అతి గారాబం

ఒక కోతి తనకు ఉన్న ఒకే ఒక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచసాగింది. అది ఏది అడిగినా విసుగు చెందకుండా తెచ్చిచ్చేది. ఆ కోతి.. ఒంటె, మొసలి, గరుడపక్షితో స్నేహం చేసేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ పిల్లకోతి తనను ఒంటె పైన ఎక్కించి తిప్పమని తల్లిని ప్రాధేయ పడింది.

Updated : 23 Sep 2021 06:09 IST

క కోతి తనకు ఉన్న ఒకే ఒక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచసాగింది. అది ఏది అడిగినా విసుగు చెందకుండా తెచ్చిచ్చేది. ఆ కోతి.. ఒంటె, మొసలి, గరుడపక్షితో స్నేహం చేసేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ పిల్లకోతి తనను ఒంటె పైన ఎక్కించి తిప్పమని తల్లిని ప్రాధేయ పడింది. తల్లికోతి తన మిత్రురాలైన ఒంటెకు తన బిడ్డ కోరికను తెలియజేసింది. ఒంటె సరేనని ఆ పిల్లకోతిని పైన ఎక్కించుకొని అటూ ఇటూ తిప్పుతూ ఒక మామిడి తోటకు తీసుకొని వెళ్లింది. అక్కడ ఆ పిల్ల కోతి తనకు అందిన మామిడిపళ్లను తెంపుకొని తిని ఆనందించింది.

తర్వాత ఒకరోజు ఆ పిల్లకోతి.. తనకు నీటిపై తిరగాలని ఉందని తల్లితో చెప్పింది. అప్పుడు తల్లికోతి తన మిత్రురాలైన మొసలికి తన బిడ్డ కోరికను చెప్పి, వీపుపై తన బిడ్డను ఎక్కించుకుని నీటిలో తిప్పమని బతిమాలింది. మొసలి సరేనని దాన్ని నీటిలో తిప్పింది. పిల్లకోతి తన కోరిక తీరినందుకు ఎంతో సంతోషించింది.

ఆ తర్వాత మరికొన్ని రోజులకు ఆ పిల్ల కోతి తనకు ఆకాశంలో పక్షిలా విహరించాలని ఉన్నట్టు తన తల్లితో చెప్పింది. అప్పుడు తల్లికోతి తన మిత్రురాలైన గరుడ పక్షిని పిలిచి తనకోసం తన బిడ్డను దానిపైన ఎక్కించుకుని ఆకాశంలో విహరించమని కోరింది.

అప్పుడు గరుడ పక్షి ‘అలాగే మిత్రమా! కానీ ఆకాశంలో నేను వేగంగా వెళ్లేటప్పుడు అది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అప్పుడు నేను ఏమి చేయలేను. ఎందుకంటే నేను ఎగరడం మీదనే నా దృష్టి పెడతాను తప్ప నీ బిడ్డను గట్టిగా పట్టుకోలేను’ అని అంది. అప్పుడు తల్లికోతి అది అలా చేయనే చేయదని, గతంలో అది నీటి మీద కూడా ప్రయాణం చేసిందంది. అప్పుడు మొసలి దాని గురించి ఏమీ ఫిర్యాదు చేయలేదని చెప్పింది.

ఆ మాటలు విని గరుడ పక్షి కూడా తల్లికోతి బలవంతం పై సరేనని దాన్ని తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఆకాశమార్గాన వెళ్లింది. అది ఎగిరి కొంచెం పైకి వెళ్లగానే పిల్లకోతి ఇంకా పైకి ఎగరమని దాన్ని కోరింది. గరుడ పక్షి అది మంచిది కాదని చెప్పినప్పటికీ ఆ పిల్లకోతి వినలేదు. చివరకు గరుడ పక్షి చేసేదేమీలేక దాన్ని ఇంకా పైకి తీసుకొని వెళ్లింది. పిల్లకోతి సంతోషించి పాటలు పాడ సాగింది. చేతులు ఊపసాగింది. గరుడ పక్షి ఎంత వారించినా అది వినలేదు. అది ఒక్కసారిగా పట్టుతప్పి కింద పడిపోయింది. అదృష్టవశాత్తూ అది ఒక పెద్ద గడ్డివాము పైన పడి చిన్న గాయంతో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. గరుడ పక్షి ఏడుస్తున్న ఆ పిల్ల కోతిని సముదాయించసాగింది. ఈ లోపుగా తల్లి కోతి అక్కడకు రాగానే గరుడ పక్షి ఆ సంఘటన గురించి తల్లికి చెప్పి దాని తల్లిని మందలించింది. ఆ తల్లికోతి దానికి ప్రాణాపాయం కలగనందుకు ఎంతో సంతోషించింది.
అప్పుడు గరుడ పక్షి తల్లికోతితో ‘నేను మొదటే కదల వద్దని చెప్పినా నీ బిడ్డ వినలేదు. అంతేగాకుండా నీ బిడ్డ ఆకాశంలో గాలికి నృత్యం చేయసాగింది. నువ్వు ఎంత గారాబంగా పెంచినప్పటికీ అది కోరిన ప్రతి కోరికను తీర్చటం నీకు మంచిది కాదు. అతి గారాబం పనికిరాదు. ఇప్పుడు దానికి ఏదైనా అయితే నేను, నీవు ఎంత బాధపడేవారమో కదా! మన స్నేహం సంగతి ఎలా ఉన్నా.. అందరితో నేను మాటలు పడాల్సి వచ్చేది! అదృష్టవశాత్తు దానికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. అతి గారాబం నీకూ నీ బిడ్డకూ మంచిది కాదు’ అని అంది.

ఆ మాటలను విన్న కోతిపిల్ల ‘అవును గరుడ మామా! నువ్వు చెప్పింది నిజమే! నువ్వు హెచ్చరించినా వినకపోవడం నాదే తప్పు’ అంది. మళ్లీ తల్లితో ‘అమ్మా! నేను పసిపిల్లను. నీవైనా ఆలోచించవద్దా?! ఇప్పుడు నాకు ఏదైనా అయితే నువ్వు ఎంత బాధపడేదానివి. పిల్లలం మేం అనేక కోరికలు కోరతాం. అవి తీర్చడం సబబేనా? కాదా? అని తల్లిదండ్రులు, పెద్దవారు ఆలోచించాలి కదా! మరోసారి నేను ఇటువంటి కోరికలను కోరనే కోరను. నాకు బుద్ధి వచ్చింది’ అంది.

ఆ మాటలకు తల్లి కోతి తన తప్పును గ్రహించి గరుడ పక్షిని క్షమించమని అడిగింది. ఇకముందు ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను అని హామీ ఇచ్చింది. ఆ మాటలకు గరుడపక్షి ఎంతో సంతోషించింది. ‘అతి గారాబం పనికి రాదు’ అని తల్లికోతి, ‘ప్రమాదకరమైన కోరికలను కోరరాదు’ అని పిల్లకోతి గ్రహించాయి. 

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని