అవి మొలకెత్తి ఈ అడవి అంతా ఆకుపచ్చగా మారడమే కాకుండా శాకాహార జంతువులకు కూడా కాయలు, పండ్లు లభిస్తాయి’ అని అంది. సింహం ఆ సలహాను కూడా అమలు పరచాలని జంతువులకు చెప్పింది. వర్షానికి విత్తనాలు మొలకెత్తి అడవి అంతా పచ్చగా కళకళలాడింది.

తర్వాత సింహం కుందేలును తిరిగి పిలిపించింది. అప్పుడు నక్క దాన్ని చూసి ఈర్ష్ష్యతో ‘మరి నీ ఆహారం సంగతి నువ్వు చూసుకున్నావు. మరి మా మాంసాహారుల గతి ఏమిటి?’ అని అడిగింది. కుందేలు నవ్వి ‘నక్క మామా! అక్కడికే వస్తున్నాను. మృగరాజా! మీకు మంచి పేరు రావాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు’ అని అంది. వెంటనే నక్క ‘ఇది జంతువులను చంపవద్దని చెబుతుంది. అది మాత్రం దుంపలు, పండ్లను తింటుంది’ అని అంది. ‘నువ్వు ఊరుకో!’ అని సింహం నక్కను గట్టిగా హెచ్చరించి కుందేలును సలహా ఇవ్వమంది.

‘ఏమీ లేదు మృగరాజా! మీరు, మీతోపాటు పెద్దపులి, చిరుతపులి వంటి క్రూరమృగాలు మాంసం కోసం చిన్న జంతువుల మీద పడి చంపకుండా ఉండాలి’ అని అంది. ‘మరి మేం శాకాహారానికి అలవాటు పడాలా?!’ అని అంది నక్క వెటకారంగా.

‘అదేం కాదు. రోజూ ఆయుర్దాయం మూడి ఎన్నో జంతువులు సహజంగా మరణిస్తున్నాయి కదా! వాటిని ఆహారంగా చేసుకోండి’ అని అంది. అప్పుడు సింహం అంగీకరించి కుందేలు సూచనలు అమలు పరిచింది. ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ సంతోషంతో ‘మృగరాజుకు జై’ అంటూ సింహం ముందు గంతులు వేస్తూ నృత్యం చేశాయి. నీటికోసం పక్క అడవి నుంచి వచ్చే జంతువులు కూడా తమ అడవిలో చనిపోయిన జంతువులను సింహం కోసం తెచ్చేవి. తన సలహాలతో అడవి స్వరూపాన్నే మార్చిన కుందేలును సింహం తన వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని