జవాబు దొరికింది!

గోపి, రవి ఒకే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తెలివైన వారే. రవిని అందరూ ఇష్టపడతారు. రవి దగ్గరకు వెళ్లినంత ప్రేమగా స్నేహితులు తన దగ్గరకు రావట్లేదని గోపి బాధపడేవాడు. ఒకరోజు ఆటల సమయంలో రవితో కలిసి కేరింతలు కొడుతూ ఆడుతున్నారు పిల్లలు. గోపి కొంచెం దూరంగా నిలబడి నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని మొహంలో కోపం, బాధ, ఏదో తెలియని కసి.

Updated : 05 Oct 2021 02:19 IST

గోపి, రవి ఒకే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తెలివైన వారే. రవిని అందరూ ఇష్టపడతారు. రవి దగ్గరకు వెళ్లినంత ప్రేమగా స్నేహితులు తన దగ్గరకు రావట్లేదని గోపి బాధపడేవాడు. ఒకరోజు ఆటల సమయంలో రవితో కలిసి కేరింతలు కొడుతూ ఆడుతున్నారు పిల్లలు. గోపి కొంచెం దూరంగా నిలబడి నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని మొహంలో కోపం, బాధ, ఏదో తెలియని కసి.

వ్యాయామ ఉపాధ్యాయుడు ఇది గమనించారు. మరునాడు ఆటల సమయంలో ‘పిల్లలూ! ఈ రోజు మీ అందరికీ మెదడుతో ఆట.. సరేనా?’ అన్నారు. పిల్లలంతా ‘భలే.. భలే..!’ అని చప్పట్లు కొట్టారు. మాస్టారు వారందరికీ తలొక ప్రశ్నపత్రం ఇచ్చారు. అందులో అయిదు పదాలున్నాయి. ‘ప్రతి పదం గురించి మీ అభిప్రాయం ఒక్క వాక్యంలో రాయాలి. ఇది పరీక్ష కాదు. దిద్దడం, మార్కులు వేయడం ఉండదు. కాబట్టి స్వేచ్ఛగా, నిజాయతీగా రాయండి’ అని ప్రోత్సహించారు మాస్టారు.

అందరూ ఉత్సాహంగా రాశారు. రవి, గోపి కలిసి అందరి దగ్గర కాగితాల్ని సేకరించి మాస్టారుకు ఇచ్చారు. బడి గంట మోగడంతో కోలాహలంగా ఇళ్లకు వెళ్లిపోయారంతా. సీతాకోకచిలుకలు వెళ్లిపోయిన పూలతోటలా బోసిపోయింది బడి. మాస్టారు కూడా బయలుదేరుతూ గోపిని పిలిచి ‘ఈ కట్ట నీ సంచిలో ఉంచు. రేపు తీసుకుంటాను’ అని చెప్పి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లాక రవి ఏం సమాధానాలు రాశాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. రవి పత్రం తీసి గోపి చదవసాగాడు. మొదటి పదం ‘బడి’కి జవాబు... ‘చదువునూ, క్రమశిక్షణనూ నేర్పే గుడి’ అని ఉంది. రెండో పదం ‘మేఘాలకు’.. ‘వర్షాన్ని కురిపించి మొక్కల్ని బతికించి, మన కడుపు నింపే దేవతలు’ అని ఉంది. మూడో పదం ‘పాము’కు.. ‘ఎలుకల్ని తిని పొలంలో పంటను పాములు కాపాడతాయి’ అని రాశాడు. నాలుగో పదం కాకికి.. ‘అన్ని పదార్థాలు తిని కాకి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుతుంది’ అని ఉంది. ఇక అయిదోది ‘తోటి విద్యార్థుల్లో నువ్వు ఇష్టపడని ఒకరు’.. దీని సమాధానం కోసం ఆసక్తిగా చూశాడు గోపి. రవితో సహా అందరూ కచ్చితంగా తన పేరే ఇస్తారనుకున్నాడు. తీరా జవాబు చూసి ఆశ్చర్యపోయాడు రవి. ‘ఎవరూ లేరు. అందరూ మంచివారే’ అని ఉంది.

గోపికి తన జవాబు గుర్తొచ్చి సిగ్గు పడ్డాడు. తానేమో ‘ఎవరూ ఇష్టం లేదు. అందరూ చెడ్డవారే’ అని రాశాడు. తన మిగిలిన జవాబులు కూడా ఇప్పుడు తలుచుకుంటే చిన్నతనంగా అనిపించింది. బడికి.. ‘ఆదివారం, పండుగలూ తప్ప ప్రతిరోజూ వెళ్లి తీరాల్సిన తప్పనిసరి ప్రదేశం’ అనీ, మేఘాలకు... ‘పిడుగులతో చెట్లూ, ఇళ్లూ, ప్రాణుల్ని కాల్చేస్తాయి’ అనీ, పాముకు.. ‘ఇది మనల్ని కాటేసి విషంతో చంపేస్తుంది’ అనీ, కాకికి.. ‘నల్లగా, అసహ్యంగా ఉండి చెత్తంతా తింటుంది’ అని రాశాడు.
తెలివైన వాడు కనుక గోపికి ఎవరూ వివరించక్కర్లేకుండానే తన లోపం ఏంటో తెలుసుకున్నాడు. రవి అన్నింటినీ సానుకూల కోణంలో చూస్తున్నాడు. అందుకే లోకం కూడా అతనికి చేరువవుతోంది. తాను అన్నిటినీ చెడ్డగా భావిస్తున్నాడు. తనలో ప్రతికూల భావన ఉంచుకుని, లోకం తనకు చేరువ కావట్లేదని బాధపడుతున్నాడు. మరునాడు ఆటల సమయంలో గోపి తానే అందరి దగ్గరకూ వెళ్లి స్నేహంగా ఆడుకోసాగాడు. అందరూ సంతోషంగా రవితోలాగానే గోపితోనూ ఆడుకోసాగారు. దీన్ని గమనించిన మాస్టారు ఎంతో సంతోషించారు.

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని