గండు చీమ సాహసం

ఒక అడవిలో ‘రాజా’ అనే ఏనుగు ఉండేది. ‘నాలాంటి తొండం, బలమైన కాళ్లు ఎవరికీ లేవు. నా అంత బలశాలి కూడా లేరు’ అంటూ విర్రవీగేది. చెట్ల కొమ్మలు విరిచేస్తూ అడవి అంతా తిరిగేది. ఎంత చెప్పినా వినక పోవడంతో పాటు, మిగతా జంతువుల మీద దౌర్జన్యం చేసేది. ఎవరెన్ని రకాలుగా చెప్పినా సరే రాజాలో కొంచెం కూడా మార్పు రాలేదు.

Updated : 16 Sep 2021 01:33 IST


క అడవిలో ‘రాజా’ అనే ఏనుగు ఉండేది. ‘నాలాంటి తొండం, బలమైన కాళ్లు ఎవరికీ లేవు. నా అంత బలశాలి కూడా లేరు’ అంటూ విర్రవీగేది. చెట్ల కొమ్మలు విరిచేస్తూ అడవి అంతా తిరిగేది. ఎంత చెప్పినా వినక పోవడంతో పాటు, మిగతా జంతువుల మీద దౌర్జన్యం చేసేది. ఎవరెన్ని రకాలుగా చెప్పినా సరే రాజాలో కొంచెం కూడా మార్పు రాలేదు.

‘రాజాని ఎలా కట్టడి చేయాలి?’ అనే విషయంపై జంతువులన్నీ చర్చించాయి. ఎవరైతే రాజాను మారుస్తారో వారికి మంచి బహుమతి ఇస్తామని అడవికి రాజు అయిన సింహం ప్రకటన చేయించింది. జంతువులన్నీ తమకు తోచిన సలహాలు ఇచ్చాయి. కానీ రాజాను మారుస్తామని ఏ జంతువూ ముందుకు రాలేదు.

‘నాకు ఒక వారం గడువు ఇవ్వండి నేను రాజాను మారుస్తాను’ అంటూ ముందుకొచ్చింది ఒక గండు చీమ. జంతువులన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ‘ఇంత బలవంతులమైన మేమే రాజాని మార్చలేం మొర్రో! అంటుంటే కాళ్ల కింద పడి నలిగిపోయే నీతో ఏమవుతుంది’ అంటూ ఎగతాళి చేశాయి. ‘ఒక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు!’ అంటూ మృగరాజు సింహాన్ని, పులిని, తోటి జంతువులన్నింటిని అంగీకరించేలా చేసింది నక్క. ఎలాగైనా రాజాకు బుద్ధి రావాలి అనుకుంటూ అన్ని జంతువులు సమ్మతిని తెలిపాయి.

ఒకరోజు వేటగాళ్లు ఏనుగులు సంచరించే దారిలో పెద్ద గొయ్యి తవ్వి, అది కనబడకుండా కొమ్మలు, ఆకులు అలములతో  కప్పి చెట్ల చాటున మాటు వేశారు. ముందూ వెనకా చూసుకోకుండా కొమ్మలు విరిచేస్తూ వస్తున్న రాజా గుంతలో పడనే పడింది. ‘రక్షించండి!’ అని అర్థం వచ్చేలా అడవంతా ప్రతిధ్వనించేలా పెద్దగా ఘీంకరించింది. ఏ జంతువూ పట్టించుకోలేదు. ఆ గొయ్యిలో ఉన్న గండు చీమలు ఒక్కసారిగా రాజా తొండంలోకి ఎగబాకాయి. ఎక్కడపడితే అక్కడ అందిన చోటల్లా కుడుతూ ఉన్నాయి. ఒకవైపు గుంతలో పడడమే కాక ఈ చీమలతోనూ వచ్చింది చిక్కు అనుకుంటూ మరింత బిగ్గరగా అరవసాగింది రాజా.

ఆ సమయంలో నిద్రిస్తున్న రాజా తల్లిదండ్రులు తమ బిడ్డ అరుపులు విని వేగంగా వచ్చాయి. అప్పటికే వేటగాళ్లు తాళ్లతో బిగించి బంధించడానికి తయారవుతున్నారు. అంతే! ఆలస్యం చేయకుండా అడవిలో ఉన్న వేలాది చీమలు ఒక్కసారిగా వేటగాళ్లను కుట్టడంతో బతుకు జీవుడా!.. అనుకుంటూ రాజాను వదిలేసి పారిపోయారు.

రాజా అమ్మానాన్నలు, వాటి వెంట వచ్చిన జంతువులు తాళ్లను తెంచేసి, రాజాను బంధ విముక్తుణ్ని చేశాయి. ఈ సంఘటనతో రాజాలో మార్పు వచ్చింది. ‘అడవిలో అందరూ సమానమే. చిన్న చీమను కూడా ఎగతాళి చేయకూడదు’ అంటూ గండు చీమ తెలివి, సాహసానికి మెచ్చి మృగరాజు బహుమతులు ఇచ్చింది. అడవిలో జంతువులన్నీ గండు చీమను మెచ్చుకున్నాయి. గజరాజులో గర్వం పోయి ఆ రోజు నుంచి జంతువులతో స్నేహంగా మెలగసాగింది.

- కావలి నాగరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని