గోరంత దీపం.. కొండంత వెలుగు!

వింధ్యగిరుల్లో సదానందస్వామి గురుకుల ఆశ్రమం ఉండేది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం విద్యార్థులు వచ్చేవారు. విద్యాధరపురం నుంచి వివేక దత్తుడు అనే విద్యార్థి వచ్చి గురుకులంలో చేరాడు. గురువుగారికి విధేయత చూపుతూ శ్రద్ధగా చదువుకోసాగాడు. అంతేకాకుండా గురువుగారి ఇంట్లోవారికి, గురుకులంలో అందరికీ అవసరమైన సహాయ సహకారాలూ అందించేవాడు.

Updated : 17 Aug 2022 12:22 IST

వింధ్యగిరుల్లో సదానందస్వామి గురుకుల ఆశ్రమం ఉండేది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం విద్యార్థులు వచ్చేవారు. విద్యాధరపురం నుంచి వివేక దత్తుడు అనే విద్యార్థి వచ్చి గురుకులంలో చేరాడు. గురువుగారికి విధేయత చూపుతూ శ్రద్ధగా చదువుకోసాగాడు. అంతేకాకుండా గురువుగారి ఇంట్లోవారికి, గురుకులంలో అందరికీ అవసరమైన సహాయ సహకారాలూ అందించేవాడు.

చదువు మీద శ్రద్ధ చూపిస్తున్న వివేకదత్తుడిని చూసి గురువైన సదానందస్వామి ఆనందించేవారు. కొన్నాళ్ల తర్వాత గురువుగారు శిష్యుడైన వివేకదత్తుడిని పిలిచారు. ‘నువ్వు విద్యలు పూర్తిగా నేర్చుకున్నావు. ఇక వెళ్లవచ్చు’ అన్నారు. ఆ మాటలు విని మొదట వివేకదత్తుడు ఆనందపడ్డాడు.. కానీ అంతలోనే ‘బయటకు వెళ్లి నేను ఏం చేయాలి?’ అనే ఆలోచనలో పడ్డాడు.

సంధ్యవేళ దాటింది. చీకటి పరుచుకుంటోంది. ఆ సమయంలో వివేకదత్తుడు గురువుగారి దగ్గరకు చేరాడు. గురువుగారు ఉన్నతాసనంపై కూర్చుని ఉన్నారు. ‘గురుదేవా! ఆశ్రమం నుంచి బయటకు వెళ్లడానికి నాకు సంకోచంగా ఉంది. బయటకు వెళ్లి ఏం చేయాలో తెలియడం లేదు’ అని మెల్లిగా వివేకదత్తుడు అన్నాడు.

గురువుగారు వివేకదత్తుని మాటలు విని ‘ఆశ్రమం అంతా చీకటి ఆవహించింది..’ అంటూ ఎదురుగా కనబడే చిరుదీపం వైపు చూశాడు. శిష్యుడు గురువుగారి ఆదేశాన్ని అర్థం చేసుకుంటూ, ఆ దీపం తీసుకుని ఆశ్రమంలోని అన్ని దీపాలను వెలిగించి గురువుగారి దగ్గరకు వచ్చాడు.

‘చూశావా! ఒక్క చిరుదీపంతో గురుకులమంతా వెలుగులు నిండిపోయాయి’ అని గురువుగారు వివేకదత్తుడితో అన్నారు. ఆ మాటలు విన్న వివేకదత్తుడు ‘గురుదేవా! ఇక నేను సమాజంలో చేయవల్సిందేంటో ఆదేశించండి. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’ అని చేతులు జోడించి వినయంగా అడిగాడు.

‘చూడు వివేకదత్తా! ఒక్క చిరుదీపంతో మన ఆశ్రమంలోని అన్ని దీపాలనూ వెలిగించి చీకటిని పారదోలి వెలుగులు నింపావు. అదే నీ కర్తవ్యం కూడా.. అలాగే   విద్య అనే వెలుగుతో, పిల్లలందరిలోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించు. వారిలో విజ్ఞానం అనే వెలుగులు నింపు. కులం, జాతి, వర్గం, రంగు అనే భేదాలు లేకుండా విద్యను బోధించే బాధ్యత నీపై ఉంది’  అని గురువుగారు కర్తవ్యం ఉపదేశించారు. స్పష్టత వచ్చాక వివేకదత్తుడు ఆనందంగా బయలుదేరాడు.

- బెహరా ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని