ఎవరి గొప్ప వారిదే!

అనగనగా ఒక అడవిలోని నదిలో.. బాతమ్మ తన బుజ్జి పిల్లతో ఆనందంగా జీవిస్తుండేది. ఆ నది ఒడ్డునే చింత చెట్టు మీద ఒక కొంగమ్మ తన చిన్ని బిడ్డతో సంతోషంగా ఉండేది. కొంగమ్మకు బాతమ్మంటే చిన్నచూపు. అది తనలా ఎగరలేదని కించపరిచేది. అడవిని పాలించే మృగరాజుకు లేక లేక చిట్టికూన పుట్టింది. దాంతో అడవిలోని జీవులన్నీ రేపు జరగబోయే తన బిడ్డ పుట్టిన వేడుకకు వచ్చి విందు ఆరగించి, ఆశీర్వదించాల్సిందిగా చాటింపు వేయించింది సింహం.

Published : 29 Sep 2021 01:14 IST

నగనగా ఒక అడవిలోని నదిలో.. బాతమ్మ తన బుజ్జి పిల్లతో ఆనందంగా జీవిస్తుండేది. ఆ నది ఒడ్డునే చింత చెట్టు మీద ఒక కొంగమ్మ తన చిన్ని బిడ్డతో సంతోషంగా ఉండేది. కొంగమ్మకు బాతమ్మంటే చిన్నచూపు. అది తనలా ఎగరలేదని కించపరిచేది.

అడవిని పాలించే మృగరాజుకు లేక లేక చిట్టికూన పుట్టింది. దాంతో అడవిలోని జీవులన్నీ రేపు జరగబోయే తన బిడ్డ పుట్టిన వేడుకకు వచ్చి విందు ఆరగించి, ఆశీర్వదించాల్సిందిగా చాటింపు వేయించింది సింహం.

బాతమ్మ తన బిడ్డను తీసుకుని నది ఒడ్డుకు వచ్చింది. చింత చెట్టు మీద కొంగమ్మను చూసి ‘మిత్రమా! విందుకు వెళుతున్నాము వస్తావా!’ అని అడిగింది. కొంగమ్మ పెద్దగా నవ్వింది. ‘నువ్వు నాలా ఎగరలేవుకదా! నీతో నడుచుకుంటూ వస్తే అక్కడ విందు ముగిసిపోతుంది. వేడుక దూరంగా కనిపించే ఆ కొండ వెనుక జరుగుతోంది. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి! వర్షంకూడా పడేలా ఉంది’ అంది వెటకారంగా కొంగమ్మ. పాపం బాతమ్మ తన బుజ్జి పిల్లతో టిక్కుం.. టిక్కుం... అని నడుచుకుంటూ కొండ వైపు అడుగులు వేసింది.

కొంచెం దూరం పోగానే పెద్దగా వర్షం మొదలైంది. ‘కొండ అవతలకు చేరటం ఎలాగబ్బా..!’ అని ఆలోచించింది బాతమ్మ. అటుగా ఓ చెరువు పారటం గమనించింది. అంతే... పరుగున వెళ్లి పిల్లతో సహా చెంగున చెరువులోకి దూకింది. హాయిగా ఈదుకుంటూ కొండ అవతలవైపునకు చేరుకుంది. మృగరాజుకు నమస్కరించి అభినందనలు తెలిపింది. దాని చిట్టికూనను దీవించి విందుకు కూర్చుంది బాతమ్మ. కడుపునిండా కమ్మటి పదార్థాలు ఆరగించింది. తరవాత మిత్రుడు కొంగమ్మ కోసం వెతికింది. వాన పడటంతో ఎగరలేక రాలేకపోయిందని తెలుసుకుంది. మృగరాజుకు విషయం చెప్పింది. ‘రాజా! ఇద్దరం కలిసే వద్దామనుకున్నాం. కానీ, వర్షం వల్ల కొంగమ్మ చేరుకోలేక పోయింది. ఆకలి మీద ఉంటుందేమో.. మీరు అనుమతిస్తే పొట్లం కట్టి తీసుకెళ్లి ఆహారం ఇస్తాను!’ అంది బాతమ్మ. మిత్రుడి ఆకలి గురించి ఆలోచిస్తున్న బాతమ్మ గొప్ప మనసుకు సింహం పొంగిపోయింది. ఆహార పొట్లంతో పాటు కానుకలు కూడా ఇచ్చి పంపింది. వేడుకకు వెళ్లి తిరిగొచ్చిన బాతమ్మని చూసి ఆశ్చర్యపోయింది కొంగమ్మ. బాతమ్మ తనలా ఎగరకున్నా... గొప్పగా ఈదగలదని, ప్రతి ఒక్కరిలో మరొకరిలో లేని గొప్పతనం ఉంటుందని గ్రహించింది. ఆనాటి నుంచి బాతమ్మనే కాదు ఏ జీవినీ చిన్నచూపు చూడలేదు కొంగమ్మ.

-పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు